బస్సు పాస్‌లపై ఇదేం ద్వంద్వ వైఖరి?

7 Apr, 2020 10:10 IST|Sakshi

కాల పరిమితి పొడిగింపునకు ఆర్టీసీ వెనుకంజ  

3.5 లక్షల మంది వినియోగదారులకు తీవ్ర నష్టం

లాక్‌డౌన్‌ తర్వాత మరోసారి రెన్యూవల్‌ చేయాల్సిందే  

సాక్షి, హైదరాబాద్‌: ఘట్‌కేసర్‌ సమీపంలోని ఓ ఇంజినీరింగ్‌లో రంజిత్‌ విద్యనభ్యసిస్తున్నాడు. ప్రతిరోజూ మారేడుపల్లి నుంచి సిటీబస్సులో కాలేజీకి వెళ్లి వస్తుంటాడు. మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 15 వరకు తన బస్సుపాస్‌ చెల్లుబాటయ్యేలా రూ.990 చెల్లించి రెన్యూవల్‌ చేసుకున్నాడు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా అన్ని సేవలూ నిలిచిపోయినట్లుగానే సిటీ బస్సులకు సైతం బ్రేక్‌ పడింది. దీంతో అతడు పాస్‌ కోసం డబ్బులు చెల్లించినప్పటికీ ఆర్టీసీ సేవలను వినియోగించుకోలేకపోయాడు. ఇది అతడికి  ఆర్థికంగా నష్టమే. ఇలా ఇతడొక్కడే కాదు గ్రేటర్‌ హైదరాబాద్‌లోని సుమారు 3.5 లక్షల మంది బస్సుపాస్‌ వినియోగదారులు లాక్‌డౌన్‌ కారణంగా సుమారు రూ.15 కోట్ల మేర నష్టపోవాల్సివస్తోంది. సాధారణంగా అనూహ్యమైన పరిస్థితుల్లో సేవలు స్తంభించినప్పుడు బస్సుపాస్‌ల చెల్లుబాటు గడువును పొడిగించే ఆర్టీసీ.. ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో లక్షలాది మంది వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ‘లాక్‌డౌన్‌ కారణంగా అన్ని వర్గాల ప్రజలు నష్టపోయినట్లుగానే బస్సుపాస్‌ వినియోగదారులు సైతం నష్టపోవాల్సివస్తోంది’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. 

ఇదేం ద్వంద్వ వైఖరి?
సాధారణంగా ప్రయాణికులు బస్సు ఎక్కిన తర్వాత తాము వెళ్లాల్సిన గమ్యస్థానం వరకు టికెట్‌ కొనుక్కొని ప్రయాణం చేస్తారు. కానీ రెగ్యులర్‌గా రాకపోకలుసాగించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు వివిధ వర్గాల ప్రయాణికులు ఒక నెల రోజుల ప్రయాణం కోసం ముందుగానే డబ్బులు చెల్లించి నెలవారీ పాస్‌లను కొనుగోలు చేస్తారు. తాము చెల్లించిన గడువు మేరకు ఆర్టీసీ  సేవలందజేస్తుందనే నమ్మకంతోనే ప్రయాణికులు ముందే డబ్బులు చెల్లిస్తున్నారు. కానీ అనూహ్యమైన పరిస్థితుల్లో  ఆర్టీసీ సేవలు స్తంభించినప్పుడు  ప్రయాణికులు చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వడమో లేక సేవలు అందజేయలేని రోజులకు అనుగుణంగా పాస్‌ల కాలపరిమితిని పెంచడమో చేయాలి. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా బస్సులు నడపలేకపోయినా, ఆర్టీసీ స్వతహాగా బస్సులను నిలిపివేసినా ఇలాంటి పొడిగింపు సదుపాయాన్ని అందజేస్తారు. కానీ లాక్‌డౌన్‌ కాలానికి మాత్రం ఇది వర్తించకపోవచ్చని ఆర్టీసీ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో సాధారణ ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు తదితర వర్గాల అవసరాలకు అనుగుణంగా ఆర్టీసీ సుమారు 9 రకాల పాస్‌లను అందజేస్తోంది. వీటిలో విద్యార్థులకు రాయితీపై లభించే నెలవారీ పాస్‌లు, 3 నెలల పాస్‌లు, రూట్‌పాస్‌లు, సబర్బన్, మఫిసిల్‌ పాస్‌లు వంటి వివిధ రకాల పాస్‌లు ఉంటాయి. అలాగే ఉద్యోగుల కోసం ఎన్జీఓ పాస్‌లు ఇస్తారు. ఇక ఎలాంటి రాయితీ సదుపాయం లేని వారు తమ అవసరాల మేరకు  రూ.890 చెల్లించి ఆర్డినరీ పాస్, రూ.990తో ఎక్స్‌ప్రెస్‌ పాస్‌ తీసుకుంటారు. ఏసీ బస్సు పాస్‌ ధర రూ.2000 వరకు ఉంటుంది. ఐటీ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు ఎక్కువగా ఏసీ పాస్‌లను వినియోగిస్తారు. ఇలా గ్రేటర్‌ పరిధిలో సుమారు 3.5 లక్షల మంది వినియోగదారులు ప్రతి నెలా రూ.15 కోట్ల వరకు చెల్లిస్తున్నారు. కానీ లాక్‌డౌన్‌ కారణంగా వారు చెల్లించిన డబ్బులకు సేవలు లభించకపోవడమే కాకుండా కాలపరిమితి పొడిగింపుపై కూడా ఎలాంటి గ్యారంటీ లభించకపోవడం గమనార్హం. (బాయ్‌ఫ్రెండ్‌ దగ్గరికి వెళ్లాలి... అనుమతివ్వండి)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు