కాళేశ్వరం.. బ్రహ్మాస్త్రం!

21 Mar, 2019 00:54 IST|Sakshi

ఈ ప్రాజెక్టుతో మేలు జరిగే 13 ఎంపీ స్థానాలపై టీఆర్‌ఎస్‌ ప్రత్యేక దృష్టి

ఇప్పటి ప్రణాళికతోనే.. 10 పార్లమెంట్‌ స్థానాల్లో ప్రభావం

మరో రెండు కొత్త ప్రణాళికలకు సీఎం కేసీఆర్‌ ప్రతిపాదన

ఉద్దండాపూర్, ఉస్మాన్‌సాగర్‌ నింపే ప్రణాళిక రూపకల్పనకు ఆదేశం

అదే జరిగితే మరో 3 ఎంపీ నియోజకవర్గాలపైనా ప్రభావం

హైదరాబాద్‌ మినహా 13 చోట్ల ఇదే టీఆర్‌ఎస్‌ ప్రచారాస్త్రం

జూలై, ఆగస్టులోనే మెజార్టీ ఎంపీ నియోజకవర్గాలకు గోదావరి నీళ్లు

నిజామాబాద్, కరీంనగర్‌ సభల్లోనూ

కాళేశ్వరాన్నే ప్రధానంగా ప్రస్తావించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్ : కారు.. సారు.. పదహారు.. తద్వారా ఢిల్లీలో సర్కారు లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికల బరిలో దూకింది. ఎట్టిపరిస్థితుల్లోనూ 16 సీట్లను గెలిచే లక్ష్యంతో వివిధ వ్యూహాలను అమలు చేస్తున్న టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు తన అమ్ములపొదిలోంచి బ్రహ్మాస్త్రాన్ని తీసింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని ప్రధానాస్త్రంగా మలుచుకొని ప్రతిపక్షాలను కోలుకోకుండా చేసే ఎత్తుగడ వేస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు అస్త్రంతో 13 పార్లమెంట్‌ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించింది. యుద్ధప్రాతిపదికన ప్రాజెక్టు పనులను పూర్తిచేసి.. ఈ ఏడాది ఖరీఫ్‌ నాటికి ఉత్తర తెలంగాణ పార్లమెంట్‌ స్థానాల్లో.. నీటి లభ్యత లేని గరిçష్ట ఆయకట్టుకు గోదావరి నీటిని మళ్లించి బీడువారిన భూముల్లో సిరులు కురిపిస్తామని, దక్షిణ తెలంగాణ పార్లమెంట్‌ స్థానాల్లో.. కృష్ణా పరీవాహకానికి కాళేశ్వరం ద్వారా గోదావరి నీటిని తెస్తామని ప్రచారం చేసే వ్యూహాలకు పదును పెట్టింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాజెక్టుపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌ పార్టీ, ఈ ఎన్నికల్లో అధికార పార్టీ కాళేశ్వరం అస్త్రాన్ని ఎదుర్కొనే అంశంపై కసరత్తులు మొదలుపెట్టింది.

అసెంబ్లీ పోరులోనూ ఈ అస్త్రమే!
డిసెంబర్‌లో జరిగిన ముందుస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పక్షాలైన కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ పార్టీల మధ్య కాళేశ్వరం ప్రాజెక్టు అంశం కాక పుట్టించింది. ఈ ప్రాజెక్టుపై ఇరు పార్టీల మధ్య తీవ్రమైన వాగ్యుద్ధం జరిగింది. ప్రాజెక్టులను పూర్తి చేయడంలో వైఫల్యం మీదంటే మీదేనంటూ పరస్పరం కత్తులు దూసుకున్నాయి. కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌గాంధీ సైతం కమీషన్ల కోసం కాళేశ్వరం నిర్మాణ వ్యయాన్ని లక్ష కోట్లకు పెంచారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రతిపాదించిన ప్రాజెక్టుకే పేరుమార్చి రీ–డిజైన్‌ చేశారని దుయ్యబట్టారు. దీన్ని తిప్పికొట్టిన టీఆర్‌ఎస్‌.. 60ఏళ్లుగా ఆవేదన పడుతున్న ప్రజల కన్నీళ్లను తుడిచేందుకు అనివార్యమైన మార్పులు చేశామని ప్రచారం చేసింది. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్‌ చేతులు కలపడాన్ని ప్రశ్నించడం ద్వారా..

