తపాలా  బిళ్ల  ఉన్నట్టా లేనట్టా?

13 Dec, 2017 04:02 IST|Sakshi

తొలి తెలుగు సభలో ‘సరస్వతీదేవి’ 

తెలంగాణలో తొలి సభకు జ్ఞాపకం ఏంటి?

ఇప్పటి వరకు తపాలాశాఖకు ప్రతిపాదించని రాష్ట్ర ప్రభుత్వం

పోతన స్టాంపు కోరుతున్న భాషాభిమానులు

ప్రత్యేక సందర్భాల్లో ఇలా తపాలా బిళ్లలను ముద్రించటం సహజం. మరి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరుగుతున్న తొలి ప్రపంచ తెలుగు మహాసభలను ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం ఈసారి తపాలా బిళ్లపై ఏ చిత్రాన్ని ఎంపిక చేసింది? భాగవతాన్ని తెలుగులో అమృతమయంగా మలిచిన పోతనదా, తెలంగాణ సంప్రదాయానికి చిహ్నంగా భాసిల్లుతున్న బతుకమ్మదా?

త్వరలో ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం కాబోతున్నా ఇప్పటి వరకు తపాలా శాఖకు తెలంగాణ నుంచి ఎలాంటి ప్రతిపాదన అందలేదు. గతంలో బతుకమ్మ చిత్రాన్ని పోస్టల్‌ స్టాంపుగా తేవాలని తెలంగాణ భావించింది. ఇప్పుడు తెలుగు మహాసభలకు గుర్తుగా దాన్ని ప్రతిపాదిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కానీ తెలుగు సాహితీ అభిమానులు మాత్రం బమ్మెర పోతన చిత్రంపై మక్కువ చూపుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోతన సమాధిని దర్శించి ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించినట్టు ప్రకటించిన నేపథ్యంలో తపాలా అధికారులు కూడా పోతన చిత్రాన్నే ఎంపిక చేస్తారని భావిస్తూ కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించారు. కానీ అక్కడ్నుంచి వారికి ఎలాంటి స్పష్టత అందలేదు. దీంతో అసలు తపాలా బిళ్ల ముద్రణ ఉంటుందా లేదా అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. 

ఏపీ, కర్ణాటక ప్రతిపాదనలతో తపాలా బిళ్లలు
ఇటీవల ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రతిపాదనలతో తపాలా శాఖ మూడు తపాలా బిళ్లలను ముద్రించింది. ఆదికవి నన్నయ, ద్రాక్షారామం భీమేశ్వరాలయం ప్రతిపాదనలను ఏపీ, మహాకవి ముద్దన ప్రతిపాదనను కర్ణాటక సమర్పించటంతో గత నవంబర్‌ ఒకటిన వాటిని తపాలా శాఖ ఆవిష్కరించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గురజాడ, కందుకూరి, కవయిత్రి మొల్ల, విశ్వనాథ సత్యనారాయణ, తరిగొండ వెంగమాంబ లాంటి వైతాళికుల స్టాంపులు విడుదలయ్యాయి. కానీ తెలంగాణ ప్రాంతానికి చెందినవారి చిత్రాలతో రూపొందలేదు. మరి ఇప్పటి వరకు తెలంగాణ వైతాళికులతో తపాలాబిళ్లలు రూపొందించనందున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రతిపాదిస్తే బాగుంటుందని తెలంగాణ తెలుగు భాషాభిమానులు కోరుతున్నారు.
–గౌరీభట్ల నరసింహమూర్తి

ఇది తొలి ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా విడుదల చేసిన తపాలా బిళ్ల. 1975 ఉగాది రోజున హైదరాబాద్‌ లాల్‌ బహదూర్‌ స్టేడియంలో మొదలైన తెలుగు మహాసభల్లో లక్ష మంది భాషాభిమానుల సాక్షిగా నాటి ముఖ్యమంత్రి ఈ స్టాంపును ఆవిష్కరించారు. ‘దేశభాషలందు తెలుగు లెస్స... ఎందరో మహానుభావులు అందరికీ వందనములు.. పంచదార కన్న, పనస తొనలకన్న, కమ్మని తేనెకన్న తెలుగు మిన్న’ అని తెలుగు భాష వైభవాన్ని సూచించే వాక్యాల మధ్య సాక్షాత్కరించిన సరస్వతీదేవి రూపాన్ని ఈ తపాలా బిళ్లలో ముద్రించారు. అప్పట్లో 25 పైసల ధరతో ముద్రించిన ఈ స్టాంపులు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. తెలుగువారు ఉత్తర ప్రత్యుత్తరాలకు ఈ తపాలాబిళ్లనే అతికించేందుకు ఇష్టపడటంతో మార్కెట్‌లో అప్పట్లో వాటికి కొరత ఏర్పడింది. 

మరిన్ని వార్తలు