‘రోజూ తాగే ఛాయ్‌ కూడా బంద్‌జేసినం’

21 Apr, 2020 10:49 IST|Sakshi

బీవైనగర్‌కు చెందిన వడ్డేపల్లి రూప బీడీ కార్మికురాలు. గతంలోనే భర్త చనిపోయాడు. మురని, లహరి కూతుళ్లు. వీరిద్దరూ ఇంటరీ్మడియట్‌ చదువుతున్నారు. రోజూ కనీసం వెయ్యి బీడీలు తయారు చేస్తే.. నెలకు రూ.5వేల వరకు ఆదాయం వచ్చేది. కరోనా వైరస్‌ వ్యాప్తి కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌తో రూప ఉపాధి కోల్పోయింది. రాష్ట్రప్రభుత్వం అందించిన రేషన్‌ బియ్యం, రూ.1,500, నగదు, కేంద్రప్రభుత్వం ద్వారా అందిన రూ.500 సాయంతో ప్రస్తుతం కాలం వెళ్లదీస్తోంది. దాతలు ఇస్తున్న కూరగాయలు, నిత్యాసవరాలతో సరిపెట్టుకుంటోంది. ప్రభుత్వం నుంచి అందిన ఆర్థికసాయం ద్వారా మహిళా సంఘంలో తీసుకున్న రుణం తాలూకు వాయిదా చెల్లిస్తోంది. (ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌ వాహనాల సీజ్‌ )

సిరిసిల్లలోని ఓ షాపింగ్‌ మాల్‌లో పనిచేసే రాజు నెలవేతనం రూ.8వేలు. ఇతడికి భార్య, ఇద్దరు పిల్లలే. తన వేతనంలోంచే ఇంటి కిరాయి చెల్లించాడు. నెలకు సరిపడా సరుకులు తెచ్చుకున్నాడు. కానీ, లాక్‌డౌన్‌తో పనిబందైంది. ఈనెల వేతనం రాలేదు. వారానికోసారి నాన్‌వెజ్‌తో కూడిన భోజనం చేసే అతడి కుటుంబం.. ఈసారి పూర్తిగా కూరగాయలకే పరిమితమైంది. వాయిదా పద్ధతిన కొనుగోలు చేసిన మొబైల్‌ఫోన్‌ వాయిదా చెల్లించాడు. అవసరమైన ఔషధాలకు కొంత వెచ్చిస్తున్నాడు. తమ కుటుంబసభ్యులకు ఆకలిబాధ తెలియకుండ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేద, మధ్య తరగతివారు ఆచితూచి ఖర్చు చేస్తున్నారనే దానికి వీరి కుటుంబాల పొదుపు చర్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.

పిల్లలకే పాలు 
నా నెల జీతం రూ.12వేలు. భార్య ఫర్హానాజ్, పిల్లలు నైలా(3), మునజాహ్‌(1). ఈనెలకు సంబంధించిన జీతమింకా రాలే. అందుకే ఒక్కసారి కూడా నాన్‌వెజ్‌ భోజనం లేదు. పిల్లల కోసమే పాలు కొంటున్నం. మేం రోజూ తాగే ఛాయ్‌ కూడా దాదాపు బంద్‌జేసినం.                        
  – ఎండీ యూనస్, ప్రైవేటు ఉద్యోగి

పొదుపు చేయక తప్పడం లేదు
నాకు తక్కువ జీతం. అయినా గతంలో కుటుంబంతో కలిసి పార్కు, సినిమాలకు వెళ్లేవాళ్లం. అంతోఇంతో ఖర్చు చేసేవాళ్లం. ఇప్పుడు ఖర్చు తగ్గించుకున్నం. ఇంట్లోనే ఉంటున్నం. కిస్తులు కడుతున్నం
–  కోమటి వెంకటస్వామి,కాంట్రాక్టు ఉద్యోగి..అవసరాల గురించి తెలిసింది 

అవసరాల గురించి తెలిసింది.
కరోనా లాక్‌డౌన్‌తో అవసరాలు, అనవసరాల గురించి తెలిసింది. సాంచాలు నడిపితే నెలకు రూ.8వేలు వస్తయి. పదిహేను రోజుల కింద బతుకమ్మ చీరలు నేయడం షురూ జేసినం. నెలకు రూ.15 వేలు వస్తయనుకుంటే ఉన్న పనిపోయింది. నా భార్య రంజిత, పిల్లలు సంధ్య, అఖిల్‌. అందరం ఇంట్లోనే ఉంటున్నం. టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్‌ చూస్తున్నం. సర్కారు ఇచ్చిన బియ్యం, రూ.1,500తోనే కాలం వెళ్లదీస్తున్నం. (తండ్రైన ప్రముఖ మ్యూజిక్‌ డైరక్టర్‌ జీవీ )
– బింగి సంపత్, నేతకార్మికుడు

మరిన్ని వార్తలు