జూనియర్‌ ఫ్రెండ్స్‌

22 May, 2020 10:32 IST|Sakshi

జూపార్కులో సింహం, పులి, ఆస్ట్రిచ్, నక్క కూనల జననం  

సందర్శకులను అలరించనున్న కొత్త వన్యప్రాణులు  

లాక్‌డౌన్‌ తర్వాతే జూ సందర్శనకు అవకాశం

బహదూర్‌పురా:  లాక్‌డౌన్‌ అనంతరం నెహ్రూ జూలాజికల్‌ పార్కులో సింహాలు, పులులు, నక్కలు, ఆస్ట్రిచ్‌ పక్షులు జూ సందర్శకులను అలరించనున్నాయి. ఇటీవల జూపార్కులోని ఆదిసన(రాధ), మాధవ్‌లకు రెండు సింహపు కూనలు జన్మించాయి. వాటిని డార్క్‌ రూమ్‌లో నుంచి డే క్రాల్‌లోకి విడుదల చేశారు. ప్రస్తుతం సింహపు కూనలు సమ్మర్‌ హౌజ్‌లో ఉన్నాయి. 2013లో సౌదీ అరేబియా ప్రిన్స్‌ సింహాలను జూకు బహుమతిగా అందించారు. జూలో వీటికి రాధ, మాధవ్‌లుగా పేర్లు పెట్టారు. ఇటీవల రెండు కూనలు జన్మించడంతో అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

రెండు నెలల క్రితం రాయల్‌ బెంగాల్‌ టైగర్‌(ఆశ) మూడు పులి కూనలకు జన్మనిచ్చింది. ఇటీవల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నక్కలు కూడా రెండు నక్క కూనలకు జన్మనిచ్చాయి. జూపార్కులో ఉన్న ఆస్ట్రిచ్‌ పక్షులు మూడు పిల్లలకు జన్మనిచ్చాయి. మొత్తం మీద లాక్‌డౌన్‌లో జూపార్కులో 10 కొత్త వన్యప్రాణులు సందర్శకులను అలరించనున్నాయి. బుడిబుడి నడకలతో జూపార్కు యానిమల్‌ కీపర్లను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఈ నెలాఖరు వరకు జూపార్కులో మరిన్ని కొత్త వన్యప్రాణులు పురుడు పోసుకునే అవకాశాలు ఉన్నాయి. జూలోని వన్యప్రాణులకు కరోనా వ్యాధి సోకకుండా పెద్దఎత్తున జాగ్రత్త చర్యలను జూ అధికారులు తీసుకుంటున్నారు.

మరిన్ని వార్తలు