లాక్‌డౌన్‌: తీవ్ర నిరాశలో హలీమ్‌ ప్రియులు

17 May, 2020 17:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు విధించిన లాక్‌డౌన్‌ హలీమ్‌ ప్రియులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. లాక్‌డౌన్‌ కారణంగా రంజాన్‌ ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలు, తరావీలు, ఇఫ్తార్‌ విందులు ఇళ్లల్లోనే నిర్వహించుకోవాలని చెప్పడంతో హలీమ్‌ తయారీదారులు వెనకడుగేశారు. కానీ, లాక్‌డౌన్‌ సడలింపుల్లో ఏదైనా అవకాశం ఉంటుందేమోనన్న హలీమ్‌ ప్రియుల ఆశలు పూర్తిగా అడియాశలు అయ్యాయి. మామూలుగా రంజాన్‌ నెల ప్రారంభం కాగానే హలీమ్‌ కోసం జనాలు హోటళ్ల ముందు క్యూ కట్టేవారు. ఇంట్లో చేసుకోవటానికి వీలులేకో లేదా బయట షాపుల్లో అమ్మేంతగా రుచిగా ఇళ్లలో వండకో హలీమ్‌ దుకాణాల ముందుకు చేరేవారు. కానీ, ఈ సారి ఆ పరిస్థితి లేదు. లాకడౌన్‌ కారణంగా హైదరాబాద్‌ ప్రాంతానికి చెందిన హలీమ్‌ అమ్మే ప్రముఖ దుకాణాలు సైతం చేతులెత్తేశాయ్‌. ఈ సంవత్సరం హలీమ్‌ అమ్మటం లేదని స్పష్టం చేశాయి. ( దలీమ్‌గా మారుతోన్న హలీం )

కొద్ది రోజుల క్రితం పిస్తా హౌస్‌ యజమాని, హైదరాబాద్‌ హలీమ్‌ మేకర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ మహ్మద్‌ అబ్ధుల్‌ మజీద్‌ మాట్లాడుతూ.. ‘‘ హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని 6వేల మంది హలీమ్‌ తయారీదారులు ఈ సంవత్సరం హలీమ్‌ అమ్మకూడదని నిర్ణయించాము. లాక్‌డౌన్‌లో ప్రభుత్వానికి సహకరించాలనే ఈ నిర్ణయం తీసుకున్నాము. ప్రజల సంరక్షణను దృష్టిలో పెట్టుకుని హలీమ్‌ అమ్మడాన్ని​ రద్దు చేసుకున్నా’’మని చెప్పారు. అయితే బయట హలీమ్‌ దొరక్కపోయినా ఇంట్లోనే ఉండి రుచికరమైన, సురక్షితమైన హలీమ్‌ను తయారుచేసుకోవటం మాత్రం ప్రజల చేతుల్లోనే ఉంది.

మరిన్ని వార్తలు