సాహితీ సంబరం

25 Jan, 2020 07:51 IST|Sakshi

విద్యారణ్య స్కూల్‌ వేదికగా హైదరాబాద్‌ సాహిత్యోత్సవం  

వైవిధ్యభరితంగా వేడుకలు

శని, ఆదివారాలు కూడా కార్యక్రమాలు

సాక్షి, సిటీబ్యూరో/లక్టీకాపూల్‌:  హైదరాబాద్‌ సాహిత్యోత్సవం శుక్రవారం విద్యారణ్య స్కూల్‌లో ఉత్సాహభరితంగా ప్రారంభమైంది. ఆస్ట్రేలియా ఈ ఏడాది అతిథి దేశంగా పాల్గొంటోంది. ఆ దేశానికి చెందిన పలువురు రచయితలు, జర్నలిస్టులు, ప్రముఖులు వేడుకలకు  హాజరయ్యారు. అలాగే ఈ ఏడాది రాష్ట్ర భాషగా  మళయాలంపై , కేరళ సాహిత్య, సాంస్కృతిక, కళారూపాలపై ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియాతో పాటు అమెరికా, బ్రిటన్, పోర్చుగీస్, తదితర దేశాలకు చెందిన ప్రముఖులు కూడా హాజరయ్యారు. అలాగే కేరళతో పాటు  పలు రాష్ట్రాలకు చెందిన కవులు, కళాకారులు, రచయితలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉత్సవాల్లో వివిధ అంశాలపైన జరిగే చర్చల్లో  పాల్గొననున్నారు.  ఆదివారం వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి.

పిల్లలకు మంచి సినిమాలు చూపించాలి
వేడుకల్లో భాగంగా  కార్వి కనోపి వేదికపైన ‘సినిమా... సాహిత్యం... సమాజం’ అంశంపై చర్చ జరిగింది. రచయిత, సినీ దర్శకులు ఆదుర్‌ గోపాలకృష్ణన్‌ మాట్లాడారు. సినీ నటులు, రచయిత అనిష్‌ కురువిళ్ల వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ప్రస్తుతం రాజకీయాలు సినిమాల్లోకి చొచ్చుకొచ్చాయని, ఒక మంచి సినిమా తీసే పరిస్థితి దేశంలో లేదని ఆదుర్‌ అన్నారు. మంచి సినిమాలు తీయడం అత్యంత కష్టమని  వ్యాఖ్యానించారు. మన నేతలు కనీసం మంచి సినిమాలు కూడా చూడరన్నారు. సినిమాల్లో ప్రస్తుతం పెరిగిపోతున్న హింస మంచిది కాదని పేర్కొన్నారు.  పాఠశాల రోజుల్లోనే సినిమా పాఠాలను పిల్లలకు చెప్పాలని, స్క్రిప్ట్‌ రచనలో వాళ్లని ప్రోత్సహించాలని సూచించారు. కేరళలో ఇలా చెయ్యడం వల్లఅక్కడ పిల్లలు చక్కని సినిమాలు తీస్తున్నారని చెప్పారు.

క్యామెల్‌ ఇన్‌ స్కై...
’ఈ ప్రపంచంలోనే అన్నింటికన్నా విలువైనది నీరు. ’క్యామల్స్‌ ఇన్‌ స్కై’ పుస్తకం నీటి విలువను తెలియజేస్తుంది’ అని ప్రముఖ మలయాళ రచయిత ముజాఫర్‌ అహ్మద్‌ అన్నారు. మధ్యాహ్నం  గోథీ హాల్‌లో ప్రముఖ మలయాళ రచయితలు ముజాఫర్‌ అహ్మద్, బెన్యామిన్‌లతో నిర్వహించిన చర్చా కార్యక్రమంలో  ఆయన ఇలా స్పందించారు. కేరళ నుంచి అరేబియా వరకూ తన ప్రయాణంలో ఎదురైన అనుభవాలు, అనుభూతులను పుస్తకంగా మలిచి ’క్యామల్స్‌ ఇన్‌ స్కై’ పేరిట పుస్తకం ప్రచురించినట్లు  తెలిపారు. u నేషనల్‌ రాక్‌ బ్యాండ్‌ ఆధ్వర్యంలో యంగిస్థాన్‌ నుక్కాడ్‌ పేరిట ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. అకాపెల్లా
శైలిలో సంగీత వాయిద్యాలు లేకుండా సినీగీతాలు ఆలపిస్తూ పలువురు కళాకారులు  అందరినీ అలరించారు.  u ఫుడ్‌ ఫర్‌ థాట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్‌ మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సంస్థ  ప్రభుత్వ పాఠశాలల్లో లైబ్రరీల ఏర్పాటు, పిల్లల్లో పఠనాసక్తిని పెంచే విధంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

సొసైటీ ఫర్‌ సేవ్‌ రాక్స్‌ ప్రదర్శన
సొసైటీ ఫర్‌ సేవ్‌ రాక్స్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది.  వైవిధ్యభరితమైన కొండలు, గుట్టలు  భవన నిర్మాణాల కోసం, నగర విస్తరణ కోసం కరిగిపోతున్న వైనంపైన  చిత్రాలను ప్రదర్శించారు.  

అలరించిన కవితా పఠనం
కవితా పఠనం సాహితీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. సంగీత, సాహిత్యాలకు పెద్ద పీట వేసిన ఈ ఫెస్టివల్‌లో పలు అంశాలపై వర్క్‌షాప్‌లు జరిగాయి. ఇంకా సాహిత్యపై మేథోమథనం, రాక్‌ మ్యూజిక్, ఫోటో ఎగ్జిబిషన్‌ వంటి కార్యక్రమాలను నిర్వహించారు.  

హైదరాబాద్‌చూస్తే ఇండియాను చూసినట్టే..
హైదరాబాద్‌ మహానగరాన్ని చూస్తే భారత దేశాన్ని చూసినట్టే. కాస్మోపాలిటిన్‌ సిటీ అయిన జంటనగరాలు విదేశీలను సైతం ఆకట్టుకుంటాయి. ఢిల్లీ తరహాలో భాగ్యనగరం కూడా విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు మేళవింపు.   – ఎన్‌. గోపి,మాజీ ఉప కులపతి, తెలుగు యూనివర్సిటీ

ఆస్ట్రేలియా కార్చిచ్చు ఆందోళనకరం
ఆస్ట్రేలియాలో చోటు చేసుకున్న కార్చిచ్చు పట్ల ఆందోళనగా ఉంది. ఈ విషయంలో ప్రభుత్వాలు నిర్దిష్టమైన వైఖరిని అవలంబించాలి. లిటరరీ ఫెస్టివల్‌తో ఇండియాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇండియా సాహిత్యం నన్ను ఆకట్టుకుంది.   –  అనీటా.హీస్, ప్రముఖ సాహితీవేత్త, ఆస్ట్రేలియా.

మరిన్ని వార్తలు