ముగిసిన ‘స్థానిక’ ఉప ఎన్నికలు

5 Jul, 2015 02:38 IST|Sakshi

నల్లగొండ: స్థానిక సంస్థల ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. నాలుగు సర్పంచ్ స్థానాలు, వార్డులు 19, ఒక ఎంపీటీసీ స్థానానికి శనివారం ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తొలి సారిగా వినియోగించిన ఈవీఎంల ప్రయోగం విజయవంతమైంది. మోత్కూరు మండలం ముసిపట్ల ఎంపీటీసీ స్థానానికి, నాలుగు సర్పంచ్ స్థానాలకు ఈవీఎంల ద్వారానే పోలింగ్ నిర్వహించారు. 19 వార్డు స్థానాలకు మాత్రం బ్యాలెట్ పద్ధతిలోనే పోలింగ్ జరిగింది. ఈవీఎంల వినియోగం వల్ల పోలింగ్ అనంతరం నిర్వహించిన ఓట్ల లెక్కింపు పది నిమిషాల్లో పూర్తయ్యిందని అధికారులు తెలిపారు.
 
 దీంతో భవిష్యత్తులో స్థానిక ఎన్నికల నిర్వహణలో మొత్తం కూడా ఈవీఎంలనే ప్రవేశపెట్టనున్నారు. ఇదిలా ఉంటే శనివారం నాటి ఎన్నికల ఫలితాల్లో... గుర్రంపోడు మండలం పాల్వాయి సర్పంచ్ స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా... మర్రిగూడ మండ లం వట్టిపల్లి, మఠంపల్లి మండలం చెన్నాయిపాలెం సర్పంచ్ స్థానాలు టీఆర్‌ఎస్ వశమయ్యాయి. మునగాల మండలం నర్సిం హులగూడెం ఒప్పందం మేరకు సీపీఎం ఖాతాలోకి వెళ్లింది. ముసిపట్ల ఎంపీటీసీ స్థానానికి సంబంధించిన ఈవీఎంలు మోత్కూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపర్చారు. సోమవారం ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. సర్పంచ్, ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్ 78 నుంచి 91 శాతం వరకు జరిగింది. పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
 

మరిన్ని వార్తలు