లైవ్‌ అప్‌డేట్స్‌: తెలంగాణ ఆర్టీసీ సమ్మె

5 Oct, 2019 13:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మె తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల మినహా మొదటిరోజు ప్రశాంతంగా జరిగింది. డిపోల్లో బస్సులు అన్ని ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. బస్ డిపోలతోపాటు బస్ స్టేషన్లను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. పలు చోట్ల ఆర్టీసీ కార్మికులు బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేయగా పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో కొన్ని మార్గాలలో పోలీసుల భద్రత నడుమ అద్దె బస్సులతో పాటు ప్రయివేట్‌ వాహనాలు నడిచాయి.

ప్రయివేట్‌ వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ తీవ్ర హెచ్చరిక చేసినా కార్మికులు వెనక్కు తగ్గలేదు. సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మెకు సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌..

ముగిసిన డెడ్‌లైన్‌.. పట్టించుకోని కార్మికులు
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డెడ్‌లైన్ ముగిసింది. శనివారం సాయంత్రం 6 గంటల్లోపు విధులకు రానివారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేవలం 160 మంది మాత్రమే విధులకు హాజరైనట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో సాయంత్రం 6 గంటల వరకు ఒక్క ఉద్యోగి కూడా విధులకు హాజరు కాలేదని సమాచారం. ఈ నేపథ్యంలో రేపు ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్టు కనబడుతోంది.


మరోసారి ప్రభుత్వ హెచ్చరిక
శనివారం సాయంత్రం 6 గంటల్లోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరాలని, ఒకవేళ వారు విధులకు హాజరుకాకపోతే.. వారిని ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించబోమని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. విధుల్లో చేరని కార్మికులను భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులుగా సంస్థ గుర్తించబోదని ఆయన తెలిపారు. అయితే ఎంత మందిని తొలగిస్తారో చూస్తామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు వ్యాఖ్యానించారు. తమ డిమాండ్లను ఆమోదించే వరకు సమ్మె విరమించే ప్రసక్తి లేదని స్పష్టం చేవారు.

రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపో, బస్టాండ్ల వద్ద 144 సెక్షన్‌ విధించారు. అయితే డిపో, బస్టాండ్ల వద్ద నిరసనలు, బస్సులను అడ్డుకున్న పలువురు ఆర్టీసీ నేతలు, కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అరెస్టులకు నిరసనగా ఆర్టీసీ నేతలు ధర్నాలు చేపట్టారు.

మహబూబ్‌నగర్‌:  ఇప్పటివరకు అరెస్టులు చేసిన ఆర్టీసీ కార్మికులను విడుదల చేయాలంటూ మహబూబ్‌నగర్‌ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కార్మికులు ధర్నా చేపట్టారు. సమ్మెను అణచివేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.   

ఆర్టీసీ కార్మికుల సమ్మెతో బస్సులు రోడ్డెక్కలేదు. దీంతో ‘మెట్రో’కు ప్రయాణికుల తాకిడి అధికమయింది. శనివారం ఉదయం నుంచి బస్సులు లేకపోవడంతో జనాలు ప్రత్నామ్నాయంగా మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో స్టేషన్లు జనాలతో కిటకిటలాడుతున్నాయి. మరోవైపు సమ్మె  నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ సందర్భంగా మెట్రో రైలు సర్వీసులు అర్థరాత్రి 12.30 గంటల వరకూ పొడగించింది. 

వికారాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం వద్ద బస్సుపై దాడి చేశారు. వికారాబాద్ బస్ డిపోకు చెందిన ఎపి 28జడ్ 3248 బస్సు పరిగి నుంచి వికారాబాద్కు వస్తుండగా వికారాబాద్ సమీపంలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం సమీపంలోకి రాగానే గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి రాయితో దాడి చేశారు. బస్సు ముందు వైపు అద్దం పూర్తిగా పగిలిపోయింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. బస్సు వెంబడి పోలీసుల ఎస్కార్టు వాహనం ఉన్న దుండగులు మెరుపు వేగంతో దాడి చేసి పారిపోయారు. అర్టీసీ ఉద్యోగులే దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మెహదీపట్నం:  ఆర్టీసీ ఉద్యోగులు తలపెట్టిన సమ్మెను విజయవంతం చేసే విధంగా ఈరోజు మెహదీపట్నం బస్ డిపో నుంచి ఒక బస్సు ను కూడా బయటికి వెళ్లకుండా కార్మికులు అడ్డుకున్నారు. డిపోలోని మొత్తం 160 బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్తలు పడుతున్నన్నారు. మెహదీపట్నం నుంచి నగరంలోని పలుచోట్ల కు వెళ్లే బస్సులన్నీ డిపోల్లోనే ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే మెహదీపట్నం జనాలు లేక వెలవెలబోతోంది. 
 

