తమ్మిడి కుంట సర్వే పూర్తి

28 Sep, 2014 00:38 IST|Sakshi
తమ్మిడి కుంట సర్వే పూర్తి
  • రెండు రోజుల్లో సర్కార్‌కు నివేదిక
  • ఎఫ్‌టీఎల్ నిర్ధారించనున్న ఇరిగేషన్, సర్వే రికార్డ్స్ అధికారులు
  • గచ్చిబౌలి: ఖానామెట్ సర్వే నంబర్ 36లోని తమ్మిడి కుంట సర్వే రెండో రోజైన శనివారం కూడా కొనసాగింది. రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్, ల్యాం డ్ రికార్డ్స్ అధికారులు కుంట పక్కనే గల ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌లోనే ఎక్కువ సమయం సర్వే జరిపారు. సర్వే పూర్త చేసిన అధికారులు ప్రభుత్వానికి రెండు రోజుల్లో నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. సర్వే ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డెరైక్టర్ నరహరి, శేరిలింగంపల్లి సర్వేయర్ మధుసూదన్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ సర్వేలో పాల్గొన్నారు.
     
    శిల్పారామానికి కేటాయించిన స్థలంపై దృష్టి

    తమ్మిడికుంట ఎఫ్‌టీఎల్‌లో గతంలో శిల్పారామం పార్కింగ్ కోసం రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఆ ప్రాంతాన్ని బండ రాళ్లతో పూడ్చిన శిల్పారామం అధికారులు అక్కడ పనిచేసే వారి నివాసానికి కేటాయించారు. సర్వే చేసిన అధికారులు శిల్పారామానికి కేటాయించిన స్థలం ఎంతవరకు ఎఫ్‌టీఎల్ పరిధిలోకి వస్తుందో తేల్చనున్నారు.
     
    రెండు రోజుల్లో నివేదిక: తహశీల్దార్

    ఫీల్డ్ సర్వే పూర్తయినప్పటికీ మంగళవారం నాటికి నివేదిక రూపొందించే అవకాశం ఉందని శేరిలింగంపల్లి తహశీల్దార్ విద్యాసాగర్ తెలిపారు. ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారిస్తే బఫర్ జోన్ తెలిసిపోతుందన్నారు. ఆక్రమణలుంటే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
     

మరిన్ని వార్తలు