మహిళలకు మళ్లీ నాటి పరిస్థితి?

2 May, 2020 03:37 IST|Sakshi

స్త్రీలపై 1960నాటి పరిస్థితులు పునరావృతం అవుతాయేమో

నిరుద్యోగం పెరిగితే తొలుత బలయ్యేది మహిళలే

ఐరాస సెక్రటరీ జనరల్‌ గుటెర్రస్‌

సాక్షి, హైదరాబాద్‌: సమాజంలో అసమానతలు, లింగ వివక్షకు కరోనా వైరస్‌ పరోక్షంగా కారణమవుతోందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ అభిప్రాయపడ్డారు. తొలి దశలో ప్రపంచవ్యాప్తంగా పురుషుల ఆరోగ్య స్థితిని కరోనా దెబ్బ తీస్తుందని, ముఖ్యంగా వృద్ధులను బలి తీసుకుంటుందని భావించామని, క్రమంగా రూటు మార్చుకున్న కరోనా మహిళల భద్రతకే సవాలుగా మారిందని ఆయన తెలిపారు. కరోనా పరిణామ క్రమంపై గుటెర్రస్‌ అంతర్జాతీయ మీడియాను ఉద్దేశించి రాసిన ఓ వ్యాసాన్ని ఐరాస తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచింది. ఈ వ్యాసంలో ఆయన కరోనా కారణంగా మహిళా శక్తి అర్ధ శతాబ్దం వెనక్కు వెళ్ళినట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. (ట్రంప్ తాజా బెదిరింపు : ట్రేడ్ వార్ భయాలు)

గుటెర్రస్‌ వ్యాసంలోని ముఖ్యాంశాలు: ‘ఇప్పటికే లాక్‌ డౌన్, క్వారంటైన్‌ వల్ల మహిళలపై ప్రపంచవ్యాప్తంగా గృహ హింస పెరిగింది. అయితే మహిళలపై హింస పెరగకుండా ఇప్పటికే ప్రపంచంలోని 143 దేశాలు రక్షణ చర్యలు మొదలుపెట్టాయి.  కానీ, కరోనా కారణంగా తలెత్తనున్న ఆర్థిక సంక్షోభం ప్రపంచ మహిళల ముఖ చిత్రం మార్చబోతోంది. ఇటీవలి సంక్షోభ కాలంలో మహిళలపై భౌతిక అరాచకం పెరిగిపోతోంది. వారి హక్కులు, స్వేచ్ఛపై దాడి జరుగుతోంది. నేను 1960ల్లో విద్యార్థిగా ఉన్నప్పుడు మహిళల శ్రమ చూశాను. మోయలేని బరువులు నెత్తిన పెట్టుకుని కూలీ పనికి వెళ్లడం గమనించాను. నేను రాజకీయాల్లోకి రావడానికి అది కూడా కారణం అయింది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలని, మహిళలకు సమాన ఉపాధి, వేతనం లభించాలని కోరుకున్నా. తరువాత కాలంలో నేను ఆశించినది జరిగింది. (కరోనా విపత్తు: భారీ ఉపశమనం)

కానీ, కరోనా వైరస్‌ మళ్లీ పాత పరిస్థితుల్లోకి వారిని నెడుతోందని అనిపిస్తోంది. పనిమనిషిగా, దినసరి కూలీగా, తోపుడు బండి వ్యాపారిగా, చిన్న తరహా ఉద్యోగినిగా మహిళ పురుషుడికన్నా ఎక్కువ శ్రమ చేస్తుంది. ఐఎల్‌ఓ అంచనా ప్రకారం రానున్న మూడు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల ఉద్యోగాలు పోతాయని అంటున్నారు. మొదట ప్రభావం చూపేది మహిళల మీదనే అని నా అభిప్రాయం. మరో విషయం ఏమిటంటే కరోనా బాలికా విద్యను కూడా ప్రభావితం చేయనుంది. ఎబోలా వైరస్‌ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా (వైరస్‌ ప్రభావం ఉన్న దేశాల్లో) బాలికా విద్య 50 నుంచి 34 శాతానికి తగ్గిపోయిన విషయం విస్మరించలేనిది. ఈ అంశాలన్నింటిపై రాజకీయ నాయకత్వం దృష్టి పెట్టాలి. బాలికా విద్యతో పాటు, మహిళలకు సామాజిక భద్రత, హెల్త్‌ ఇన్సూరెన్స్, సిక్, చైల్డ్‌ కేర్‌ సెలవులు, నిరుద్యోగ భృతి కల్పనలాంటి విషయాలపై పని చేయాలి. కరోనా దృష్టాంతం తర్వాత ప్రపంచం ఆ దిశలో ముందుకెళ్లినప్పుడే మహిళా హక్కులు పరిరక్షింపబడతాయి.’ (వైరల్ వీడియా షేర్ చేసిన ప్రధాని మోదీ)

మరిన్ని వార్తలు