పండుగ పూట.. మద్యం ధరలు ప్రియం

7 Oct, 2019 11:16 IST|Sakshi

పండుగపూట ప్రతీబాటిల్‌పై ఎమ్మార్పీకి మించి వసూళ్లు

సిండికేట్‌గా మారిన మద్యం వ్యాపారులు

బీరుపై రూ.10.. ఫుల్‌బాటిల్‌పై రూ.50 పెంపు

నిర్ణీత ధరలకే అమ్మాలంటున్న అధికారులు

సాక్షి, సిరిసిల్ల: మందుబాబులకు దసరాకు ధరల కిక్కు ఎక్కుతోంది. పండుగ పూట మద్యం ధరలు ప్రియమయ్యాయి. ఇవి సర్కారు పెంచిన ధరలు అనుకుంటే పొరపాటే.. జిల్లాలోని వైన్స్‌ యజమానులు సొంతంగా ఇష్టారీతిన ధరలు పెంచుకుని మద్యం అమ్ముతున్నారు. ఇదేందని అడిగితే.. ‘అంతా మా ఇష్టం’ అంటూ నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు. వైన్స్‌ల్లోనే కాదు బార్లలోనూ రేట్లు పెంచి మద్యంప్రియుల ను నిలువుదోపిడీ చేస్తున్నారు. బీరుకు రూ.10.. క్వార్టర్‌కు రూ.10.. ఫుల్‌బాటిల్‌కు రూ.50 చొప్పున అధికంగా వసూలు చేస్తూ.. మద్యం వ్యాపారులు పండుగ చేసుకుంటున్నారు.

బీరుపై రూ. 10.. ఫుల్‌పై రూ. 50 
జిల్లాలోని 75శాతం మద్యం దుకాణాల్లో అధిక ధరలకు అమ్ముతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదేందని మద్యం ప్రియులు అడిగితే.. ‘ప్రభుత్వం వద్దనంగా నెల రోజుల పాటు మద్యం దుకాణాలు నడపాలని ముక్కుపిండి ఫీజులు కట్టించింది. చెల్లించిన పైసలు చేతికి రావాలంటే ఇక ప్రభుత్వ నిర్ణయించిన ధరలకు పదో పరకో వేసి అమ్మకాలు జరిపితే నెల గడుస్తుంది’ అంటూ వ్యాపారులు బహిరంగంగానే చెబుతున్నారు. అందుకే మద్యం దుకాణదారులు ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీలపై రేట్లు పెంచి అమ్మడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇలా బీ రుపై పది రూపాయలు ఫుల్‌ బాటిల్‌పై యాబై రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఇలాంటి అమ్మకాలు వెన్స్‌లోనే కాదు బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌లో జరుగుతుండడం గమనార్హం. బార్‌లోని మద్యాన్ని బయటకు అమ్మడానికి వీలులేకున్నా.. అడ్డదారిలో అమ్మకాలు జరుపుతున్న వారిపై అబ్కారీ అధికారులు నిఘా వేయడం విఫలమవుతున్నట్లు విమర్శలున్నాయి.

దసరాపై దండిగా ఆశలు 
దసరా పండక్కు మన ప్రాంతంలో మద్యం ఎక్కువగా అమ్ముడు పోతుంది.ఇదే అవకాశంగా అనధికార పెంపును అమలు చేయడానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. మద్యం దుకాణాల నిర్వహణకు ప్రభుత్వానికి చెల్లించిన సొమ్మును ఎలాంటి నష్టం వాటిల్లకుండా చేజిక్కించుకో వడానికి కాస్త రేట్ల పెంచుకున్నట్లు తెలుస్తోంది.

బెల్టుషాపుల్లో  మరింత అదనం 
జిల్లాలో ప్రభుత్వం అనుమతితో  42వైన్‌ షాపులు, ఆరు బార్‌ అండ్‌ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటికి అనుబంధంగా అనధికారికంగా జిల్లాలో దాదాపు వెయ్యి వరకు బెల్ట్‌షాపుల  నిర్వహణ జరుగుతోంది. వీటిలో ఎమ్మార్పీకన్నా కనిష్టంగా రూ.10నుంచి గరిష్టంగా రూ.50 అధికం తీసుకుని మద్యాన్ని గ్రామాల్లో అమ్మకాలు జరుçపుతున్నది బహిరంగ రహస్యం. ప్రస్తుతం వైన్స్‌షాపుల్లోనే అధిక ధరలకు విక్రయిస్తుండడంతో ఇక బెల్టుషాపుల్లో మద్యంప్రియుల జేబులకు చిల్లుపడినట్లే అని పలువురు భావిస్తున్నారు.

అకున్‌ సబర్వాల్‌కు ఫిర్యాదు

అకున్‌ సబర్వాల్‌కు ఫిర్యాదు చేసినపోస్టు

రుద్రంగి(వేములవాడ): మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీకి మించి వసూలు చేస్తున్నారని రుద్రంగి మండలకేంద్రానికి చెందిన దేశవేని వినోద్‌కుమార్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అకున్‌సబర్వాల్‌కు శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా ఫిర్యాదు చేశాడు. ఎక్సైజ్‌ డిపార్టుమెంటు వారికి తగు చర్యల నిమిత్తం ఈ పోస్టును శనివారం ఫార్వర్డ్‌ చేశారు. అయితే ఆదివారం కూడా రుద్రంగిలోని మద్యం దుకాణంలో అధిక ధరలకే మద్యం విక్రయించడంతో అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. 

రేట్లు పెరగలేదు.. 
మద్యం ఎమ్మార్పీ రేట్లకు అమ్మాలి. ప్రస్తుతం రేట్లు పెంచారన్న దానిలో వాస్తవం లేదు. బార్‌ అండ్‌ రెస్టారెంట్లలో అమ్మకాలు గురించి తెలియదు. బార్‌లో సేవించేందుకు మద్యం అమ్మకాలు జరపాలన్న నిబంధన ఉంది. బయటకు బాటిల్స్‌ అమ్మకాలు జరగవు. పండుగలున్నాయని నిబంధనలను పాటించకుంటే అలాంటి వారిపై వచ్చిన ఫిర్యాదుపై చట్టపరిధిలో చర్యలకు వెళ్తాం. 
– చంద్రశేఖర్, ఎక్సైజ్‌ సీఐ, ఎల్లారెడ్డిపేట   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా