ఎల్‌కేజీ ఫీజు రూ.3 లక్షలా?

20 Feb, 2016 09:19 IST|Sakshi
ఎల్‌కేజీ ఫీజు రూ.3 లక్షలా?

ఫీజులపై పరిమితి ఎందుకు లేదు?..
ఇటువంటి దోపిడీ ఎక్కడైనా ఉందా?
స్కూళ్ల దోపిడీపై రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్‌ఎస్‌పీఏ ప్రశ్నలు

 
 సాక్షి, హైదరాబాద్: ‘మద్యంపై ఎమ్మార్పీ రేట్ల ను అమలు చేయాలని పార్టీలన్నీ ఒక్కటై పోరా డి సాధించుకున్నాయి. ఇదే రీతిలోవిద్యపై ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారు? స్కూ ల్ ఫీజులపై ఎందుకు పరిమితి పెట్టడం లేదు? అందుకు కారణాలేంటి? ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫీజులు ఎంత ఉండాలో ప్రభుత్వం నిర్ణయిస్తోంది. ఇదే పద్ధతిని ఎల్‌కేజీ విషయం లో ఎందుకు అవలంభించడం లేదు? ఎల్‌కేజీ సీటుకు ఫీజు రూ. 3 లక్షలు వసూలు చేయవచ్చా? ఇటువంటి దోపిడీ ఎక్కడైనా ఉందా?’ అని హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్(హెచ్‌ఎస్‌పీఏ) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం హెచ్‌ఎస్‌పీఏ ప్రతినిధులు విలేకరులతో మాట్లాడారు. నూతన విద్యా సంవత్సరం త్వరలో రానున్న నేపథ్యంలో స్కూళ్ల ఫీజుల వసూలు, చట్టాల అమలులో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. తమ డిమాండ్లను అమలు చేసి కార్పొరేటు, ప్రైవేటు స్కూళ్ల దోపిడీని అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ తీసుకొచ్చిన జీవో ఎంఎస్ నం 91 వల్ల ఆయన హయాంలో ఫీజులు పెరగలేదని, ఆయన మరణానంతరం స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టారాజ్య దోపిడీకి తెరలేపాయని పేర్కొన్నారు. మళ్లీ ఫీజులపై నియంత్రణ రావాలంటే వైఎస్సార్ వంటి మంచి వ్యక్తి అయిన సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. ఏ స్కూల్ కూడా ఫీజుల వివరాలను నోటీస్ బోర్డ్‌లో ప్రదర్శించడం లేదని, కనీసం దేనికి ఎంత ఫీజు వసూలు చేస్తున్నారో తల్లిదండ్రులకు చెప్పడం లేదని అన్నారు.

స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీలో తల్లిదండ్రులకు అవకాశం కల్పించడం లేదన్నారు. 2016-17 విద్యా సంవత్సరంలోనూ పలు స్కూళ్లు ఫీజులు పెంచే పనిలో నిమగ్నమయ్యాయని హెచ్‌ఎస్‌పీఏ అధ్యక్షుడు విక్రాంత్ పేర్కొన్నారు. ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న 31 లక్షల మంది పిల్లల భవిష్యత్ గురించి సర్కారు ఆలోచించాలని కోరారు. నిబంధనలను ఉల్లంఘించి తల్లిదండ్రుల నుంచి తీసుకున్న అధిక ఫీజులను స్కూళ్లు తిరిగిచ్చేంత వరకు తాము పోరాడుతామని జాయింట్ సెక్ర టరీ సుబ్బు స్పష్టం చేశారు. స్కూళ్లకు అనుమతులివ్వడం, విద్యా సంవత్సరం ఆఖరులో పరీక్షలు నిర్వహించడానికే విద్యాశాఖ పరిమితమైందని ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఆశిష్ మండిపడ్డారు.

 హెచ్‌ఎస్‌పీఏ ప్రధాన డిమాండ్లు ఇవే
నగరంలో 12 ప్రైవేటు స్కూళ్లలో పూర్తి చేసిన తనిఖీల రిపోర్ట్ బహిర్గతం చేయాలి. విద్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. ఈ చర్యకు ఉపక్రమించాలని సవాల్ విసురుతున్నాం. చాలా ప్రైవేటు స్కూళ్లు నిబంధనలకు విరుద్ధంగా 82 నుంచి 150 శాతం లాభాలను ఆర్జిస్తున్నాయని స్వయంగా పాఠశాల విద్య డెరైక్టర్ ఒప్పుకున్నారు. అయినా నివేదికలోని విషయాలను వెల్లడించకపోవడానికి కారణాలేంటి?

విద్య నియంత్రణ కోసం ఇప్పటికిప్పుడు కొత్తగా చట్టాలు రూపొందించాల్సిన అవసరం లేదు. వైఎస్ తీసుకొచ్చిన జీవో నం 91తోపాటు 1, 42, 246 జీవోలను పకడ్బందీగా అమలు చేయాలి.

ప్రస్తుతం ఉన్న చట్టాలు పూర్తిస్థాయిలో అమలయ్యే వరకు ఫీజులు పెంచకుండా చర్యలు తీసుకోవాలి. ఆ 12 పాఠశాలల తనిఖీలకు సంబంధించి నివేదికలు వచ్చే వరకు ఇప్పుడున్న ఫీజులపై స్టేటస్ కో కొనసాగించాలి.

తక్షణమే ఫీజు నియంత్రణ కమిటీ ఏర్పాటు చేసి ఫీజుల వసూళ్లపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలి. 5% కంటే ఎక్కువగా లాభం తీసుకోబోమని అఫిడవిట్లలో పేర్కొన్న మేరకు స్కూళ్ల యాజమాన్యాలను కట్టుబడి ఉండాలి.

మరిన్ని వార్తలు