ఈ నెలలోనూ పాతబిల్లే..!

18 May, 2020 12:21 IST|Sakshi

సాక్షి, నల్లగొండ : విద్యుత్‌ శాఖకు ఈ నెల కూడా కరోనా దెబ్బ తప్పలేదు. ఈ నెలలోనూ పాత బిల్లులే చెల్లించాలని ఆ శాఖ అధికారులు వినియోగదారులను కోరుతున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్‌ శాఖ రెండు నెలలుగా మీటర్‌ రీడింగ్‌ తీయడంలేదు. గత నెల మాదిరిగానే ఈ నెలలోనూ 2019 ఏప్రిల్‌లో వచ్చిన బిల్లులే చెల్లించాలని కోరుతున్నారు. కాగా జిల్లా వ్యాప్తంగా 6 లక్షల14 వేల వివిధ కేటగిరీల కనెక్షన్లు ఉండగా.. వాటి ద్వారా ప్రతి నెలా సుమారు రూ.21 కోట్ల విద్యుత్‌ బిల్లులు రావాల్సి ఉండగా.. గత నెలలో కేవలం రూ.9 కోట్ల వరకు వినియోగదారులు  చెల్లించారు. ఈ నెలలో రూ.3.36 కోట్లు మాత్రమే వసూలైంది.

బిల్లుల చెల్లింపునకు విముఖత
కరోనా కారణంగా ఏప్రిల్‌ నెలకు సంబంధించిన విద్యుత్‌ శాఖ మీటర్‌ రీడింగ్‌ తీయలేదు. 2019 ఏప్రిల్‌ మాసంలో చెల్లించిన బిల్లులను చెల్లించాలని కోరింది. బిల్లులు చెల్లించకపోయినా విద్యుత్‌ కనెక్షన్‌ మాత్రం తొలగించమని స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ ముగిశాక మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన రీడింగ్‌లు తీసి ఏనెలకు ఆ నెల విద్యుత్‌ బిల్లును విభజించి ఇస్తామని చెప్పింది. తర్వాత వినియోగదారులకు ఆయా నెలల్లో వాడుకున్న విద్యుత్‌కు సంబంధించి మాత్రమే బిల్లు వస్తుందని పేర్కొంది. అయినా వినియోగదారులు మాత్రం బిల్లుల చెల్లింపునకు సుముఖత చూపడంలేదు. రూ.21 కోట్లకు ఇప్పటి వరకు రూ.3 కోట్ల 36 లక్షలు మాత్రమే వసూలైంది. ఈ నెల 22 వరకు మాత్రమే బిల్లుల చెల్లింపునకు గడువు ఉంది. కేవలం ఐదు రోజుల్లో మిగిలిన రూ.17 కోట్ల పైచిలుకు బిల్లులను చెల్లించడం సాధ్యం కాని పరిస్థితి. 

వాడుకున్న కరెంటుకు బిల్లులు చెల్లించండి 
విద్యుత్‌ వినియోగదారులు వాడుకున్న విద్యుత్‌కు సంబంధించి బిల్లులు చెల్లించాలి. కరోనా కష్టకాలంలో కూడా ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్‌ సంస్థ 24 గంటల విద్యుత్‌ అందించింది. బిల్లులు చెల్లించకపోతే సంస్థకు ఇబ్బందులు ఎదురవుతాయి. బిల్లుల విషయంలో ఎలాంటి అపోహలు అవసరం లేదు. సంస్థ ఒక్క రూపాయకూ డా ఎక్కువ తీసుకోదు. ఎక్కువ చెల్లించినా తరువాత నెల బిల్లులో సరిచేస్తాం. వినయోగదారులు అంతా బిల్లులు చెల్లించాలి. 
– కృష్ణయ్య, ట్రాన్స్‌కో ఎస్‌ఈ

మరిన్ని వార్తలు