కేసుల కొరడా! 

1 Apr, 2020 01:53 IST|Sakshi
బంజారాహిల్స్‌లో ఓ వాహనదారుడిని హెచ్చరిస్తున్న ట్రాఫిక్‌ పోలీస్‌

లాక్‌డౌన్‌ను లైట్‌ తీసుకుంటున్న పౌరులు

ఉల్లంఘించిన 3,359 మందిపై కేసుల నమోదు

16,360 వాహనాల సీజ్, రూ.75 లక్షల చలానాలు 

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్‌ను ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసుల కొరడా ఝుళిపిస్తున్నారు. గత ఆదివారం జనతా కర్ఫ్యూ తర్వాత ఎపిడమిక్‌ డిసీసెస్‌ యాక్ట్‌ 1897ను ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కేసు పెడతామని హెచ్చరించింది. ప్రాణాలు తీసే మహమ్మారి పొంచి ఉందన్న ప్రచారాన్ని కొంతమంది పట్టించుకోవడం లేదు. నిత్యావసరాలు, అత్యవసరాల పేరిట అకారణంగా నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్ల మీదకు వస్తున్నారు. దీంతో పోలీసులు కేసుల కొరడా బయటికి తీశారు. దొరికిన వారిని దొరికినట్లుగా కేసులు నమోదు చేస్తున్నారు. సీసీ కెమెరాల సాయంతోనూ పలు కేసులు నమోదు చేస్తుండటం గమనార్హం.

కేసుల వివరాలు ఇవీ.. 
సోమవారం నుంచి మంగళవారం వరకు తొమ్మిది రోజుల్లో అకారణంగా బయటికి వచ్చిన వారి సంఖ్య అధికంగానే ఉంది. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా వ్యాధి ఉన్న విషయాన్ని బయటికి వెల్లడించకుండా, విదేశాల నుంచి వచ్చి హోంక్వారంటైన్‌లో ఉండని వారు కూడా ఉన్నారు. ఇటీవల క్వారంటైన్‌ నిబంధనలు పాటించకుండా పలు వేడుకలు, విందులకు హాజరై కొత్తగూడెంకు చెందిన పోలీసు ఉన్నతాధికారి, అతని కుమారుడు కూడా ఉండటం గమనార్హం. ఈ కేసుల్లో ఎక్కువగా ఐపీసీ సెక్షన్‌ 188, 269, 270 లే ఉండటం గమనార్హం.

అకారణంగా బయటికి వస్తూ..లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పలు వాహనాలను ఆటోమేటిక్‌ నంబర్‌ప్లేట్‌ రికగ్నిషన్‌ (ఏఎన్‌పీఆర్‌) ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతికత ద్వారా గుర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసుల్లో హైదరాబాద్‌ కమిషనరేట్‌ ముందంజలో ఉంది. గత సోమవారం నుంచి ఈ వివరాలను పరిశీలించగా.. సీసీ కెమెరాల ద్వారా గుర్తించి ఫైన్‌ వేసే వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రారంభంలో రోజుకు ఆరువేల నుంచి మొదలు కాగా, 30వ తేదీ వరకు ప్రతీరోజు ఈ సంఖ్య 10 వేలను అధిగమించడం విశేషం. ఈ లెక్కన రాజధానిలోనే దాదాపు లక్ష వరకు చలానాలు వేయగా..మిగిలిన జిల్లాలు, కమిషనరేట్లలో ఈ సంఖ్య రెట్టింపు సంఖ్యలో ఉంటుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.

కేసుల నమోదు ఇలా..
నమోదు చేసిన కేసులు: 3,359 
పోలీసులు సీజ్‌ చేసిన వాహనాలు: 16,360 
నమోదైన ఎఫ్‌.ఐ.ఆర్‌లు: 1,572 
అరెస్టయినవారు: 1,790 
విధించిన చలానాలు: రూ.75 లక్షలు 
అధికంగా హైదరాబాద్‌లోనే..

మరిన్ని వార్తలు