మహబూబ్‌నగర్‌లో సిండికేట్‌గాళ్లు

26 Sep, 2019 10:25 IST|Sakshi

ఇప్పటికే సిండికేట్‌తో మద్యం ప్రియుల జేబులకు చిల్లు 

వచ్చే నెల దసరా పండుగను క్యాష్‌ చేసుకునే పనిలో వైన్‌షాపుల నిర్వాహకులు 

ఎక్సైజ్‌ అధికారులు దృష్టి సారిస్తేనే ఎమ్మార్పీ రేట్లకు అమ్మకాలు 

సాక్షి, మహబూబ్‌నగర్‌: ఇంకా కొత్త మద్యం పాలసీ ఖరారు కాకున్నా.. పాత పాలసే మరో నెల రోజుల పాటు గడుపు పెంచడంతో వచ్చే నెలలో ఉన్న దసరా పర్వదినం.. ఉమ్మడి జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వైన్‌షాపులు నిర్వహిస్తోన్న మద్యం వ్యాపారులకు జాక్‌పాట్‌గా మారింది. మద్యం టెండర్‌ గడువు ఈ నెలతోనే పూర్తి కావాల్సి ఉండగా కొందరు మద్యం వ్యాపారులు కొన్ని నెలల క్రితమే సిండికేట్‌గా మారి అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా షాపుల నిర్వహణ గడువు పెరిగిన క్రమంలో వచ్చే నెలలో ఉన్న దసరాను క్యాష్‌ చేసుకునే పనిలో పడ్డారు. సాధారణ రోజుల కంటే దసరా సీజన్‌లో మద్యం విక్రయాలు 50శాతం ఎక్కువగా ఉండడంతో పెద్ద మొత్తంలో అక్రమ సంపాదనకు తెరలేపారు. ఇప్పటికే ఎక్కువగా వ్యాపారం జరిగే చోట్ల అందరూ సిండికేట్‌గా ఏర్పడ్డారు. ఉమ్మడి జిల్లాలో 164 దుకాణాలు ఉండగా.. వీటి నిర్వహణ గడువు ఈ నెలాఖరు వరకు ఉంది. అన్ని షాపుల్లో కలిపి ప్రతి నెలా సుమారుగా రూ.130కోట్ల నుంచి రూ.140కోట్ల వరకు మద్యం అమ్ముడుపోతోంది. 

కొత్త పాలసీపై ఉత్కంఠ 
ఇంకా స్పష్టత లేని మద్యం కొత్త పాలసీపై ఆయా వ్యాపారుల్లో ఉత్కంఠ నెలకొంది. నిబంధనల ప్రకారం ఈనెలాఖరుతోనే మద్యం టెండర్‌ గడువు ముగుస్తుంది. దీంతో ఇప్పటికే కొత్త పాలసీని ప్రకటించి.. టెండర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాల్సి ఉంది. కానీ ఇంతవరకు నోటిఫికేషన్‌ వెలువడకపోవడంతో.. నోటిఫికేషన్‌ వెలువడేంత వరకు ప్రస్తుతం వైన్‌ షాపులు నిర్వహించుకుంటోన్న వ్యాపారులే కొనసాగనున్నారు. ఇదీలా ఉంటే 2017లో టెండర్లలో పాల్గొన్న ప్రతి అభ్యర్థి ఒక్కో దుకాణానికి రూ.లక్ష వరకు డిపాజిట్‌ చేశారు. అయితే  ప్రభుత్వం ఈ సారి టెండర్‌ ఫీజును రూ.2లక్షలకు పెంచే ఆలోచనతో ఉండడంతో ఎంత మంది టెండర్లలో పాల్గొంటారో అనే దానిపై చర్చ జరుగుతోంది.

మరోపక్క.. ఒకరిద్దరు వ్యక్తులు ఒక షాపుతో ఆగకుండా పలు మండలాలు, పట్టణాల్లో ఉన్న అనేక వైన్‌ షాపులకు టెండర్లు దాఖలు చేశారు. కల్వకుర్తి, దేవరకద్ర ప్రాంతంలో నల్లగొండ వాసులు, అలంపూర్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న మండలాల్లో షాపులకు కర్నూలుకు చెందిన వారు టెండర్లు దాఖలు చేశారు. కొందరు స్థానికులకు డబ్బులు ఇచ్చి మరీ వారితో టెండర్లు వేయించి.. వాటిని చేజిక్కించుకున్నారు. ఇప్పటికీ అదే ఆనవాయితీ కొనసాగుతోంది. అలంపూర్‌ నియోజకవర్గ పరిధిలో సిండికేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దు కావడంతో కర్నూలుకు చెందిన కొంతమంది మద్యం వ్యాపారులు స్థానికులతో కలిసి దుకాణాల కోసం పోటీ పడుతున్నారు.

ముఖ్యంగా అలంపూర్‌ చౌరస్తా, ఎర్రవెల్లి చౌరస్తా, శాంతినగర్, అయిజ ప్రాంతాల్లో మద్యం షాపులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటుంది. కల్వకుర్తి మండల కేంద్రంతో పాటు చారకొండ, వెల్దండలో సిండికేట్‌ వ్యాపారం జోరుగా సాగుతోంది. దేవరకద్ర మండల కేంద్రంలో స్థానికులు, నల్లగొండ వ్యాపారులతో కలిసి సిండికేట్‌గా మారి వ్యాపారం చేస్తున్నారు. చిన్నచింతకుంట, అడ్డాకుల, భూత్పూర్, మూసాపేటలో సిండికేట్‌ వ్యాపారం ఎక్కువగా ఉంటుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి, తెలకపల్లిలోనూ ఇదే పరిస్థితి ఉంది.  

ఇవి చాలా హాటు గురూ.. 
అత్యధిక మద్యం వ్యాపారం జరిగే ప్రాంతాల్లో టెండర్లు దక్కించుకునేందుకు చాలా మంది బడా వ్యాపారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే తమ ఆధీనంలో ఉన్న షాపులను వదులుకోవడం ఇష్టంలేని వ్యాపారులు తమకు పోటీగా ఎవరూ రాకుండా ఇప్పట్నుంచే జాగ్రత్త పడుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో అనేక ప్రాంతాల్లో ఉన్న పలు షాపులకు ప్రతిసారి ఎక్కువ పోటీ ఉంటుంది.

ముఖ్యంగా మహబూబ్‌నగర్‌ జిల్లా పరిధిలోని జడ్చర్ల, బాదేపల్లి, మిడ్జిట్, బాలానగర్, రాజాపూర్‌ మండలాలు.. నారాయణపేట జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ ఏరియా, మరికల్, ధన్వాడ, దామరగిద్ద మండలాల్లో, వనపర్తి జిల్లా పాన్‌గల్, రేవల్లి, గోపాల్‌పేట, ఘనాపూర్, అమరచింత, నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంతో పాటు బిజినేపల్లి, తెలకపల్లి, జోగుళాంబ గద్వాల జిల్లాలోని ఎర్రవెల్లి చౌరస్తా, అలంపూర్, ఇటిక్యాల మండలాల్లో మద్యం షాపులు దక్కించుకునేందుకు పోటీ భారీగా ఉంటుంది.  

మరిన్ని వార్తలు