రేపట్నుంచే కళల పండుగ

26 Jan, 2017 04:51 IST|Sakshi
రేపట్నుంచే కళల పండుగ

27 నుంచి 29 వరకు కన్నుల పండువగా ఉత్సవాలు
పాల్గొననున్న అంతర్జాతీయ,
జాతీయ కవులు.. ‘అతిథి’గా ఫిలిపీన్స్‌
ముఖ్యఅతిథులుగా అశోక్‌ వాజ్‌పేయి, అరుణ్‌శౌరీ, వైవీ రెడ్డి హాజరు


సాక్షి, హైదరాబాద్‌: సాహితీ ఉత్సవాలకు నగరం ముస్తాబైంది. ఈ నెల 27 నుంచి 29 వరకు మూడు రోజులపాటు హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ సాహిత్య, సాంస్కృతిక, కళా, సామాజిక రంగాలకు చెందిన అనేక అంశాలపై ఈ మూడు రోజుల పాటు చర్చలు, సదస్సులు, వర్క్‌షాపులు జరుగనున్నాయి. బేగంపేట్‌లోని హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 27న ప్రారంభమయ్యే 7వ హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌లో ప్రముఖ హిందీ కవి అశోక్‌ వాజ్‌పేయి కీలకోపన్యాసం చేస్తారు. అలాగే ఫిలిప్పీన్స్‌ అతిథి దేశంగా పాల్గొననుంది. ఆ దేశ రాయబారి మా తెరిస్తా సి.డాజా, ప్రభుత్వ ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్, హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ టి.విజయ్‌కుమార్‌ ప్రారంభ వేడుకల్లో పాల్గొననున్నారు.

వివిధ దేశాల నుంచి ప్రతినిధులు...
ఈ ఏడాది దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు ఫిలిప్పీన్స్, బ్రిటన్, అమెరికా, పోర్చుగల్, జర్మనీ, స్పెయిన్‌ దేశాల నుంచి వివిధ రంగాలకు చెందిన వందమందికి పైగా రచయితలు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు ఫెస్టివల్‌లో పాల్గొననున్నారు. సదస్సులు, వర్క్‌షాపులు, చర్చలు, నాటకాలు, నృత్యాలు, వీధి నాటకాలు, పుస్తక ప్రదర్శనలు, ఆర్ట్‌ ఎగ్జిబిషన్స్‌ వంటి విభిన్న రంగాలకు చెందిన 130 కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఫిలిప్పీన్స్‌లో రామాయణాన్ని ఆంగ్ల నాటక రూపంలో విస్తృతంగా ప్రదర్శించిన ప్రముఖ కళాకారుడు ఫెర్నాండెజ్, గోవాకు చెందిన ప్రముఖ కళాకారిణి క్యాథరీనా కక్కర్‌ వేడుకల్లో పాల్గొంటారు.

అనేక ప్రత్యేకతలు...
మొదటి రోజు ప్రముఖ హక్కుల ఉద్యమకారిణి నందితా హక్సర్‌ మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రసంగిస్తారు. కల్పన కన్నబీరన్‌ ఈ చర్చకు నేతృత్వం వహిస్తారు.

గుజరాత్‌కు చెందిన బుధన్‌ థియేటర్‌ ’స్తనదాయిని’ నాటకాన్ని హిందీలో ’చోళీ కే పీచే క్యాహై’ అనే పేరుతో ప్రదర్శించనున్నారు.

2వ రోజు అరుణ్‌శౌరి ‘లెసన్స్‌ ఫర్‌ లీడర్స్‌ అండ్‌ ఫాలోవర్స్‌’అనే అంశంపై ప్రసంగిస్తారు.

3వ రోజు ప్లీనరీలో వైవీ రెడ్డి ‘గోల్డ్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ అండ్‌ ఎల్లో’అనే అంశంపైన ప్రసంగిస్తారు.

ప్రముఖ నృత్యకారిణి లీలా శ్యామ్‌సన్‌ నృత్య ప్రదర్శన చేయనున్నారు.

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ కళాకారిణి శ్రీలేఖ పెయింటింగ్‌ ప్రదర్శన.

తమిళనాడుకు చెందిన ప్రముఖ కళాకారిణి ఐశ్వర్యమణి మణ్ణన్‌ ఆధ్వర్యంలో మార్షల్‌ ఆర్ట్స్‌ ’సిలంబమ్‌’ ప్రదర్శన.

సినీనటులు ప్రకాష్‌రాజ్, నందినీరెడ్డిలు ‘మీనింగ్‌ఫుల్‌ సినిమా’పై జరిగే చర్చలో పాల్గొంటారు.

ఇది మన పండుగ
అందరికీ, అన్ని భావజాలాలకు హైదరాబాద్‌ లిటరరీ ఫెస్టివల్‌ ఒక వేదిక. ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. ఇది మన పండుగ.     
– ప్రొఫెసర్‌ టి.విజయ్‌కుమార్,
వ్యవస్థాపక డైరెక్టర్, హెచ్‌ఎల్‌ఎఫ్‌

చాలా విషయాలు తెలుస్తాయి
ప్రతి సంవత్సరం వస్తున్నా. అనేక రకాల కార్యక్రమాలు ఉంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలు బాగుంటాయి. కొత్త విషయాలు తెలుస్తాయి.
– సునీతారెడ్డి, సాహిత్యాభిమాని

యువత కోసం యంగిస్తాన్‌
కొత్తగా ‘యంగిస్తాన్‌’ ఏర్పాటు చేస్తున్నాము. యువత తమ సృజనాత్మకతను ఆవిష్కరించేందుకు ఇది వేదిక. – కిన్నెరమూర్తి,
డైరెక్టర్, హెచ్‌ఎల్‌ఎఫ్‌

మరిన్ని వార్తలు