రోజు విడిచి రోజు స్కూలుకు..

11 May, 2020 04:41 IST|Sakshi

ఒకరోజు ప్రత్యక్ష బోధన.. మర్నాడు ఆన్‌లైన్, డిజిటల్‌ బోధన

వంతుల వారీగా విద్యార్థులు స్కూళ్లకు హాజరయ్యేలా కసరత్తు

లాక్‌డౌన్‌ తరువాత మారనున్న తరగతి గది స్వరూపం

కొత్త విధానం రూపకల్పనకు కసరత్తు చేస్తున్న ఎంహెచ్‌ఆర్‌డీ

వారం–పది రోజుల్లో నివేదిక అందజేయనున్న ఎన్‌సీఈఆర్‌టీ

సాక్షి, హైదరాబాద్‌: ఒక్కో స్కూలులో పదుల తరగతి గదులు.. ఒక్కో తరగతి గదిలో 50 – 60మంది పిల్లలు.. అందులోనూ ఒక్కో బెంచ్‌పై ముగ్గురు చొప్పున విద్యార్థులు.. పక్కపక్కనే ఆనుకొని కూర్చోవ డం.. ఇదీ ఇప్పటివరకు ఉన్న ‘తరగతి గది స్వరూపం’. కరోనా నేపథ్యంలో ఇది పూర్తిగా రూపుమారనుంది. ఒక్కో విద్యార్థికి వారంలో కొద్దిరోజులు ప్రత్యక్ష బోధన, మరికొన్ని రోజులు ఆన్‌ లైన్, డిజిటల్‌ బోధన (వీడియో పాఠాలు వినడం) దిశగా కేంద్ర మానవ వనరుల శాఖ కసరత్తు చేస్తోంది. స్కూల్‌కు హాజరయ్యే మొత్తం విద్యార్థుల సంఖ్యను సగానికి కుదించే అవకాశం ఉంది.

‘భౌతికదూరం’పై కసరత్తు: లాక్‌డౌన్‌ ఎత్తివేశాక కూడా ఏడా ది వరకు భౌతికదూరం పాటించాల్సిందేనని వైద్య నిపుణుల అంచనా. అందుకు అనుగుణంగా కేంద్ర మానవ వనరుల అభి వృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) కసరత్తు ప్రారంభించింది. లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే వేసవి సెలవుల తరువాత ప్రారంభమయ్యే పాఠశాల ల తరగతి గదుల్లో పాటించాల్సిన భౌతికదూరంపై సమగ్ర నివే దిక అందజేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌ సీఈఆర్‌టీ)ని ఆదేశించింది. ఇప్పటికే ఉన్నత విద్యలో కనీసం 25% ఆన్‌లైన్‌ బోధన చేపట్టేలా కార్యాచరణ రూపొందించుకో వాలని యూజీసీ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యలోనూ చేయాల్సిన మార్పులపై ఎన్‌సీటీఈఆర్‌టీ నివేది కను రూపొందించి ఎంహెచ్‌ఆర్‌డీకి అందజేయనుంది.

ఒకరోజు స్కూల్‌.. మరోరోజు ‘ఆన్‌లైన్‌’: మొదటి రోజు సగం మంది స్కూల్‌కు వస్తే.. రెండోరోజు ఆ విద్యార్థులు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్, డిజిటల్‌ పాఠాలు వింటారు. రెండోరోజు స్కూ ల్‌కు వచ్చిన మిగతా సగం మంది విద్యార్థులు మూడో రోజు ఆన్‌లైన్, డిజిటల్‌ పాఠాలు వింటారు. ఇక రెండో రోజు ఇంట్లో ఉండి పాఠాలు విన్న విద్యార్థులు మూడోరోజు మళ్లీ స్కూల్‌కు వస్తారు. ఇలా రోజు విడిచి రోజు ప్రత్యక్ష బోధన, ఆన్‌లైన్, డిజి టల్‌ బోధన చేపట్టేలా ఎన్‌సీఈఆర్‌టీ కసరత్తు చేస్తున్నట్లు తెలి సింది. తద్వారా రోజూ పాఠశాలకు వచ్చే విద్యార్థుల సంఖ్య స గానికి తగ్గుతుంది. తద్వారా భౌతికదూరం నిబంధన అమలు చేయడం వీలవుతుందని భావిస్తోంది. మరోవైపు మొత్తం విద్యా ర్థులకు రోజు విడిచి రోజు స్కూళ్లో బోధన నిర్వహించే అంశం పైనా యోచిస్తున్నట్లు తెలిసింది. ఒకరోజు స్కూల్‌కు వస్తే మరో రోజు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్, డిజిటల్‌ బోధన ద్వారా పాఠాలు వింటారు. ఈ విధానంలో భౌతికదూరం పాటించడం సమస్య కానుంది. అందుకే ఒకరోజు సగం మందికి ప్రత్యక్ష బోధన, మిగతా సగం మందికి ఆన్‌లైన్, డిజిటల్‌ బోధనవైపే మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది.

టీచర్లను సిద్ధంచేసే దిశగా రాష్ట్రం అడుగులు
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆన్‌లైన్, డిజిటల్‌ బోధన ప్రధాన సవాల్‌గా మారనుందని విద్యానిపుణుల అంచనా. అందుక నుగుణంగా ప్రభుత్వ టీచర్లను సిద్ధం చేయాలని కేంద్రం చెబుతోంది. రాష్ట్రంలోనూ ఆ దిశగా విద్యాశాఖ అడుగులు వేసింది. రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణమండలి (ఎస్‌సీఈఆర్‌టీ) ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌ బోధనలో టూల్స్‌ వినియోగంపై టీచర్లకు శిక్షణ ప్రారంభించింది. తద్వారా టీచర్లు ఆన్‌లైన్‌ బోధన చేపట్టేందుకు కూడా సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో గురుకులాలు మినహా ప్రభుత్వ, ఎయిడెడ్‌ స్కూళ్లు 27,432 ఉన్నాయి. వీటిలో 23,36,070 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారికి 1.24 లక్షల మంది టీచర్లు బోధన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయా విద్యార్థులకు శిక్షణ కొనసాగుతోంది. ఎన్‌సీఈఆర్‌టీ రూపొందిస్తున్న విధానం ప్రకారం రాష్ట్రంలో 11.68 లక్షల మంది వరకు రోజూ స్కూల్‌కు హాజరవుతారు. తద్వారా భౌతికదూరం పాటించడం కొంత సులభం కానుంది. రోజు విడిచి రోజు, ఆన్‌లైన్‌ – డిజిటల్‌ బోధనకు సంబంధించి ఎన్‌సీఈఆర్‌టీ రూపొందిస్తున్న సమగ్ర మార్గదర్శకాలను త్వరలోనే కేంద్రం ప్రకటించనుంది. 

>
మరిన్ని వార్తలు