ఊరటనిచ్చినా...రైలు చార్జీల పెంపు భారమే

26 Jun, 2014 03:06 IST|Sakshi
ఊరటనిచ్చినా...రైలు చార్జీల పెంపు భారమే
  •  రోజువారీ, ఎంఎస్‌టీ టికెట్ల ధరల్లో భారీ పెరుగుదల
  •  సాక్షి, హైదరాబాద్: రైలు టికెట్ ధరలను పెంచిన కేంద్రం దేశవ్యాప్తంగా కనిపించిన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని రోజులవారి ప్రయాణాలు, నెలవారీ సీజనల్ టికెట్ ధరల్లో స్వల్ప మార్పులు చేసిన ప్పటికీ ప్రయాణికుల జేబుపై పెద్ద భారమే పడనుంది. ముఖ్యంగా నగరాలకు రోజువారీ ప్రయాణం చేసేవారిపై మోపిన భారం నుంచి కొంత ఊరట లభించేలా ఛార్జీలను స్వల్పంగా తగ్గించినప్పటికీ నెలవారీ పాసుల ధరల్లో పెరుగుదల భారీగానే కనిపిస్తోంది.

    150 కిలోమీటర్ల మేర ప్రయాణించే నెలవారీ సీజనల్ టికెట్లు కొనేవారు ఇప్పటి వరకు సెకండ్ క్లాస్‌కు రూ.460 భరిస్తుండగా అది రూ.525కు పెరుగుతోంది. అదే మొదటి తరగతిలో ప్రయాణించేందుకు కొనే నెలవారీ సీజన్ టికెట్ ధర ప్రస్తుతం రూ.1840  ఉండగా అది రూ.2100 పెరగబోతోంది. 1-150 కిలోమీటర్ల వరకు రోజువారి ప్రయాణం, నెలవారీ సీజనల్ టికెట్ ధరలు ఇలా...
     
    1-15 కిలోమీటర్ల వరకు రెండో తరగతి నాన్ సబర్బన్, సబర్బన్ రోజువారీ ప్రయాణ టికెట్ దరల్లో మార్పు లేదు. అది  రూ.5గానే ఉండనుంది. నెలవారీ సీజన్ టికెట్ (ఎంఎస్‌టీ) ధర మాత్రం ప్రస్తుతం నాన్ సబర్బన్‌కు రూ.85 ఉండగా అది రూ.100గా, సబర్బన్‌కు రూ.130 ఉండగా అది రూ.150కి పెరగనుంది.

    ఫస్ట్‌క్లాస్ నాన్‌సబర్బన్, సబర్బన్ టికెట్ ధర 1-10 కి.మీకు రూ.45 ఉండగా అది రూ.50కి, అదే కేటగిరీ నాన్ సబర్బన్ ఎంఎస్‌టీ ధర రూ.300 ఉండగా రూ.340కి, సబర్బన్ ధర రూ.445 ఉండగా, అది రూ.510కి పెరిగింది. రెండో తరగతి ఎంఎస్‌టీల ధరలు 20కి.మీ. నుంచి 35 కి.మీ. మధ్య పెరగగా, ఏపీ క్లాస్ ధరలు మాత్రం ప్రతి ఐదు కిలోమీటర్ల చొప్పున పెంచారు.  

    50 కి.మీ.కు ప్రస్తుత ఎంఎస్‌టీ నాన్‌సబర్బన్‌కు రూ.235 ఉండగా రూ.270, ఫస్ట్‌క్లాస్ నాన్‌సబర్బన్ ధర రూ.800 నుంచి రూ.వేయికి పెరిగింది. అదే 100 కి.మీ.లకు ఇవి వరసగా రూ.310 నుంచి రూ.355కు, రూ.1380 నుంచి రూ.1580కి పెరిగాయి. 150 కి.మీ. వచ్చే సరికి ఇవి రూ.460 నుంచి 525కు రూ.1840 నుంచి రూ.2100 పెరిగాయి. కొత్త ఛార్జీలు ఈనెల 28 నుంచి అమలులోకి రానున్నాయి.

>
మరిన్ని వార్తలు