లాక్‌డౌన్‌ తప్ప మరో మార్గం లేదు : కేసీఆర్‌

6 Apr, 2020 19:42 IST|Sakshi

లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ప్రధానిని కోరతా

రాష్ట్రంలో మరో 100 కేసులు పెరిగే అవకాశం

యూఎస్‌లో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి

వైద్య సిబ్బందికి 10 శాతం అదనపు జీతం : కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో సోమవారం నాటికి 364 కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణపై ప్రగతిభవన్‌లో అధికారులతో సమీక్ష చేపట్టిన అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్‌ మానవజాతికి వచ్చిన అతిపెద్ద సంక్షోభమని వ్యాఖ్యానించారు. భారత్‌లాంటి  ఎక్కువ జనాభా గల దేశంలో లాక్‌డౌన్‌ విధించడం తప్ప మరో గత్యంతరంలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను కొనసాగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరబోతున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి చెందుతున్నందున ఏప్రిల్‌ 15 తరువాత కూడా మరో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని కోరతా అని చెప్పారు. ఒకవేళ దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌  ఎత్తివేసినా.. తెలంగాణలో మాత్రం కొనసాగుతుందని సీఎం స్పష్టం చేశారు.

తెలంగాణలో లాక్‌డౌన్‌కు ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారని కొనియాడారు. లాక్‌డౌన్‌ కారణంగా తెలంగాణ ఆదాయం గణనీయంగా పడిపోయిందన్నారు. మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో ఇప్పటి వరకు 25,937 మందిని క్వారెంటైన్‌లో ఉంచాం. నిజాముద్దీన్‌ ఘటనతో కలిపి 364 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటి వరకు 45 మంది డిశ్చార్జ్‌, 11 మంది చనిపోయారు. గాంధీ ఆస్పత్రిలో 308 మంది చికిత్సలో ఉన్నారు. ఢిల్లీలో నిర్వహించిన మర్కజ్‌ మత  ప్రార్థనలకు వెళ్లిన 1089 మందిని  గుర్తించాం. ఢిల్లీ వెళ్లొచ్చిన వారిలో 172 మందికి పాజిటివ్ వచ్చింది. వారి కుటుంబ సభ్యులు 92 మందికి పాజిటివ్ వచ్చింది. రాష్ట్రంలో మరో 100 కేసులు పెరిగే అవకాశం ఉంది. (జూన్‌ వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు..!)

కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 90 దేశాలు లాక్‌డౌన్‌ ప్రకటించాయి. లాక్‌డౌన్, స్వీయ నియంత్రణ వల్లే మనం బయట పడగలిగాం. బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) సర్వే ప్రకారం దేశంలో లాక్‌డౌన్‌ కొనసాగించడం తప్ప మరో మార్గంలేదు. కరోనా వైరస్‌ కట్టడికి కేంద్రం, ప్రపంచ ఆరోగ్యం సంస్థ చెప్పిన పద్ధతులను అనుసరిస్తున్నాం. లాక్‌డౌన్‌ అమలుతో వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేయగలిగాం. అగ్రరాజ్యం అమెరికా కూడా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. న్యూయార్క్‌లో దయనీయమైన పరిస్థితి ఉంది. బలయైన దేశం కూడా సహాయక స్థితికి చేరుకుంది.

చేతులెత్తి నమస్కరిస్తున్నా
ప్రాణాలకు తెగించి వైద్య సిబ్బంది అద్భుతంగా పనిచేస్తున్నారు. ఆస్పత్రుల్లో స్వీపర్ నుంచి డాక్టర్ వరకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.రాష్ట్రంలో 8 కోవిడ్ ఆస్పత్రులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. కరోనా పాజిటివ్ వస్తే గాంధీ ఆస్పత్రిలో ఉండాల్సిందే. వైద్య సిబ్బందికి 10 శాతం అదనపు జీతం. 95,392 మంది పారిశుద్ధ్య కార్మికులకు పూర్తి జీతం. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పారిశుద్ధ్య కార్మికులకు 7,500 అదనంగా ఇస్తాం. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు రూ.5వేలు ఇస్తాం.

మీడియాపై ఆగ్రహం..
విపత్కర పరిస్థితుల్లో పిచ్చిరాతలు రాసే మీడియాపై కఠిన చర్యలు తీసుకుంటా. తప్పుడు వార్తలు రాసే వారికి కరోనా తగలాలని శాపం పెడుతున్నా. ఇప్పటికైనా మీ వైఖరి మార్చుకోవాలి.. ప్రభుత్వం దగ్గర ప్రతి రికార్డు ఉంటుంది. సమయం వచ్చినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం. లాక్‌డౌన్ కొనసాగించాలని ప్రధానికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఆర్ధిక వ్యవస్థను మెల్లగా బాగుచేసుకోగలం.. కానీ ప్రాణాలను తిరిగి తెచ్చుకోలేం’ అని అన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు