‘డబుల్‌’ ఇళ్లకు గ్రహణం

23 May, 2020 08:41 IST|Sakshi
జవహర్‌నగర్‌లో అసంపూర్తిగా ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు

నిర్మాణాలపై లాక్‌డౌన్‌ మరింత ప్రభావం

జిల్లాకు మంజూరైన ఇళ్లు 2420  

పూర్తయినవి కేవలం 630

నిర్మాణం వివిధ దశల్లో ఉన్నవి 422   

ప్రారంభ దశలో 1368 ఇళ్లు

సాక్షి, మేడ్చల్‌ జిల్లా: పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు చేపట్టిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణానికి గ్రహణం పట్టింది. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల తీరుతో ఇప్పటికే నత్తనడకన సాగుతున్న ఇళ్ల నిర్మాణాలపై కరోనా–లాక్‌డౌన్‌ మరింత ప్రభావం చూపుతోంది. దీంతో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తి మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

ఐదేళ్ల క్రితం మంజూరు...
మేడ్చల్‌ జిల్లాలో రూ.137 కోట్ల వ్యయంతో 2420 రెండు పడకల ఇళ్లు నిర్మించేందుకు ప్రభుత్వం ఐదేళ్ల క్రితం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కేటాయించిన నిధుల్లో రూ.40 కోట్ల విలువైన పనులను కూడా అధికారులు పూర్తి చేయలేకపోయారు.  జిల్లాలో ఇప్పటి వరకు 13 ప్రాంతాల్లో 630 ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణాలు చేపట్టగా,  33 ప్రాంతాల్లో 422 ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. మరో 1368 ఇళ్లు ప్రారంభ దశలో ఉన్నాయి. ఇంకా 260   నిర్మాణాలకు టెండర్లు పిలవాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. జిల్లాలో రెండు పడకల ఇళ్ల కోసం 1.20 లక్షల మంది పేదలు దరఖాస్తు చేసుకున్నారు. ఇళ్లు ఇంకా నిర్మాణ దశలోనే ఉండటంతో వారి ఆశలు ఇప్పట్లో నెరవేరే పరిస్థితి కనిపించడంలేదు.

కేటాయింపులు అంతంత మాత్రమే
 జనాభా, ఇళ్ల కోసం అందిన దరఖాస్తుల ప్రాతిపదికన కాకుండా మేడ్చల్‌ జిల్లాకు ప్రభుత్వం కేవలం 2,420 ఇళ్లను కేటాయించడంతో అవి ఎటూ సరిపోని పరిస్థితి నెలకొంది.  గృహ నిర్మాణ శాఖ రద్దు కావడంతో జిల్లాకు మంజూరైన ఆ కొద్దిపాటి ఇళ్ల నిర్మాణ బాధ్యతలను కూడా ప్రభుత్వం ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ (పీఆర్‌) శాఖలకు అప్పగించి సత్వరమే నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే పలు కారణాల వల్ల పనుల్లో జాప్యం అవుతోంది.

ఆర్‌ అండ్‌ బీ శాఖ ఆధ్వర్యంలో ఇలా..  
జిల్లాలో ఆర్‌ అండ్‌ బీ శాఖ ఆధ్వర్యంలో13 ప్రాంతాల్లో చేపట్టిన 630 ఇళ్ల నిర్మాణం పూర్తయింది.  కీసరలో 50 ఇళ్లు, యాద్గార్‌పల్లి– 40, ఫీర్జాదిగూడ– 74, పర్వతాపూర్‌– 40, చెంగిచర్ల– 40 , తుర్కపల్లి –40,  కిష్టాపూర్‌– 80, సోమారం– 30,  చీర్యాల– 40,  బోడుప్పల్‌– 74,  ఘట్‌కేసర్‌– 50,  కొర్రెముల్‌లో 80 ఇళ్ల నిర్మాణం పూర్తయింది.

పీఆర్‌ శాఖ ఆధ్వర్యంలో ...
జిల్లాలో పంచాయతీ రాజ్‌ (పీఆర్‌) శాఖ ఆధ్వర్యంలో 33 ప్రాంతాల్లో 1790 ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు రూ.90.57 కోట్లు మంజూరైనప్పటికీ..ఇప్పటి వరకు ఒక్క ఇంటిని కూడా పూర్తి చేయలేదు. 422 ఇళ్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు రూ.2.98 కోట్లు ఖర్చు చేశారు. 1368 ఇళ్లు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయి. మేడ్చల్‌ మండలంలో 308 ఇళ్ల నిర్మాణ పనులను ప్రారంభించాల్సి ఉండగా, శామీర్‌పేట్‌ మండలంలో 370 ఇళ్లకు గాను 40 ఇళ్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. అలాగే, మూడుచింతలపల్లి మండలంలో 450 ఇళ్లకు 100, ఘట్‌కేసర్‌లో 354 ఇళ్లకు 90, కీసరలో 170 ఇళ్లకు 54, మేడిపల్లి మండలంలో 138 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది.

అదనపు బాధ్యతతో నత్తనడక ...
జిల్లాలో గృహ నిర్మాణశాఖ  లేక పోవటంతో ఇళ్ల నిర్మాణ బాధ్యతలను జిల్లా యంత్రాంగం ఆర్‌ అండ్‌ బీ,  పీఆర్‌ శాఖలకు అప్పగించగా,  తమ పరిధిలోని కార్యకలాపాలను పర్యవేక్షిస్తూనే.... డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాలపై దృష్టి సారించాల్సి రావటంతో ఏ పనిపై సరిగ్గా కేంద్రీకరించలేకపోతున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణాలు నత్తకు నడక నేర్పుతున్నాయి. ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చెల్లించే ధర ఎటూ సరిపోవటం లేదన్న కారణంతో కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదని తెలుస్తోంది.  జిల్లా అధికార యంత్రాంగం ఒత్తిడి భరించలేక కాంట్రాక్టర్లు ముందుకు వచ్చినప్పటికీ కరోనా–లాక్‌డౌన్‌ కారణంగా మూడు నెలలు జాప్యం జరిగిందని చెప్తున్నారు.

మరిన్ని వార్తలు