జూబ్లీ బస్టాండ్‌లో ఓ మహిళ తమ ప్రాంతానికి వెళ్లే బస్సు రావడంతో తన ఇద్దరి పిల్లలని బస్సు ఎక్కించడానికి తెగ హైరానాపడింది. బస్సు కిటికీలో నుంచి తన ఇద్దరి పిల్లలని లోపలికి పంపించి సీట్లలో కూర్చో బెట్టే ప్రయత్నం చేసింది. ఈ బస్సు తప్పితే మరొక బస్సు వస్తదో రాదో అని భయంతో ఆ మహిళ ఇలా రిస్క్‌ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

దాదాపు నాలుగేళ్ల తరువాత తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో త్రిసభ్య కమిటీ జరిపిన చర్చలు విఫలం కావడంతో కార్మికులు సమ్మె వైపే మొగ్గు చూపారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో దూరప్రాంతాలకు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే బస్సు డ్రైవర్లు శుక్రవారమే ఉన్న పళంగా విధుల నుంచి వైదొలిగారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం నుంచే సమ్మె మొదలైనట్లయింది. దీంతో సమ్మె లేదనే శుభవార్త కోసం ఎదురు చూసిన ప్రయాణికులకు నిరాశే ఎదురైంది. ఇక శుక్రవారం అర్దరాత్రి నుంచే బస్సులు ఎక్కడికక్కడా ఆగిపోయాయి. సిటీ బస్సులు శనివారం ఉదయం నుంచే డిపోలకే పరిమితమయ్యాయి. (చదవండి: డ్యూటీలోకి రాకుంటే.. వేటేస్తాం..)

శుక్రవారం అర్దరాత్రి నుంచి సమ్మెకు దిగిన ఆర్టీసీ కార్మికులకు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. అంతేకాకుండా కార్మికుల అన్ని సమస్యలను పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఆర్టీసీ ప్రయాణం అంటే ప్రజలు అపార నమ్మకంతో ప్రయాణం చేస్తారని పేర్కొన్నారు. 

హైదరాబాద్ ‌: 
జేబీఎస్‌: సమ్మె ప్రభావం లేకుండా చేయాలనుకున్న ఆర్టీసీ అధికారుల ప్రయత్నాలు సఫలం కావడం లేదు. దీంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే ప్రయివేట్‌ డ్రైవర్లతో ప్రత్నామ్నాయంగా బస్సులు నడిపించాలనుకున్న అధికారుల ఆలోచన ఇంకా ఆచరణలోకి రాలేదు. దీంతో ప్రయాణికులు బస్టాండ్లలో ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ రద్దీగా ఉండే జూబ్లీ బస్‌ స్టేషన్‌ నుంచి ఇప్పటి వరకు కేవలం రెండు బస్సులు మాత్రమే బయటకి వెళ్లాయి. 

తాత్కాలిక సిబ్బంది కోసం ఆర్టీసీ అధికారుల ఇచ్చిన నోటిపికేషన్‌తో ప్రయివేట్‌ డ్రైవర్లు జేబీఎస్‌కు చేరుకుంటున్నారు. ఆర్టీఏ అధికారులు వారికి ట్రయల్‌ రన్‌ నిర్వహించిన తర్వాత వారికి బస్సులు అప్పగించనున్నారు. పూర్తి సమ్మె ప్రభావం లేకుండా అధికారులు చేస్తున్న ప్రయత్నాల ఫలితం ఈ రోజు సాయంత్రం వరకు కూడా వచ్చేలా లేవు.  దీంతో బస్‌ స్టేషన్‌లోనే ప్రయాణకులు వేచి చూస్తున్నారు. ఇదే అదునుగా భావించిన ప్రయివేట్‌ ట్రావెల్స్‌, క్యాబ్‌లు అధిక ఛార్జీలు వసూళ్లు చేస్తున్నాయి.

 

బర్కత్‌పుర: సమ్మె కారణంగా బర్కత్‌పుర బస్సు డిపోల్లోనే నిలిచిపోయిన సిటీ బస్సులు. కార్మికులు డిపో ముందే బైఠాయించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ పెద్ద ఎత్తును నినాదాలు చేశారు.  

దిల్‌సుఖ్‌నగర్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా దిల్‌సుఖ్‌ నగర్‌ డిపోలో 110 సిటీ బస్బులు నిలిచిపోయాయి. ప్రస్తుతం డిపో ముందు కార్మికులు ఎలాంటి ఆందోళనలు చేపట్టలేదు. అయితే డిపో ముందు భారీగా పోలీసులు మోహరించారు. 

ఆదిలాబాద్‌: ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ, ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మధ్య చర్చలు విఫలం కావడంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో జిల్లా వ్తాప్తంగా ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. అయితే ప్రత్నామ్నాయ ఏర్పాట్లలో భాగంగా ఇప్పటివరకు ప్రయివేట్‌ డ్రైవర్ల సహాయంతో 18 బస్సులను ఆర్టీసీ అధికారులు నడిపించారు. పోలీసులు పూర్తి బందోబస్త్‌ను ఏర్పాటు చేశారు.

వరంగల్‌: వరంగల్‌ రీజియన్‌ పరిధిలో తొమ్మిది డిపోలలోని 972 ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లాకు చెందిన 4200 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. బస్టాండ్లు, డిపోల ముందు పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు. మహుబూబాబాద్‌ బస్టాండ్‌ ముందు ధర్నా నిర్వహిస్తున్న పది మంది ఆర్టీసీ కార్మికులను పోలీసులు ఆరెస్ట్‌ చేశారు. 

నారాయణ పేట: ఆర్టీసీ సమ్మె కారణంగా డిపోల్లోనే బస్సులు నిలిచిపోయాయి. అయితే ఆర్టీసీ అధికారులు ప్రయివేట్‌ వ్యక్తులతో పాక్షికంగా బస్బులను నడిపిస్తున్నారు.  ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బస్సు డిపోలు, బస్టాండ్‌ల వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.  

నిజామాబాద్‌:  ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరు డిపోల పరిధిలో సమ్మె ప్రభావంతో 670 ఆర్టీసీ, 182 అద్దె బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జిల్లాకు చెందిన 3200 మంది ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినప్పటికీ ప్రయాణికులకు కష్టాలు తప్పడం లేదు. డిపోలు, బస్టాండ్‌ల వద్ద పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కార్మికులు సిద్దమవుతున్నారు. 

కరీంనగర్‌: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సమ్మె కారణంగా 10 డిపోలలో 909 ఆర్టీసీ, 209 అద్దె బస్సులు నిలిచిపోయాయి. 3900 మంది కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నారు. అయితే ప్రయాణికుల రద్దీని బట్టి ప్రయివేట్‌, స్కూల్‌ బస్సులను నడిపేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ హెచ్చరికలతో కొంత మంది కార్మికులు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. అయితే అలాంటి హెచ్చరికలకు భయపడేది లేదని కార్మిక సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు.   

నాగర్‌ కర్నూల్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మెతో నాగర్‌ కర్నూల్‌ డిపోల్లోనే బస్సులు నిలిచిపోయాయి. ఉదయం నుంచే డిపోల ముందు కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కల్వకుర్తి బస్సు డిపో ముందు కార్మికులు బస్సులు కదలకుండా బైఠాయించారు. అయితే  పోలీసుల సహకారంతో కొన్ని ప్రయివేట్‌ సర్వీసులను నడిపించాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.   

మహబూబ్‌ నగర్‌:  ఉమ్మడి జిల్లాలోని 9 డిపోల పరిధిలో 880 బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం నుంచే డిపోల ముందు కార్మికులు భైఠాయించారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు.

మెదక్‌: ఉమ్మడి జిల్లాలో డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. మెదక్‌ రీజియన్‌లోని 8 డిపోల్లో 672 ఆర్టీసీ, 190 అద్దె బస్సులు నిలిచిపోయాయి. పోలీసుల భారీ బందోబస్తు నడుమ అద్దె బస్సులతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు.  

నల్లగొండ: ఉమ్మడి నల్లగొండలో సమ్మె ప్రభావం భారీగానే ఉంది. కార్మికులు విధులు బహిష్కరించడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అయితే అన్ని డిపోల ముందు పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. డిపో, బస్టాండ్ల ముందు కార్మికులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదని పోలీసులు వారిని హెచ్చరించారు.   

వికారాబాద్‌: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో వికారాబాద్‌ ఆర్టీసీ డిపో నుంచి ప్రయివేట్‌ డ్రైవర్లతో బస్సులు నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల భద్రత నడుమ ఇప్పుడిప్పుడే ఆర్టీసీ బస్సులు బయటికి వస్తున్నాయి. దీంతో డిపోకు ఆర్టీసీ కార్మికులు భారీగా చేరుకున్నారు. దీంతో పోలీసులు డిపో ముందు భారీ బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. ఇక సమ్మె కారణంతో హైదరాబాద్‌-వికారబాద్‌ రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. 

ఖమ్మం: ఉమ్మడి జిల్లాలో కార్మికుల నినాదాలు పోలీసుల పకడ్బందీ మధ్య సమ్మె ప్రశాంతంగా కొనసాగుతోంది. ఖమ్మం డివిజన్‌ పరిధిలో మొత్తం 449 ఆర్టీసీ, 183 ప్రయివేట్‌ బస్సులు సమ్మె కారణంగా డిపోలకే పరిమితమయ్యాయి.  అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తగా డిపో, బస్టాండ్‌ పరిధిలలో 144 సెక్షన్‌ విధించారు. ఇప్పటికే తాత్కాలిక సిబ్బందిని నియమించే ప్రయతాన్ని అధికారులు చేపట్టారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు