నేరం రుజువైతే రెండేళ్లపాటు జైలు

13 Apr, 2020 11:48 IST|Sakshi
మొయినాబాద్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులు

1,270 వాహనాలు సీజ్‌.. త్వరలో కోర్టుకు అప్పగింత 

మూడు సెక్షన్ల కింద 185 మందిపై కేసులు నమోదు 

మాస్క్‌ ధరించకున్నా, బయట ఉమ్మినా ఊచల వెనక్కే 

సాక్షి, రంగారెడ్డి: కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్న వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఇళ్లకే పరిమితం కావాలనే ఆదేశాలను బేఖాతరు చేస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆకతాయిలు అవసరం లేకున్నా రోడ్డెక్కుతూ సరదాగా తిరుగుతూ పోలీసులకు చిక్కుతున్నారు. ఇలా లాక్‌డౌన్‌ అమలవుతున్న గతనెల 23 నుంచి ఈనెల 11వరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతం పరిధిలో పోలీసులు కొరడా ఝళిపిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు.

జిల్లావ్యాప్తంగా మొత్తం 18 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. విజయవాడ, బెంగళూరు, నాగార్జునసాగర్, శ్రీశైలం, బీజాపూర్‌ రహదారుల్లో పెద్దఎత్తున తనిఖీలు చేస్తున్నారు. రాజేంద్రనగర్, షాద్‌నగర్, శంషాబాద్, మణికొండలో రెండు చొప్పున, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్‌పల్లి, ఆమనగల్లు, కడ్తాల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, బొంగుళూరు, మహేశ్వరం, మాల్‌లో ఒకటి చొప్పున చెక్‌పోస్టులు ఉన్నాయి. అంతటా నిత్యం తనిఖీలు చేస్తూ.. అనవసరంగా రోడ్డెక్కిన వాహనాలను సీజ్‌ చేస్తూ వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు.  

1,270 వాహనాలు సీజ్‌.. 
గ్రామీణ ప్రాంతం పరిధిలో దాదాపు 23 ఠాణాలు ఉండగా.. దాదాపు 1,270 వాహనాలు సీజ్‌ అయ్యాయి. ఇందులో 70 శాతం మేర ద్విచక్ర వాహనాలే ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 13 శాతం త్రిచక్ర వాహనాలు, 17 శాతం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లు పేర్కొంటున్నాయి. ఈ వాహనాలను పోలీసులు లాక్‌డౌన్‌ పూర్తయ్యాక కోర్టులకు అప్పగించనున్నారు. కోర్టులు విధించే జరిమానా చెల్లించి యజమానులు తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది.

185 మందిపై కేసులు  
లాక్‌డౌన్‌ను పోలీసులు పకడ్బందీగా నిర్వహిస్తున్నా.. కొందరు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పరిమిత సమయానికి మించి విక్రయాలు జరపడం, మరికొందరు లాక్‌డౌన్‌ నిబంధనలను ఉల్లంఘించి వ్యాపారం నిర్వహించారు. అలాగే కూరగాయల మార్కెట్లు, ఇతర షాపులు, సూపర్‌ మార్కెట్ల వద్ద భౌతికదూరం పాటించడం లేదు. ఈమేరకు 185 మందిపై ఎపిడిమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌–1987, ఐపీసీ 188, జాతీయ విపత్తుల నియంత్రణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. వీరిపై నేరం రుజువైతే రెండేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. కొన్ని సందర్భాల్లో కోర్టులు జరిమానా కూడా విధించవచ్చు.  

ఉమ్మినా.. మాస్క్‌ లేకున్నా.. 
మహమ్మారి కోవిడ్‌ రోజురోజుకూ విస్తరిస్తున్న తరుణంలో నివారణ కోసం రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. మాస్క్‌లు లేకుండా ఎవరూ బయట తిరగొద్దని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయద్దు. ఈ అంశాలపై ప్రజల్లో పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడిప్పుడే ఆయా విభాగాలు వీటిపై చైతన్యం కలి్పస్తున్నాయి. మరోరెండు మూడు రోజులపాటు దీన్ని కొనసాగించనున్నారు. ఆ తర్వాత మాస్క్‌ లేకుండా బయట తిరిగినా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినా కేసులు నమోదు చేయకతప్పదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.  

ఇంట్లో ఉంటేనే క్షేమం 
లాక్‌డౌన్‌ నిబంధనలను ప్రతిఒక్కరూ కచి్చతంగా పాటించాలి. అత్యవసరమైతే తప్ప గడప దాటొద్దు. రోడ్డెక్కొద్దు. ఈ నిబంధనలను కచి్చతంగా పాటిస్తేనే వారి కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. తద్వారా సమాజం కూడా బాగుంటుంది. ప్రభుత్వం ఏం చేసినా.. ప్రజల మేలు కోసమే. దీనిని ప్రతి వ్యక్తి గుర్తించి సహకరించాలి. స్వీయ రక్షణ.. భౌతికదూరంతోనే కరోనా వైరస్‌ వ్యాప్తిని నివారించగలం. మాస్‌్కలు ధరించకుండా బయట తిరిగితే, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా కేసులు తప్పవు. మాస్క్‌లు పంపిణీ చేయడానికి కొన్ని ఎన్‌జీఓలను గుర్తిస్తున్నాం. ఆయా సంస్థల ద్వారా మాస్‌్కలు అందజేస్తాం. 
– ప్రకాశ్‌ రెడ్డి, శంషాబాద్‌ డీసీపీ  

మరిన్ని వార్తలు