చిన్నారిని చిదిమేసిన లారీ

14 Feb, 2018 15:41 IST|Sakshi

రోడ్డు దాటుతుండగా ఢీకొన్న లారీ

బాలిక అక్కడికక్కడే దుర్మరణం

పండుగ పూట విషాదం

గంగాధర (చొప్పదండి) : అప్పటివరకు ఆ చిన్నారి అమ్మ వెంటే ఉంది. అక్కతో కలిసి ఆడుకుంది. శివరాత్రి సందర్భంగా పాఠశాలకు సెలవు రావడంతో ఇంట్లోనే అందరితో ఆనందంగా గడిపింది. మరికొద్దిసేపటికి శివుడిని దర్శించుకునేందుకు ఆలయానికి వెళ్దామని అనుకుంటుండగా.. ఓ లారీ మృత్యురూపంలో వచ్చి ఆ చిన్నారిని చిదిమేసింది. కరీంనగర్‌–జగిత్యాల ప్రధాన రహదారిపై మంగళవారం జరిగిన ఈ ఘటన పండుగపూట ఆ ఇంట్లో విషాదం నింపింది. అప్పటివరకూ తనపక్కనే ఆడుకుంటూ ఉన్న కూతురు రెప్పపాటులో విగతజీవిగా మారడంతో ఆ తల్లి రోదన కంటతడి పెట్టించింది. సంఘటనకు సంబంధించిన వివరాలు..

గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి జంగిలి వసంత, తిరుపతి దంపతులకు ఇద్దరు కూతుళ్లు గంగోత్రి, రక్షిత సంతానం. వారిని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు. మంగళవారం శివరాత్రి కావడంతో చిన్నకూతురు రక్షిత (9) ఉదయం నుంచే ఇంటి పనుల్లో నిమగ్నమైంది. శివుడిని దర్శించుకుందామని ఉద్దేశంతో ఉదయమే స్నానాలు పూర్తిచేసుకుంది. పండుగ సామగ్రి కోసం తల్లి వసంత గంగాధర చౌరస్తాకు ఆటోలో వెళ్తుండగా.. తానూ వస్తానని మారాం చేసింది. కూతురును కాదనలేక ఆ తల్లి వెంటతీసుకెళ్లి తిరిగి.. ఇంటికి చేరుకుంది.

వసంత ఆటోడ్రైవర్‌కు డబ్బులు ఇస్తుండగా..  రక్షిత ఇంటికెళ్లేందుకు రోడ్డుదాటాలని పరుగెత్తింది. ఇంతలో వేగంగా వస్తున్న లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృత్యువాత పడింది. లారీ వెనుకటైర్లు తలపై నుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జు అయ్యింది. విషయం తెలుసుకున్న ఎస్సై స్వరూప్‌రాజ్‌ సంఘటనస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఢీ కొట్టిన లారీ డ్రైవర్‌ ఆపకుండా వెళ్లిపోయాడని ఎస్సై పేర్కొన్నారు.

మిన్నంటిన రోదనలు
అప్పటివరకు కళ్లముందే ఆడుకున్న తన కూతురు ఇక లేదని తెలిసి ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. కుటుంబసభ్యులు, బంధువులు సంఘటనస్థలానికి చేరుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. ‘శివుడా.. నీ దర్శనం కోసం వస్తామని అనుకుంటే నీ దగ్గరకే తీసుకెళ్లావా..’ అంటూ తల్లి రోదించిన తీరు కలిచివేసింది.  

మరిన్ని వార్తలు