నాడు సమ్మె.. నేడు లాక్‌డౌన్‌

13 Apr, 2020 12:44 IST|Sakshi
బస్సులు లేక వెలవెలబోతున్న నాగర్‌కర్నూల్‌ బస్టాండ్‌

కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీ 

రీజియన్‌లో రోజుకు రూ.95 లక్షల నుంచి రూ. కోటి వరకు నష్టం

డిపోల్లోనే బస్సులు.. ఇళ్లకే సిబ్బంది పరిమితం 

కందనూలు (నాగర్‌కర్నూల్‌): గతేడాది అక్టోబర్‌ 5 నుంచి నవంబర్‌ 25 వరకు 51 రోజుల పాటు ఆర్టీసీ సమ్మె.. కరోనాను కట్టడి చేసేందుకు గత నెల 23 నుంచి లాక్‌డౌన్‌ అమలుచేయటంతో బస్సుల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆర్టీసీ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఆదాయం రాకున్నా కార్మికులు, సిబ్బందికి మార్చి వేతనం చెల్లించింది. అద్దె బస్సులను నడిపే డ్రైవర్లకు మాత్రం బస్సులు నడవడం లేదనే సాకుతో ఆయా యాజమాన్యాలు వేతనాలు ఇవ్వలేదు. 

నిలిచిన బస్సులు.. 
మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలోని తొమ్మిది డిపోల్లో 880 బస్సులు ఉన్నాయి. డ్రైవర్లు, కండక్టర్లు తదితర సిబ్బంది మొత్తం 4,200 మంది పని చేస్తున్నారు. బస్సులు రోజు 3.50 లక్షల కిలోమీటర్లు తిరగగా, 10.8 లక్షల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేసివి. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రీజియన్‌ వ్యాప్తంగా రోజుకు రూ.95 లక్షల నుంచి రూ. 1.50 కోట్ల వరకు నష్టం వస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన 18 రోజుల్లో సుమారు రూ.19.80 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. 

అత్యవసర సేవలకు 6 బస్సులు.. 
రీజియన్‌ వ్యాప్తంగా అత్యవసర సేవల కోసం ఆరు బస్సులను అధికారులు నడుపుతున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రితో పాటు ఇతర ముఖ్యమైన ఆస్పత్రులకు వైద్యసిబ్బందిని తరలించేందుకు వీటిని వినియోగిస్తున్నారు. 

వెలవెలబోతున్న బస్టాండ్లు.. 
నిత్యం ప్రయాణికులు, బస్సులతో రద్దీగా ఉండే ఉ మ్మడి జిల్లాలోని బస్టాండ్‌లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. 
దినసరి కూలీల పరిస్థితి దుర్భరం.. 
ప్రజా రవాణా నిలిచిపోవటంతో వీటినే నమ్ముకొని జీవిస్తున్న దినసరి కూలీలు, చిరు వ్యాపారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉపాధి దొరకక ప్రభుత్వాలు అందించే సాయం కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీల ప్రతినిధులు నిత్యావసర సరుకులు ఉచితంగా అందిస్తుండటం తాత్కలిక ఊరటనిస్తోంది.

లాక్‌డౌన్‌ ఎత్తేస్తేనే.. 
గతేడాది సుదీర్ఘ సమ్మె.. తర్వాత లాక్‌డౌన్‌ ఆరీ్టసీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఇప్పటికే రూ.కోట్ల నష్టాల్లో ఉంది. లాక్‌డౌన్‌తో పరిస్థితి మరింత దిగజారింది. లాక్‌డౌన్‌ ఎత్తేస్తేనే కొంతైన కోలుకునే అవకాశం ఉంది. 
– సూర్యనారాయణ, డివిజనల్‌ మేనేజర్, నాగర్‌కర్నూల్‌ 


 బస్సులు లేక వెలవెలబోతున్న నాగర్‌కర్నూల్‌ బస్టాండ్‌ 

>
మరిన్ని వార్తలు