కాంగ్రెస్‌ను కార్నర్‌ చేసింది. ఉమ్మడిరాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.17,875 కోట్ల అంచనా వ్యయంతో 2007లో అంబేడ్కర్‌ ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకానికి అనుమతించగా, ఆ తర్వాత ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు లేకుండానే 2008లో రూ.38,500 కోట్లుగా ఉన్న అంచనా వ్యయాన్ని 2010లో రూ.40,300 కోట్లకు పెంచారని పేర్కొంటూ.. అప్పటి రాష్ట్ర మంత్రి, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వాటికి సంబంధించిన జీవోలను ప్రజలముందుంచారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రాష్ట్రప్రభుత్వం జాతీయహోదా అడగనేలేదని కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ పేర్కొంటే.. జాతీయహోదాపై కేంద్రానికి రాసిన లేఖను çఅప్పటి రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు చూపారు. ఈ ప్రచారంలో అధికార టీఆర్‌ఎస్‌ దూసుకుపోవడంతో ఏకంగా ఉత్తర తెలంగాణలోని 10 పార్లమెంట్‌ల పరిధిలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంథని, మనుగోడు, నకిరేకల్, హుజూర్‌నగర్, సంగారెడ్డి, ఎల్లారెడ్డి, ఆసిఫాబాద్, భూపాలపల్లి, ఎల్బీనగర్‌ మినహా అన్ని స్థానాల్లో విజయదుందుభి మోగించింది.
 
అదే అస్త్రానికి ‘నీటి’తొడుగు!
అసెంబ్లీ ఎన్నికల్లో ఫలించిన ‘కాళేశ్వరం’వ్యూహాన్నే.. మళ్లీ పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ అధికార టీఆర్‌ఎస్‌ ప్రయోగిస్తోంది. అయితే.. ఈ అస్త్రానికి కొత్తగా మెరుగులు దిద్ది.. ఈ ఖరీఫ్‌ నుంచే నీటిని అందిస్తామని, ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేస్తామన్న నినాదంతో ముందుకెళ్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 13 జిల్లాల్లోని 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు, మరో 18.82 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం మేడిగడ్డ బ్యారేజీ నుంచి 195 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోసేందుకు ప్రణాళిక ఉంది. ఇందులో మేడిగడ్డ పనులు చివరిదశలో ఉండగా, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు పూర్తయ్యాయి. మేడిగడ్డ పంప్‌హౌస్‌లో 11 మోటార్లకు 5, అన్నారంలో 8 మోటార్లకు 3, సుందిళ్లలో 9 మోటార్లలో 4మోటార్లను సిద్ధం చేశారు. ఎల్లంపల్లి దిగువన కొండపోచమ్మసాగర్‌ వరకు అన్ని ప్యాకేజీల పనులను వేగవంతం చేసి 90 నుంచి 100 టీఎంసీల నీటిని తరలించడం ద్వారా 8 నుంచి 9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరిచ్చేలా పనులు జరుగుతున్నాయి.

దీంతో పాటే ఎస్సారెస్పీకి పునరుజ్జీవ పథకంతో 60 టీఎంసీల నీటినైనా ఎత్తిపోసేలా పనులు చేయిస్తోంది. పనులు జరుగుతున్న తీరు, జూలై/ఆగస్టు నాటికి వచ్చే ఫలితాలను వివరిస్తూ.. టీఆర్‌ఎస్‌ ప్రచారంలో ముందుకు పోతోంది. పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, భువనగిరి, నల్లగొండ, మెదక్, జహీరాబాద్, మల్కాజ్‌గిరి, ఆదిలాబాద్, నిజామాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల పరిధిలోని 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాళేశ్వరం ద్వారా కొత్తగా ఆయకట్టు సాగులోకి రానుండటంతో ఆయా స్థానాల్లో కాళేశ్వరమే ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్‌ బహిరంగసభల్లో కేసీఆర్‌ ఈ అస్త్రాన్నే ప్రధానంగా ప్రస్తావించి అభ్యర్థుల గెలుపునకు ఓట్లడిగారు. మిగతా నియోజకవర్గాల్లోనూ ఇదే నినాదంతో ముందుకు పోయేలా వ్యూహాలు సిద్ధం చేశారు.
 
