చక్కర్లు!

28 Oct, 2014 00:46 IST|Sakshi
చక్కర్లు!

* బదిలీల పర్వంలో కొత్త కోణం
* మంత్రి, ఎమ్మెల్యేల చుట్టూ అధికారుల ప్రదక్షిణలు
* సిఫార్సు లేఖల కోసం పైరవీలు

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: బదిలీల జాతరకు తెరలేవడంతో పైరవీలు ఊపందుకున్నాయి. కోరుకున్న చోట పోస్టింగ్ దక్కించుకునేందుకు ఆశావహులు ప్రజాప్రతినిధులు, సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘మాట’ వినని అధికారులను సాగనంపి.. వారి స్థానే విధేయులను నియమించుకోవాలనే ఉద్దేశంతో బదిలీ ప్రక్రియకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కేసీఆర్ సర్కారు.. బదిలీల్లో ఎమ్మెల్యేలు, అధికారపార్టీ నేతల సిఫార్సులకే పెద్దపీట వేయనున్నట్లు ప్రకటించింది. ఈక్రమంలోనే బదిలీలపై భయం పట్టుకున్న అధికారులు మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

ఇప్పటివరకు బదిలీలపై ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ, హాట్‌సీట్లు దక్కించుకునేందుకు తమదైన శైలిలో అధికారులు ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ నంవబర్ 1న ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆలోపే బదిలీలు జరిగిపోతాయనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం కూడా హడావుడి చేస్తుండడంతో అధికారవర్గాల్లో బదిలీల ఫీవర్ మొద లైంది. ముఖ్యంగా ఎంపీడీఓలు, తహసీల్దార్లు బదిలీల జాబితాలో ఉండడం.. ఎమ్మెల్యేలు కూడా తమనే టార్గెట్ చేయడంతో సీటును కాపాడుకునేందుకు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నారు. నచ్చిన పోస్టింగ్‌ను దక్కించుకునేందుకు తమ పేర్లను సిఫార్సు చేయాలని కోరుతూ ‘రేటు’ మాట్లాడుకుంటున్నట్లు అధికారవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
 
మరోవైపు ఒకే అధికారి కోసం ఇరువురు ప్రజాప్రతినిధులు పట్టుపట్టడం కూడా అధికారపార్టీలో వివాదంగా మారుతోంది. నగర శివార్లలో పోస్టింగ్ దక్కించుకునేందుకు ఎక్కువ మంది పోటీపడుతుండడం అధికారుల్లోనూ కొత్త జగడానికి దారితీస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణేతరులను సాగనంపాలనే వాదన తెరమీదకు తెచ్చారు. అదే సమయంలో సర్వీసును పరిగణనలోకి తీసుకొని బదిలీల పర్వాన్ని చేపట్టాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. రెండు నెలల క్రితమే స్థానచలనం కలిగించిన తహసీల్దార్లను మళ్లీ ఎలా మారుస్తారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు బదిలీల ప్రక్రియ చేపడితే ఉద్యమానికి వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు.
 
ఛీ..చీ..!
అధికారుల బదిలీలు మంత్రి మహేందర్‌రెడ్డికి చిరాకు కలిగిస్తున్నాయి. తన ఇంటిచుట్టూ ఎంపీడీఓలు చక్కర్లు కొట్టడంపై ఆయన ఒకింత అసహనానికి గురయ్యారు. బదిలీల జాబితాలో ఫలానా మండలానికి తమ పేరును సూచించాలని వేడుకునేందుకు సోమవారం ఉదయం పలువురు అధికారులు మహేందర్ నివాసానికి చేరుకున్నారు. ఒకవైపు ఆహారభద్రత, సామాజిక పింఛన్ల దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ జరుగుతుండగా, దాన్ని వదిలేసి ఇక్కడకు రావడమేమిటని ఆయన రుసరుసలాడారు. ఇదిలావుండగా, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జీలను సంప్రదించి రూపొందించిన జాబితాను మంత్రి మహేందర్‌రెడ్డి సీఎం పేషీకి పంపినట్లు తెలిసింది.
 
ఈ జాబితాలో కూడా మళ్లీ సవరణలు కోరుతుండడం మంత్రి మహేందర్‌కు తలనొప్పిగా మారాయి. ఇదిలావుండగా, ముఖ్యమంత్రి ఆమోదముద్రతో నేడో, రేపో బదిలీల ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నా, స్వల్పకాలంలో దీనిపై నిర్ణయం తీసుకోకపోవచ్చనే వాదన కూడా వినిపిస్తోంది. బదిలీల జాబితా కూడా పరిమిత స్థాయిలోనే ఉంటుందనే చర్చ కూడా జరుగుతోంది.

మరిన్ని వార్తలు