పోలింగ్‌ను బహిష్కరించిన చెక్కి క్యాంప్‌ 

12 Apr, 2019 14:42 IST|Sakshi
చెక్కి క్యాంప్‌లో ఉదయం ఓటింగ్‌ను బహిష్కరించిన గ్రామస్తులు

మున్సిపాలిటీలో విలీనమే కారణం 

ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన 

వెలవెలబోయిన పోలింగ్‌ కేంద్రం 

సాయంత్రం 6 గంటల తర్వాత ఓటింగ్‌ 

బోధన్‌రూరల్‌(బోధన్‌): మండలంలోని చెక్కి క్యాంప్‌ గ్రామాన్ని బోధన్‌ మున్సిపాలిటీలో వీలినం చేయడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలింగ్‌ను బహిష్కరించారు. గురువారం మండలంలోని చెక్కి క్యాంప్‌ గ్రామంలో అధికారులు తెలిపిన ప్రకారం 556 మంది ఓటర్లు ఉండగా పోలింగ్‌ కేంద్రం నెంబర్‌ 45లో ఉదయం 8గంటలకు ఓటింగ్‌ ప్రారంభమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కేవలం 20మందే ఓటు వేశారు. మిగిలిన ఓటర్లు తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయవద్దని ఓటింగ్‌లో పాల్గొనకుండా నిరసన తెలిపారు.

సాయంత్రం 6గంటల వరకు ఓటింగ్‌ పాల్గొనకుండా భీస్మించారు. గ్రామస్తులు మాట్లాడుతూ తమ గ్రామంలో అధిక శాతం ప్రజలు ఉపాధిహామీ పనుల మీద ఆధారపడ్డారన్నారు. గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయడం ద్వారా ఉపాధి కోల్పోవడంతో పాటు పన్నుల భారంతో ఇబ్బందులు పడతామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను అధికారులు, ప్రభుత్వం గుర్తించి గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయకుండా కొత్త జీపీగా ఏర్పాటు చేయాలని కోరారు.

తమకు కచ్చితమైన హామీ లభించేవరకు పోలింగ్‌లో పాల్గొనేది లేదన్నారు. దీంతో సాయంత్రం వరకు పోలింగ్‌ కేంద్రానికి ఓటర్లు రాక వెలవెలబోయింది.  అనంతరం సాయంత్రం సమయంలో గ్రామస్తులందరు పునారోచన చేసి సమస్య సాధనకు కార్యాచరణ రూపొందించుకుని కలసికట్టుగా పోరాటం చేద్దామని నిర్ణయించుకుని తిరిగి సాయంత్రం 6నుంచి8గంటలవరకు ఓటింగ్‌లో పాల్గొన్నారు.మొత్తం68.52శాతం ఓటింగ్‌ నమోదైనట్లు పీవో తెలిపారు. అధికారులు పోలింగ్‌ సమయం పెంచి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు.   

మరిన్ని వార్తలు