చీఫ్‌ లిక్కర్‌ నుంచి ‘టీచర్స్‌’ వరకు ఏదైనా సరే...

9 Apr, 2020 13:28 IST|Sakshi
లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చాక మరిపెడలోని వైన్స్‌ నుంచి మద్యం తరలిస్తున్న వ్యక్తులు

చుక్కల్లో లిక్కర్‌ ధరలు

లాక్‌డౌన్‌లో జడలు విప్పుతున్న మద్యం మాఫియా

ఉమ్మడి జిల్లాలో పలువురు వ్యాపారుల దందా

పల్లెల్లో బెల్టుషాపుల ద్వారా విచ్చలవిడిగా అమ్మకం

అక్రమార్కులకు కలిసొస్తున్న ‘కరోనా’

నమ్మకమైన వ్యక్తులకే విక్రయాలు.. ప్రత్యేక ‘కొరియర్‌’ వ్యవస్థ

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: లాక్‌డౌన్‌ నేపథ్యంలో మద్యం బ్లాక్‌ దందా ఊపందుకుంది. జనతా కర్ఫ్యూ, ఆ వెంటనే లాక్‌ డౌన్‌ ప్రకటించడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వైన్స్‌లు, బార్లు మూతబడ్డా యి. మొదటి రెండు రోజులు వైన్స్‌లను యజమానులే మూసి వేయగా, ఆ తర్వాత ఎక్సైజ్‌ అధికారులు సీల్‌ చేశారు. ప్రస్తుతం మద్యం దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మూసి ఉన్నప్పటికీ.. బ్లాక్‌ మార్కెట్‌లో మాత్రం యథేచ్ఛగా అమ్మకాలు సాగుతున్నాయి. లాక్‌డౌన్‌తో షాపులన్నీ మూతపడగా ఎక్కడైనా నిత్యావసరాలకు ఇబ్బంది ఎదురవుతుందేమో కానీ ధర ఎక్కువ చెల్లిస్తే మాత్రం మద్యం దొరుకుతోందనే ప్రచారం సాగుతోంది. మందుబాబుల ‘అవసరాన్ని’ ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు రెండింతలకు మించి ధరలతో అమ్ముతుండడం గమనార్హం. వైన్స్‌ నుంచి రహస్య ప్రదేశాలకు డంపింగ్‌ చేసిన బాటిళ్లు అమ్ముతున్నారా.. లేక ఆయా కంపెనీల పేరిట స్పిరిట్‌తో తయారు చేసినవా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

లాక్‌డౌన్‌ ఆసరాగా...
కరోనా కోరలు చాచిన నేపథ్యంలో మార్చి 15 నుంచి ప్రభుత్వం క్లబ్‌లు, పబ్బులు, బార్లు, 23వ తేదీ నుంచి వైన్స్‌ను మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే మార్చి 31 వరకూ తెలంగాణలో మద్యం షాపుల బంద్‌ అమల్లో ఉంటుందని తొలుత ప్రకటించినా... కరోనా ఉధృతి తగ్గకపోవడంతో ఈనెల 14 వరకు లాక్‌డౌన్‌ పొడిగించారు. ఇదే అదునుగా ‘మాఫియా’గా అవతారమెత్తిన కొందరు మద్యం వ్యాపారులు తమ దందా సాగిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1995 – 1997లో మద్య నిషేధం అమలులో ఉంది. ఆ తర్వాత వరుసగా ఇన్ని రో జులు అధికారికంగా మద్యం విక్రయాలు నిలిపి వేసి న సందర్భాలు లేవు. అయితే, ప్రస్తుత పరిస్థితులను ఆసరాగా చేసుకున్న పలువురు ధరలు పెంచి మరీ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు.

సీజ్‌ చేసినా ఆగని అమ్మకాలు
ఉమ్మడి జిల్లాలో 258 వైన్స్‌(ఏ–4)షాపులు, 123 బార్లు ఉన్నాయి. అధికారిక అంచనాల ప్రకారం వీటన్నింటి ద్వారా నెలకు సగటున రూ.150 కోట్ల నుంచి రూ.200 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయి. కరోనా నేపథ్యంలో మద్యం షాపులను మూసివేయగా.. కొందరు సిండికేట్‌గా మారి అడుగడుగునా బెల్టుషాపుల ద్వారా అమ్ముతున్నారు. వరంగల్‌ అర్బన్, రూరల్, జయశంకర్‌ భూ పాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ములుగు జిల్లాల్లో అధిక ధరలతో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. చీఫ్‌ లిక్కర్‌ నుంచి బీర్లు, అన్ని బ్రాండ్ల విస్కీ బాటిళ్లను మూడు, నాలుగింతలు ధర పెంచి విక్రయిస్తున్నారు.  మూడు రోజుల క్రితం హసన్‌పర్తి మండలంలో ఓ బెల్టుషాపుపై దాడి చేసిన పోలీసులు రూ.75 వేల విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతకు ముందు కమలాపూర్, ఏటూరునాగారం, మహబూబాబాద్, జనగామ ప్రాంతాల్లో కూడా మద్యం లభ్యమైంది. కాగా మారుమూల పల్లెల్లో మళ్లీ గుడుంబా తయారీ, విక్రయాలు జరుగుతున్నట్లు కూడా ప్రచా రంలో ఉంది. అయినా మద్యం అక్రమాలపై అధి కారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండడం చర్చనీయాంశమవుతోంది.

చీఫ్‌ లిక్కర్‌ నుంచి టీచర్స్‌ వరకు ఏదైనా సరే...
చీఫ్‌ లిక్కర్‌ మొదలు అన్ని బ్రాండ్లపై ధరలు మూడు, నాలిగింతలు పెంచి అమ్ముతున్నారు. ఆఫీసర్స్‌ ఛాయిస్‌ ఫుల్‌బాటిల్‌ ధర(ఎమ్మార్పీ)రూ.450 కాగా బ్లాక్‌మార్కెట్‌లో రూ.1,100 వరకు తీసుకుంటున్నారు. ఈ ధరతో డోర్‌ డెలివరీ చేస్తున్నట్లు ప్రచారం ఉంది. కొందరు మందుబాబులు ధరలకు వెరవకుండా కొనుగోళ్లకు సిద్ధమవుతుండడంతో మద్యం అక్రమ వ్యాపారుల దందా సాగుతోంది.

మూడు టీంలతో నిఘా
ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్‌ డౌన్‌ నేపథ్యంలో మద్యం షాపులను సీజ్‌ చేశాం. ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇలా మూడు బృందాలతో మద్యం షాపులపై నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాం. అక్రమంగా మద్యం సరఫరా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటాం. బెల్ట్‌షాపు రహితంగా తీర్చిదిద్దేందుకు నిత్యం ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నాయి.
– పి.బాలస్వామి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్, వరంగల్‌ అర్బన్‌

సరుకులో తేడా వస్తే కేసు నమోదు
ప్రతిరోజు మూడు సార్లు మద్యం షాపులను తనిఖీ చేస్తున్నాం. లాక్‌ డౌన్‌కు ముందు.. తెరిచాక సరుకులో తేడా ఉంటే కేసు నమోదు చేసి రూ.లక్ష జరిమానా విధిస్తాం. ప్రతీ మద్యం షాపు వద్ద ఉన్న సీసీ కెమెరాల పుటేజీని లాక్‌డౌన్‌ ముగిశాక పరిశీలించి బంద్‌ సమయంలో ఏమైనా అక్రమాలు జరిగాయా అనేది చూస్తాం. మద్యం విక్రయించే బెల్ట్‌షాపులల బాధ్యులపై కేసులు నమోదు చేస్తున్నాం.
– రామకృష్ణ, ఇన్‌స్పెక్టర్, హన్మకొండ ఎక్సైజ్‌ స్టేషన్‌

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు