కౌలురైతుపై కక్ష

11 Jun, 2014 02:58 IST|Sakshi
కౌలురైతుపై కక్ష

నల్లగొండ అగ్రికల్చర్ :ఖరీఫ్‌లో కౌలురైతులపై జిల్లా యంత్రాంగం కక్షగట్టింది. సీజన్ ప్రారంభమై పది రోజులు గడుస్తున్నా నేటికీ కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను పంపిణీ చేయలేదు. జిల్లావ్యాప్తంగా సుమారు 30వేల మంది కౌలురైతులు ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. కానీ ఏటేటా కౌలుైరె తుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. దీంతో ఈ ఏడాది సుమారు 40వేల మంది వరకు ఉండొచ్చని వ్యవసాయశాఖ అధికారులు పేర్కొంటున్నారు. వీరు ఖరీఫ్‌లో సుమారు 6లక్షల 50 వేల హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉంది. అందులో 3లక్షల హెక్టార్ల వరకు పత్తి, 2లక్షల వరకు వరి పంటలను సాగు చేసే అవకాశం ఉంది.

కౌలు రైతులు ఎక్కువగా పత్తి పంటను సాగు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఎరువులు, విత్తనాల ధరలు పెరిగిన కారణంగా పత్తి, వరి పంటల సాగుకు రోజురోజుకూ పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. దీంతో కౌలు రైతులు బ్యాంకుల నుంచి పంటరుణాలను తీసుకోవడానికి ఎదురుచూపులు చూస్తున్నారు. రుణ అర్హత కార్డు ఉన్న రైతులకు మాత్రమే బ్యాంకులు పంట రుణాలను అందజేస్తాయి. కానీ జిల్లాలో ఇప్పటివరకు ఒక్క కౌలురైతుకూ రుణఅర్హత కార్డును జారీ చేయకపోవడం అందోళన కలిగిస్తుంది. గ్రామ స్థాయిలో భూములు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న రైతుల వివరాలను రెవెన్యూ అధికారులు సేకరించాలి. వారికి రుణ అర్హత కార్డును జారీ చేయాలి. కార్డులో రైతు కౌలుకు తీసుకున్న భూమి వివరాలు, సర్వే నంబర్, పంటల వివరాలను నమోదు చేసి  తహసీల్దార్ సంతకంతో కార్డును జారీ చేయాలి. కార్డు ఆధారంగా బ్యాంకులు ఆయా రైతులకు పంట రుణాలను అందించాలి.

కానీ జిల్లాలో ఇప్పటి వరకు కౌలు రైతులకు ఒక్క కార్డును కూడా జారీ చేయకపోవడం వలన రైతులు ఆయోమయంలో పడ్డారు. పెట్టుబడుల కోసం రుణాలను ఇవ్వాలని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా..కార్డులు లేకుంటే రుణాలను ఇవ్వబోమని బ్యాంకు అధికారులు మొండికేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. సీజన్ ఆరంభమై పది రోజులు గడుస్తున్నా తమను పట్టించుకునే నాథుడే లేడని కౌలురైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేసేది లేక పెట్టుబడుల కోసం ఉన్న సొమ్ములను అమ్ముకోవడంతో పాటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి విత్తనాలు, ఎరువులను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి వెంటనే కౌలురైతులకు రుణ అర్హత కార్డులను జారీచేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు డిమాండ్ చేస్తున్నారు.

ైకౌలు రెతులకు చేయూతనివ్వాలి : బి.నర్సింహారావు, జేడీఏ
కౌలు రైతులకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలి. రుణ అర్హత కార్డులను జారీ చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులది. వెంటనే రైతుల వివరాలను సేకరించి కార్డులను జారీ చేయాలి. బ్యాంకులు కూడా కౌలురైతులకు పంట రుణాలను ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది.
 

మరిన్ని వార్తలు