పట్నా హైకోర్టు సీజేగా జస్టిస్ నర్సింహారెడ్డి

28 Dec, 2014 01:31 IST|Sakshi
పట్నా హైకోర్టు సీజేగా జస్టిస్ నర్సింహారెడ్డి

నియామకానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర
జనవరి 2న ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతల స్వీకారం

 
 సాక్షి, హైదరాబాద్: హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ లింగాల నర్సింహారెడ్డి పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా నియమితులయ్యారు. ఆయన నియామకానికి శనివారం ఉదయం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. ఆ ఉత్తర్వులు శనివారం మధ్యాహ్నం జస్టిస్ నర్సింహారెడ్డికి అందాయి. సోమవారం ఆయనకు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు ఘనంగా వీడ్కోలు పలకనున్నారు.
 
 జనవరి 2వ తేదీన ఆయన పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. వాస్తవానికి జస్టిస్ నర్సింహారెడ్డి ఈ నెల 18వ తేదీనే పట్నా హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. అయితే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అనారోగ్యానికి గురి కావడంతో జస్టిస్ నర్సింహారెడ్డి నియామకపు ఉత్తర్వులపై సంతకం కాలేదు. దీంతో ఆయన నియామకం కొంత ఆలస్యమైంది.
 
  తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్ర కోటా నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతున్న తొలి వ్యక్తి జస్టిస్ నర్సింహారెడ్డే. అన్నీ కలిసొస్తే, ఆయన సుప్రీంకోర్టుకు సైతం వెళ్లే అవకాశాలున్నాయని పరిశీలకులు అంటున్నారు. జస్టిస్ నర్సింహారెడ్డి ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో నంబర్ త్రీగా కొనసాగుతున్నారు. ఆయన వరంగల్ జిల్లా, గవిచర్ల గ్రామంలో 1953 ఆగస్టు 1వ తేదీన వ్యవసాయ కుటుంబంలో జన్మించారు.
 
 ఉస్మానియా నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1979లో న్యాయవాదిగా నమోదు అయ్యారు. 1996లో ఆయన ప్రభుత్వ న్యాయవాదిగా నియమితులయ్యారు. పలు ప్రభుత్వ, ఆర్థిక సంస్థలకు న్యాయసలహాదారుగా ఉన్నారు. కేంద్రం తరఫున హైకోర్టులో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2001లో హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2002లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
 

మరిన్ని వార్తలు