కొత్త ప్రతిపాదనతో మరో ‘మూడు’
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మహానగర తాగునీటి ఇక్కట్లకు శాశ్వతంగా ఫుల్‌స్టాప్‌ పెట్టేలా కొత్త ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. హైదరాబాద్‌ తాగునీటికి ఎలాంటి కొరత ఏర్పడకుండా చూసేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఉస్మాన్‌సాగర్‌ రిజర్వాయర్‌కు, అటు నుంచి హిమాయత్‌సాగర్‌ రిజర్వాయర్‌కు తరలించాలని ఇటీవలే సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించారు. కొండపోచమ్మసాగర్‌ నుంచి సింగూరుకు నీటిని తరలించే సంగారెడ్డి కాల్వ నుంచి ఉస్మాన్‌సాగర్‌కు నీటిని తరలించాలని సూచించారు. ఉస్మాన్‌సాగర్‌కు తరలించే నీటి మిగులు ఆధారంగా హిమాయత్‌సాగర్‌కు నీటిని మళ్లించాలని.. దీనిద్వారా రెండు రిజర్వాయర్లు నిత్యం నీటితో కళకళలాడుతాయన్నది సీఎం ప్రణాళిక. ఇది అమల్లోకి వస్తే హైదరాబాద్, సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ స్థానాల్లోని అన్ని నియోజకవర్గాలకు తాగునీటి వసతి కల్పించినట్లవుతుంది. ప్రస్తుతం ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో ఏడుగురు మజ్లిస్, బీజేపీ, కాంగ్రెస్‌ నుంచి ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు. మిగతా వారంతా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే. ఇక్కడ హైదరాబాద్‌ మినహాయిస్తే, సికింద్రాబాద్‌లో టీఆర్‌ఎస్‌కు ఇది ప్రచారాస్త్రమే.

దీనికి తోడు కాళేశ్వరం నుంచే గోదావరి నీటిని కృష్ణాకు తరలించే మరోకొత్త ప్రతిపాదనకు నాంది పలికింది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా తరలిస్తున్న గోదావరి నీటిని మరో ఎత్తిపోతల పథకం పాలమూరు–రంగారెడ్డితో అనుసంధానించే ప్రణాళిక సిద్ధమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న బస్వాపూర్‌ రిజర్వాయర్‌ వరకు నీటిని తరలిస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడి చేరుతున్న నీటిని పాలమూరులో భాగంగా జడ్చర్ల వద్ద నిర్మిస్తున్న ఉద్దండాపూర్‌ రిజర్వాయర్‌కు తరలించేలా ప్రాథమిక ప్రణాళిక సిద్ధం చేశారు. బస్వాపూర్‌ రిజర్వాయర్‌ నుంచి రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం చెరువుకు, అటునుంచి ఉద్దండాపూర్‌ రిజర్వాయర్‌కు 21 టీఎంసీల నీటిని తరలించేలా ప్లాన్‌ సిద్ధమవుతోంది. ఈ ప్రతిపాదన ద్వారా చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని మహేశ్వరం, ఇబ్రహీంపట్నంలకు నీరందుతుంది. ఉద్దండాపూర్‌కు నీటిని తరలించడం ద్వారా మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని షాద్‌నగర్, జడ్చర్ల ప్రాంతాలకు నీరందుతుంది. మొత్తంగా కొత్త ప్రతిపాదనలతో 4 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు నీరందనుండగా, ఇందులో హైదరాబాద్‌ను మజ్లిస్‌కు మినహాయిస్తే, మిగతా మూడు పార్లమెంట్‌ స్థానాల్లో కాళేశ్వరం ప్రాజెక్టును టీఆర్‌ఎస్‌ ప్రధానాస్త్రంగా మలుచుకునే అవకాశం ఉంది. మొత్తంగా రాష్ట్రంలోని 13 పార్లమెంట్‌ స్థానాల్లో విజయంకోసం కాళేశ్వరమే అధికార పార్టీ ప్రయోగించే బ్రహ్మాస్త్రం కానుంది.

జిల్లాలవారిగా కొత్తగా వృద్ధిలోకి వచ్చే ఆయకట్టు
జిల్లా          ఆయకట్టు (ఎకరాల్లో)
జగిత్యాల    19,979
పెద్దపల్లి      30,000
కరీంనగర్‌    800
మేడ్చల్‌      22,882
యాదాద్రి      2,56,063
నల్లగొండ      29,169
నిర్మల్‌        1,00,000
నిజామాబాద్‌    1,82,749
సిరిసిల్ల         1,53,539
సిద్దిపేట        3,32,541
కామారెడ్డి      1,84,862
మెదక్‌         2,45,241
సంగారెడ్డి      2,67,874 

మరిన్ని వార్తలు