లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌ : అడ్డగోలు దోపిడీ..

24 Mar, 2020 03:13 IST|Sakshi

నాలుగింతల మేర ధరలు పెంచిన వ్యాపారులు

మధ్యాహ్నం 12 గంటలకే చాలాచోట్ల స్టాక్‌లు ఖాళీ

నిత్యావసరాలకు కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌ : దేశం, రాష్ట్రమంతా కోవిడ్‌ మహమ్మారితో హడలెత్తిపోతుంటే.. ఈ ఆపత్కాలాన్ని కూడా వ్యాపారులు అవకాశంగా మలుచుకుంటున్నారు. ప్రజలపై ధరల భారాన్ని మోపుతున్నారు. ఈ నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ ప్రకటిం చిన నేపథ్యంలో కూరగాయల ధరలు పెం చేసి వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. లాక్‌డౌన్‌ విధిం చినప్పటికీ.. నిత్యావసర సరుకుల కొనుగోలుకు ప్రభుత్వం వెసులుబాటు ఇవ్వడంతో ప్రజ లంతా ఒక్కసారిగా మార్కెట్లకు ఎగబడ్డారు. దీంతో హైదరాబాద్‌ సహా అన్ని జిల్లాలు, మండల కేంద్రాల్లోని రైతు బజార్లు, సూపర్‌ మార్కెట్లు కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం 7 గంటల నుంచే జనం కూరగాయల కొనుగోళ్లకు మొగ్గుచూపారు.

నాలుగింతలు పెరిగిన ధరలు..
ఆదివారం జనతా కర్ఫ్యూ కొనసాగడంతో ఇళ్లకే పరిమితమైన జనం సోమవారం ఉదయం రోడ్లపైకి వచ్చారు. ఆదివారం మార్కెట్లోకి కూరగాయలు రాకపోవడంతో నిల్వలు తక్కువగా ఉండటం, డిమాండ్‌ అధికంగా ఉండటంతో వ్యాపారులు ధరలు పెంచేశారు. మెహదీపట్నం రైతుబజార్‌లో నిన్నమొన్నటి వరకు కిలో టమాట రూ.10 వరకు ఉండగా, సోమవారం ఏకంగా రూ.80 నుంచి రూ.100కు అమ్మారు. అధిక ధరలకు అమ్మొద్దని మార్కెట్‌ అధికారులు ప్రకటించి, ధరల నిర్ణయ సూచీ ఏర్పాటు చేసినా వ్యాపారులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ఇదే బజార్‌లో పచ్చిమిర్చీ కిలో ఏకంగా రూ.100 వరకు అమ్మారు. ఇతర మార్కెట్లలో కూడా టామాట కిలో రూ.50 నుంచి రూ.80 వరకు అమ్మకం చేయగా, పచ్చిమిర్చి కిలో రూ.150 వరకు అమ్మినట్లు కొనుగోలుదారులు తెలిపారు. అన్ని రకాల కూరగాయలు కూడా నాలుగింతలు పెరిగాయి. వారం రోజులకు సరిపడా కొనుగోలు చేయడంతో మధ్యాహ్నం 12 గంటలకే స్టాక్‌లు ఖాళీ అయ్యాయి.

జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. కొన్ని చోట్ల పాలు, పెరుగుకు డిమాండ్‌ పెరిగింది. దీన్ని కూడా వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. పాల ప్యాకెట్‌పై రూ.5 వరకు పెంచినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బియ్యం, పప్పులు, నూనెల కొనుగోళ్లకూ గిరాకీ పెరిగింది. అయితే వీటి ధరల్లో మాత్రం పెరగలేదు. చాటాచోట్ల జనం మార్కెట్లకు మాస్క్‌లు లేకుండా, గుంపుగుంపులుగా వస్తుండటం, అది టీవీ చానళ్లలో ప్రసారం అవుతుండటంతో ప్రభుత్వం జాగ్రత్త చర్యలు తీసుకుంది. నిత్యావసరాల కొనుగోళ్లకు ఒక్కరికి మంచి బయటకు రావొద్దని, సమీప ప్రాంతాల దుకాణాల్లోనే సరుకులు కొనుగోలు చేయాలని, సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలని ఆంక్షలు పెట్టడంతో సాయంత్రం రద్దీ తగ్గింది.

జాగ్రత్తలు తీసుకోండి..
నిత్యావసర వస్తువులు ధరలు పెరుగుతున్నాయన్న సంకేతాల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. సోమవారం ఉదయం ఈ అంశమై కేంద్ర వినియోగదారుల శాఖ కార్యదర్శి పవన్‌కుమార్‌ అగర్వాల్‌ ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పాలు, కూరగాయల ధరలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన ముఖ్య సరుకులను ఇంటికే పంపించే అంశాలపైనా సూచనలు చేశారు.

పహారా మధ్య అమ్మిస్తేనే
ఆపత్కాలంలో అవసరాన్ని ఆసరాగా చేసుకుని సొమ్ము చేసుకునే వ్యాపారులపై కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికే అనేక అపోహలు, అనుమానాల మధ్య బతుకుతున్న తమను నిలువు దోపిడీ నుంచి బయటపడేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అంటున్నారు. అడ్డగోలుగా కూరగాయల ధరలు పెంచి అమ్మడంతో ఏమీ కొనలేకపోతున్నామని, లాక్‌డౌన్‌ ప్రారంభమైన రోజే ఇలాంటి పరిస్థితి ఉంటే మరికొన్ని రోజులు పోతే ఎలా ఉంటుందన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో కూరగాయల అమ్మకాలను పోలీసు పహారా లేదంటే మరే రూపంలోనైనా జరపాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రైతుబజార్లు, మార్కెట్లు, మాల్స్‌లో విపరీతంగా పెరిగిపోయిన ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఆంక్షలు విధించి కూరగాయలు అమ్మించాలని, నిత్య జీవితంలో కీలకమైన వీటిని కొనుగోలు చేసే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని అంటున్నారు. ఎక్కువ రేట్లకు అమ్ముతున్న వారిపై ఫిర్యాదు చేసే పరిస్థితి లేదని, ఎక్కడ ఫిర్యాదు చేయాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో అవసరమైతే ప్రభుత్వం ఇందుకోసం కమిటీలు ఏర్పాటు చేయాలని, ఈ కమిటీ సభ్యులు రైతు బజార్లు, మార్కెట్లలో స్వయంగా ఉండి కూరగాయల విక్రయాలను నిర్వహించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు