పాడి పశువుల పరిరక్షణ అందరి బాధ్యత

8 Nov, 2014 23:53 IST|Sakshi

 జహీరాబాద్ టౌన్: రోజురోజుకూ తగ్గిపోతున్న పాడి పశువులను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని రాజకీయపార్టీల నాయకులు పేర్కొన్నారు. పాడి గేదెల పరిరక్షణపై రైతు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేందాస్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక అతిథి గృహంలో అఖిలపక్ష సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి నరోత్తం, వైఎస్సార్ సీపీ జహీరాబాద్ అధికార ప్రతినిధి కిష్టోఫర్, బీజేపీ జిల్లా నాయకుడు సుధీర్ బండారీ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింహులు, టీఆర్‌ఎస్ నాయకుడు, కౌన్సిలర్ రాములు నేత, ప్రభుత్వ వైద్యులు డాక్టర్ శేషుబాబు తదితరులు మాట్లాడుతూ, పలు కారణాల వల్ల పాడిగేదెల సంపద తగ్గిపోతుందన్నారు. ముఖ్యంగా జహీరాబాద్ సమీపంలోని ‘అల్లానా’ వధ శాఖ నిబంధనలకు విరుద్ధంగా పాడి పశువులను వధిస్తోందన్నారు.

నిబంధనలను ఉల్లంఘిస్తున్న ‘అల్లానా’పై ఉద్యమించాలని తీర్మానం చేశారు. వట్టిపోయిన పశువులను మాత్రమే పరిశ్రమ సేకరించాలని, లారీల్లో గేదెలను తరలించరాదని, నిర్ధారిత సమయాల్లోనే పశువులను తరలించాలని, పశు వైద్యాధికారుల అజమాయిషీ ఉండాలని తీర్మానాలు చేశారు. సమావేశంలో  కాంగ్రెస్ నేత భాస్కర్, టీడీపీ నేత కృష్ణ, శ్రీకాంత్, పాడి గేదెల పరిరక్షణ సంఘం నాయకులు సునీల్‌కుమార్, రాజ్‌కుమార్, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు