సిండి‘కేటు’ దోపిడీ

26 May, 2016 13:31 IST|Sakshi

     మద్యం డాన్‌ల రహస్య సమావేశం?
     ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయం
     మామూళ్ల మత్తులో ఎక్సైజ్ సిబ్బంది
     నిబంధనలకు విరుద్ధంగా పర్మిట్ రూమ్‌లు
     యథేచ్ఛగా కల్తీ మద్యం.. బెల్ట్‌షాపులు

 
ఖమ్మం క్రైం: మద్యం వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎక్సైజ్ నిబంధనలను పక్కనపెట్టి ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మద్యం సిండికేట్‌కు తలుపులు బార్లా తీస్తూ మందుబాబుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నెలవారీ మామూళ్లకు అలవాటుపడిన ఎక్సైజ్ సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

ఇష్టానుసారం ధరలు
జిల్లాలో 148 మద్యం దుకాణాలు ఉన్నాయి. మొదట్లో ఎమ్మార్పీ కంటే ఎక్కువకు విక్రయిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు, మూడు నెలలపాటు దీన్ని ప్రభుత్వం సీరియస్‌గా అమలు చేసింది. అప్పుడు ఎక్సైజ్ సిబ్బందికి పైసా మామూళ్లు ఇవ్వని వ్యాపారులు ఇప్పుడు మామూళ్లతో ముంచెత్తుతున్నారు. ‘మామూళ్లు ఇవ్వండి మీ ఇష్టం వచ్చిన రేటుకు అమ్ముకోండి’ అని ఎక్సైజ్ అధికారులు ఓపెన్‌గానే అంటున్నట్లు సమాచారం. వేసవికాలం కావడంతో మద్యం ప్రియులు బీర్లను ఎంచుకుంటున్నారు. ఇదే అదనుగా ఒక్కో బీరు బాటిల్‌పై రూ.15 నుంచి రూ.25 వరకు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. లిక్కర్ సీసాను రూ.10 నుంచి రూ.15 వరకు అధిక ధరకు అమ్ముతున్నారు.

సిండికేట్‌ల పండగ
సిండికేట్‌లు పండగ చేసుకుంటున్నారు. నిన్నటి వరకు ఎక్సైజ్‌శాఖ డెరైక్టర్‌గా పనిచేసిన అకున్ సబర్వాల్ వేరేశాఖకు బదిలీ కావడంతో మద్యం వ్యాపారులు, ఎక్సైజ్ సిబ్బందికి అడ్డూఅదుపు లేకుండా పోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. జిల్లా మద్యం సిండికేట్‌కు తలుపులు బార్లా తీయాలని కొంతమంది మద్యం డాన్‌లు చక్రం తిప్పుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు రహస్య సమావేశం కూడా నిర్వహించారని సమాచారం. ఈ సిండికేట్ అమలుకావడానికి కొంతమంది ఎక్సైజ్ సిబ్బంది కూడా సహకరిస్తున్నట్లు సమాచారం.

యథేచ్ఛగా పర్మిట్ రూమ్‌లు
ఇష్టానుసారంగా పర్మిట్ రూమ్‌లు నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటలకే మద్యం దుకాణాలు తెరుస్తున్నారు. రాత్రి 10 గంటలకు మూయాల్సిన షాపులను అర్ధరాత్రి వరకూ కొనసాగిస్తున్నారు. ఖమ్మం త్రీటౌన్ టింబర్ డిపో రోడ్డులోని ఓ మద్యం షాప్ చుట్టూ పర్మిట్ దుకాణాలు ఏర్పాటైనా ఎక్సైజ్ సిబ్బంది పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఇలా ఎన్నో ఉన్నా పట్టించుకునే వారే లేకపోవడం గమనార్హం.

కల్తీ విక్రయాలు
జిల్లావ్యాప్తంగా 46 బార్లుండగా వాటిలో ఖమ్మంలోనే 42 ఉన్నాయి. మిగిలినవి ఇల్లెందు, కొత్తగూడెంలో ఉన్నాయి. కొన్ని బార్లలో కల్తీ మద్యం విక్రయిస్తూ దోచుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఉదాహరణకు ఓ మద్యంప్రియుడు రూ.1500 బాటిల్ ఆర్డర్ చేస్తే మొదటి పెగ్గు వరకు అనుమానం రాకుండా తెచ్చి ఆ తర్వాత ఆ కాస్ట్‌లీ మద్యంలో చీప్‌లిక్కర్ కలిపి ఇస్తున్నట్లు సమాచారం. కొన్ని బార్లలో నాణ్యతలేని తినుబండారాలను అమ్ముతూ మద్యం ప్రియుల ఆరోగ్యాన్నీ పాడు చేస్తున్నట్లు వినికిడి.

గల్లీకో బెల్ట్‌షాప్
గల్లీకో బెల్ట్‌షాప్‌ను ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నా..ఈ బెల్ట్‌షాప్‌ల వల్ల ప్రభుత్వాదాయానికి గండిపడుతున్నా ఎక్సైజ్‌శాఖ పట్టించుకోకపోవడం గమనార్హం. ఆయా ప్రాంతంలో ఉన్న వైన్‌షాప్‌ల యజమానులే బెల్ట్‌షాపులకు మద్యం పంపిస్తున్నట్లు సమాచారం. ఈ బెల్ట్‌షాపుల నుంచి ఎక్సైజ్ సిబ్బందికి భారీగానే ముడుతుండటంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

మరిన్ని వార్తలు