లక్ష్యం మేరకు రుణాలు

28 Dec, 2018 12:27 IST|Sakshi
2019–20 రుణ ప్రణాళికను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ ధర్మారెడ్డి, అధికారులు

మెదక్‌ అర్బన్‌: బ్యాంకర్లకు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా రుణాలను మంజూరు చేయాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని ప్రజావాణి హాల్‌లో లీడ్‌ బ్యాంకు ఆధ్వర్యంలో కలెక్టర్‌ అధ్యక్షతన డిస్ట్రిక్‌ కన్సల్టేటివ్‌ కమిటీ (డీసీసీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి సమావేశంలో నిర్దేశించిన రుణాలను మంజూరు చేయాలని సూచిస్తున్నా బ్యాంకర్లు నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతి బ్యాంకు నెలలో కనీసం ఐదుగురు లబ్ధిదారులకు ముద్ర రుణాలను తప్పకుండా మంజూరు చేయాలని ఆదేశించినా ఇప్పటి వరకు బ్యాంకు ఆ దిశగా మంజూరు చేయకపోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా రుణాలను మంజూరు చేసినా ఇప్పటికీ కొన్ని శాఖల అధికారులు గ్రౌండింగ్‌ చేయడంలో ఎందుకు ఆలస్యం అవుతుందన్నారు. గ్రౌండింగ్‌ అయిన వాటి రుణాలకు సంబంధించి త్వరగా యూసీలను అందజేయాలన్నారు.

పెండింగ్‌లో ఉన్న రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలన్నారు. వ్యవసాయ రుణాలకు సంబంధించి ఆయా శాఖలకు ఇచ్చిన లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకోవాలన్నారు. అలాగే బ్యాంకుల వారీగా పెండింగ్‌లో ఉన్న ముద్ర, స్టాండప్, పీఎంఈజీపీతో పాటు కార్పొరేషన్‌ రుణాలకు సంబంధించి పూర్తిస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యువత పారిశ్రామిక రంగంలో ఆసక్తి ఉన్న వారికి టీ ప్రైడ్, స్టాండప్‌ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల ద్వారా రుణాలను మంజూరు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమాలను గ్రౌండింగ్‌ చేసేందుకు బ్యాంకర్ల సహకారం తప్పనిసరి అని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. దరఖాస్తులు అందిన వెంటనే రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు.

నా బార్డు ద్వారా ప్రత్యేక రుణాలు..
2019–20 సంవత్సరానికి గాను నాబార్డు ద్వారా రూ.2,091.94 కోట్లతో రూపొందించిన రుణ ప్రణాళికను కలెక్టర్‌ «ధర్మారెడ్డి ఆవిష్కరించారు. వ్యవసాయ ధీర్ఘకాలిక రుణాల కల్పన కింద డెయిరీ, మేకలు, గొర్రెలు, గేదెలు, వ్యవసాయ పనిముట్లు, భూమిని అభివృద్ధి చేసుకునేందుకు, గోడౌన్ల నిర్మాణాలకు రుణ సదుపాయాలను కల్పించనున్నట్లు నాబార్డు అధికారి తిమోతి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సీతారామరావు, ఎల్‌డీఎం నాగరాజు, జీఎం డీఐసీ రత్నాకర్, కార్పొరేషన్‌ అధికారులు దేవయ్య, సుధాకర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పరశురామ్, డీడబ్ల్యూఓ జ్యోతిపద్మ, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు