కాంగ్రెస్‌ లెక్క తేలాకే!

14 Mar, 2019 02:49 IST|Sakshi

అభ్యర్థుల ఖరారుపై టీఆర్‌ఎస్‌ వ్యూహం

సిట్టింగ్‌ ఎంపీలతో రేపు,ఎల్లుండి కేసీఆర్‌ భేటీ?

అనివార్యమైతేకొన్ని స్థానాల్లో మార్పులు

ఇప్పటికే ఏడు స్థానాల్లోఅభ్యర్థులు ఖరారు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ ఎన్నికల వ్యూహం సిద్ధమైంది. టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు తనకు బాగా కలిసొచ్చిన కరీంనగర్‌ నుంచి లోక్‌సభ ప్రచారాన్ని ఈ నెల 17న ప్రారంభించాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్‌తోపాటు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈ నెల 18న మొదలవనుండటంతో ఆలోగా ఎంపీ అభ్యర్థులను ప్రకటించనున్నారు. ‘అభ్యర్థుల ప్రకటన విషయంలో తొందరలేదు. సిట్టింగ్‌ ఎంపీలతో ఈ నెల 15, 16 తేదీల్లో కేసీఆర్‌ భేటీ అయ్యే అవకాశం ఉంది.

ఆ తర్వాతే అభ్యర్థులను ప్రకటిస్తారు’అని టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు తెలిపారు. ప్రత్యర్థి పార్టీల బలాబలాలు, అభ్యర్థుల ఎంపికపై స్పష్టత వచ్చాకే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ప్రస్తుత సమాచారం ప్రకారం ఎక్కువ స్థానాల్లో సిట్టింగ్‌ ఎంపీలకే మళ్లీ అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధినేత భావిస్తున్నారు. అనివార్యమైతేనే కొన్ని స్థానాల్లో కొత్త వారిని బరిలో దించే ఉద్దేశంతో ఉన్నారు. మార్పులు జరిగితే గరిష్టంగా 3, 4 స్థానాల్లోనే కొత్త వారికి అవకాశం ఉంటుందని టీఆర్‌ఎస్‌ ముఖ్యులు చెబుతున్నారు. 

లోక్‌సభ నియోజకవర్గాలవారీగా రేసులో ఉన్న నేతలు... 
ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, భువనగిరి, వరంగల్‌ లోక్‌సభ స్థానాల్లో సిట్టింగ్‌ ఎంపీలకు అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. గోడం నగేశ్, బోయినపల్లి వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత, బి.బి. పాటిల్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, పసునూరి దయాకర్‌లు మరోసారి టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో ఉండనున్నారు. 

►నల్లగొండ సిట్టింగ్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డికి మరోసారి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధినేత భావిస్తున్నారు. అయితే సుఖేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరే సమయంలో ఆయనకు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలోనే ఏదైనా కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నల్లగొండ నుంచి తేరా చిన్నపరెడ్డి, వి.నర్సింహారెడ్డి పేర్లను పరిశీలిస్తున్నారు. 

►మహబూబ్‌నగర్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో సిట్టింగ్‌ ఎంపీ ఎ.పి. జితేందర్‌రెడ్డికి మరో సారి అభ్యర్థిత్వం ఖరారుపై కేసీఆర్‌ ఇంకా స్పష్టత ఇవ్వలేదని తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేశారని జితేందర్‌రెడ్డిపై పలువురు ఎమ్మెల్యేలు అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో అక్కడ కొత్త వారికి అవకాశం ఇవ్వా లని కేసీఆర్‌ భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జితేందర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వకపోతే మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, పారిశ్రామికవేత్త మన్నె శ్రీనివాస్‌రెడ్డిలలో ఒకరిని అభ్యర్థిగా నిలిపే అవకాశం ఉందని తెలుస్తోంది.
 
►మహబూబాబాద్‌ సెగ్మెంట్‌ అభ్యర్థిపై టీఆర్‌ఎస్‌ అధినేత ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని ముఖ్యనేతలు చెబుతున్నారు. సిట్టింగ్‌ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్‌ టికెట్‌పై ధీమాతో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు మాలోతు కవిత ఈ స్థానంలో టికెట్‌ కోసం ప్రయత్నిస్తున్నారు. 

►పెద్దపల్లి సెగ్మెంట్‌లో అభ్యర్థి విషయంలో కేసీఆర్‌ తుది నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన జి. వివేకానంద తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఆయనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే వివేకానంద అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేశారని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. లోక్‌సభ సెగ్మెంట్‌లోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు ఆయన అభ్యర్థిత్వంపై వ్యతిరేకంగా ఉన్నారని టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. దీంతో ఈ సెగ్మెంట్‌లో అభ్యర్థిపై టీఆర్‌ఎస్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. 

►చేవేళ్ల లోక్‌సభ అభ్యర్థిపై సీఎం కేసీఆర్‌ ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. మారిన సమీకరణలతో కొత్త పేర్లను ఆయన పరిశీలిస్తున్న ట్లు తెలుస్తోంది. పారిశ్రామికవేత్త జి.రంజిత్‌రెడ్డిని బరిలో దింపేందుకు సీఎం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే మాజీ మంత్రి పి.సబితారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరుతుండటంతో ఆమె కుమారుడు కార్తీక్‌రెడ్డి పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  

►మల్కాజిగిరి లోక్‌సభ సెగ్మెంట్‌లో ఈసారి కచ్చితంగా విజయం సాధించాలని టీఆర్‌ఎస్‌ లక్ష్యంగా పెట్టుకుంది. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన నేపథ్యంలో ఈసారి అభ్యర్థి ఎంపిక సికింద్రాబాద్‌ సెగ్మెంట్‌లో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ అధినేత భావిస్తున్నారు. తలసాని సాయికిరణ్‌ యాదవ్, బొంతు శ్రీదేవి యాదవ్‌ పేర్లను పరిశీలిస్తున్నారు. చేవెళ్లలో కార్తీక్‌రెడ్డికి అవకాశం ఇస్తే సికింద్రాబాద్‌లో రంజిత్‌రెడ్డిని బరిలో దింపే అవకాశం ఉంది. 

►నాగర్‌కర్నూల్‌లో గెలుపు లక్ష్యంగా అభ్యర్థిని ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తున్నారు. మాజీ మంత్రి పి.రాములు, టీఆర్‌ఎస్‌ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు సాయిచంద్‌లలో ఒకరికి టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది.

►ఖమ్మం లోక్‌సభ అభ్యర్థి విషయంలో సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారుపైనా కేసీఆర్‌ ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్ల గెలుపు లక్ష్యానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఫలితాలతోనే గండిపడింది. టీఆర్‌ఎస్‌ అసెంబ్లీ అభ్యర్థులు ఎక్కువ మంది పొంగులేటిపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అభ్యర్థి మార్పు ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సీటుకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌ పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది.

>
మరిన్ని వార్తలు