ఉపాధి పాయే..

2 May, 2020 11:49 IST|Sakshi

‘లాక్‌డౌన్‌’తో మూతపడ్డ క్షౌరశాలలు

దయనీయంగా నాయీబ్రాహ్మణుల జీవితాలు

కుటుంబం గడవక అవస్థలు

షాప్‌ అద్దె, కరెంట్‌ బిల్లు చెల్లించలేని దుస్థితి

ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తులు వలస కూలీలు.  ఇతర రాష్ట్రం నుంచి భువనగిరికి మూడు నెలల క్రితం వలస వచ్చారు.  క్షౌరశాలలు మూత పడడంతో తోటి కూలీకి సహచరుడే కటింగ్‌ చేశాడు.

రాజాపేట : లాక్‌డౌన్‌ నేపథ్యంలో జిల్లాలోని నాయీబ్రాహ్మణుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా క్షౌరశాలలు మూతపడడంతో జీవనోపాధి కోల్పోయి కుటుంబాలు గడవడమే గగనంగా మారింది. ఇళ్లలోకి వెళ్లి క్షౌరం చేద్దామన్నా కరోనా వైరస్‌ వ్యాప్తి భయంతో ఎవరూ రానించే పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నా ఎక్కడా పని దొరకడం లేదు. దాదాపు నలబై రోజులుగా షాపులు మూతపడడంతో కరెంట్‌ బిల్లు, అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది.

జిల్లాలో ఇలా..
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో సుమారు రెండు వేల వరకు చిన్న, పెద్ద క్షౌరశాలలు ఉన్నాయి. వీటిలో 3,500 వరకు నాయీ బ్రాహ్మణులు పని చేస్తున్నారు. వీరిపై ఆధారపడి మరో 10వేల మంది జీవనం సాగిస్తున్నారు. ఒక్కో నాయీ బ్రాహ్మణుడు పట్టణ ప్రాంతాల్లోనైతే రూ.500నుంచి రూ.700 వర కు సంపాదిస్తుంటాడు. మండల కేంద్రాల్లో ఒక్కరి సంపాదన రూ.300 వరకు ఉంటుంది. ఇక షాప్‌ యజమానికి.. వర్కర్స్‌కు రోజువారీ కూలి సగం పోను మిగతా ఆదాయమంతా మిగులుతుంది. క్షౌరశాలలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఆయా కుటుంబాలు లౌక్‌డౌన్‌తో సెలూన్‌లు మూతపడడంతో ఒక్కసారిగా ఉపాధి కోల్పోయారు. లాక్‌డౌన్‌ను మరికొంతకాలం పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో జీవనోపాధిపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమకు చేయూతనిచ్చేవారు కరువయ్యారని, ప్రభుత్వం దయతలచి ఆదుకోవాలని నాయీబ్రాహ్మణులు వేడుకుంటున్నారు.

సొంతంగా క్షవరాలు..
లాక్‌డౌన్‌ కారణంగా క్షౌరశాలలు మూతపడడంతో జనం జుట్టు, గడ్డాలు పెంచుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే చాలా మందికి ఇళ్లలోనే గడ్డం చేసుకునే అలవాటు ఉండడంతో ఆ సమస్యమీ లేదు. కానీ, జుట్టు పెరగడంతో బయటకు రాలేకపోతున్నారు. కరోనా వైరస్‌ భయంతో నాయీబ్రాహ్మణులను ఇళ్లకు పిలిపించుకోలేని పరిస్థితి. దీంతో కొందరు గత్యంతరం లేక ఇళ్లలోనే తమతో పాటు తమ పిల్లల కు అడ్డదిడ్డంగా హెయిర్‌ కటింగ్‌ చేసుకుంటున్నారు.

దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నాం
కరోన ప్రభావంతో  క్షౌ రశాలలు మూతపడ్డాయి. ఉపాధి లేక నాయీబ్రాహ్మణులు దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్ర త్యామ్నాయ పనులు దొరకడం లేదు. కుటుంబపోషణ భారంగా మారింది. నెల తిరిగేసరికి షాపులు అద్దె మీద పడుతుంది. ఉన్న పరిస్థితుల్లో అద్దె చెల్లించలేకపోతున్నాం. ప్రభుత్వం ఆదుకోవాలి.–ఎన్‌.కరుణాకర్, సింగారం

మరిన్ని వార్తలు