అభ్యర్థి కావలెను!

4 Feb, 2019 11:37 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌: పార్లమెంట్‌ ఎన్నికలకు కాంగ్రెస్‌ సన్నద్ధమవుతోంది. నిజామాబాద్‌ ఎంపీ అభ్యర్థి కోసం ఆ పార్టీ అన్వేషణ ప్రారంభించింది. గతంలో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ తరఫున మూడుసార్లు పోటీ చేసిన మాజీ ఎంపీ మధుయాష్కి ఈసారి భువనగిరి నుంచి బరిలోకి దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో నిజామాబాద్‌లో ఎవరిని పోటీకి దింపాలనే దానిపై ఆ పార్టీ దృష్టి సారించింది. టీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ కవితను «ఢీకొనే సత్తా ఉన్న నేతల కోసం అధిష్టానం అన్వేషణలో పడిందని కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా పలువురు సీనియర్‌ నేతలతో పాటు కొత్త నేతల పేర్లు కూడా పార్టీ అధిష్టానం పరిశీలనలోకి వచ్చాయి.

మాజీ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డిని బరిలో దించాలనే ప్రతిపాదన వచ్చింది. జిల్లా మీద పూర్తి స్థాయిలో పట్టుండటం, అలాగే కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులతో సన్నిహిత సంబంధాలుండటం వంటి అంశాలను పరిశీలనకు వచ్చిందని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు. మరోవైపు కొత్త ముఖాలు కూడా తెరపైకి వచ్చాయి. బీజేపీ పార్లమెంట్‌ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్న ధర్మపురి అర్వింద్‌కు గాలం వేసే ప్రయత్నాలు జరిగాయి. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డితో పాటు టీపీసీసీ ముఖ్య నేతలు అర్వింద్‌తో సంప్రదింపులు జరపడం కాంగ్రెస్‌తో పాటు ఇటు బీజేపీలోనూ చర్చనీయాంశంగా మారిన విషయం విదితమే. అయితే, కాంగ్రెస్‌ నుంచి పోటీకి అర్వింద్‌ విముఖత వ్యక్తం చేసినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు.

తాజాగా మరికొన్ని కొత్త పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. మాజీ ఎంపీ, దివంగత కేశ్‌పల్లి గంగారెడ్డి మనుమరాలు కావ్యరెడ్డిని బరిలోకి దించితే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా కాంగ్రెస్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేశ్‌పల్లి గడ్డం ఆనంద్‌రెడ్డి కుమార్తె కావ్యరెడ్డి. ఇటీవల ఆనంద్‌రెడ్డి బీజేపీకి రాజీనామా చేసిన విషయం విదితమే. ఇప్పటికీ ఆయన ఏ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించలేదు. త్వరలో ఆయన తన కూతురు కావ్యరెడ్డితో కలిసి కాంగ్రెస్‌ కండువా వేసుకోనున్నారు.

ముందుగానే అభ్యర్థిత్వాలు.. 
అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా నోటిఫికేషన్‌ వచ్చే వరకు అభ్యర్థిత్వాలను తేల్చకుండా తాత్సారం చేసిన కాంగ్రెస్‌ పార్టీ.. పార్లమెంట్‌ ఎన్నికల వేళ మాత్రం రెండు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించే యోచనలో ఉంది. పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధి విస్తీర్ణంగా ఉంటుంది. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టి ప్రచారం నిర్వహించాలంటే బాగా సమయం అవసరం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల వేళ అభ్యర్థులను ఆలస్యంగా ప్రకటించడం అభ్యర్థుల ఓటమికి కారణమని భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ.. పార్లమెంట్‌ అభ్యర్థులను త్వరగా తేల్చే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఖరారుపై పూర్తి స్థాయిలో కసరత్తు చేపడుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అంటీ ముట్టనట్లుగా మధుయాష్కి.. 
గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన మధుయాష్కి నియోజకవర్గానికి అంటీ ముట్టనట్లు ఉన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన జిల్లాకు చుట్టపు చూపుగానే వచ్చి వెళ్లారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థులకు, మధుయాష్కితో సన్నిహిత సంబంధాలు లేకపోవడంతో ఈసారి ఆయన నియోజకవర్గం మారుతారనే ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం అన్వేషణ చర్చనీయాంశంగా మారుతోంది.

మరిన్ని వార్తలు