ఆత్మహత్యలకు రుణమాఫీ పరిష్కారం కాదు 

4 Jul, 2018 02:18 IST|Sakshi

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు

సాక్షి, హైదరాబాద్‌: రుణమాఫీ, ఉచిత విద్యుత్‌ రైతు ఆత్మహత్యలకు శాశ్వత పరిష్కారాలు కావని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ఇతర మార్గాలను అన్వేషించాలని, ప్రస్తుతం అమలు చేస్తున్నవి తాత్కాలిక ఉపశమనాలేనన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతుల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని కొనియాడారు. వ్యవసాయంచేస్తూ పాడి పశువులు, నాటు కోళ్లు పెంచే రైతులెవరూ ఆత్మహత్యలు చేసుకోవడం లేదన్నారు.

మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థలో (సీఆర్‌ఐడీఏ)లో తెలంగాణ, అనుబంధ ప్రాంతాలలో రైతుల ఆదాయం రెట్టింపుపై సంప్రదింపుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి ఎన్నో పథకాలు తీసుకువచ్చారన్నారు. ఏటా రూ.11 లక్షల కోట్ల రుణాలు ఇవ్వాలని కేంద్రం ప్రతిపాదిస్తుందని, అయితే సకాలంలో రుణాలు అందడం లేదన్నారు. మౌలిక సదుపాయాలు, విద్యుత్, సాగునీరు, మేలైన విత్తనాలు ఇస్తేనే రైతుకు భరోసా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, ఎస్‌ఆర్‌ఎం డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ అలసుందరం, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. 

>
మరిన్ని వార్తలు