ఒక్కరోజు లీవ్‌ పెడితే.. 4 రోజులు సెలవులు

2 Apr, 2019 01:27 IST|Sakshi

11న పోలింగ్‌.. 12వ తేదీ దాటితే 13, 14 తేదీలు సెలవులే  

ఓటేయకుండా జనం టూర్లకు వెళ్తారేమోనని అభ్యర్థుల ఆందోళన

అసెంబ్లీ ఎన్నికలప్పుడు పోలింగ్‌ తగ్గడానికి సెలవులూ ఓ కారణమే

ఓటేసి టూర్లకు వెళ్లాలంటూ ప్రచారం చేస్తున్న వివిధ పార్టీల అభ్యర్థులు

సాక్షి, హైదరాబాద్‌: ‘పోలింగ్‌ రోజు ప్రభుత్వం ప్రత్యేకంగా సెలవు ఇస్తోంది... కుటుంబ సమేతంగా టూర్‌కు వెళ్లమని కాదు, దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే అత్యంత పవిత్రమైన ఓటు హక్కును వినియోగించుకోమని’ ఓ సామాజిక కార్యకర్త చెప్పే డైలాగ్‌ ఇది.  పోలింగ్‌ రోజు ప్రభుత్వం కల్పించిన సెలవును కుటుంబంతో కలసి ఊరెళ్లడానికి వినియోగించుకునేందుకు సిద్ధమైన వ్యక్తిని ఉద్దేశించి ఇలా అంటాడు. సామాజిక మాధ్యమాల్లో, సినిమా థియేటర్‌ న్యూస్‌రీల్‌గా ఇది ప్రసారమైందే. మరి పోలింగ్‌ రోజే కాకుండా అదనంగా మరో రెండు సెలవులు కలసి వస్తే పరిస్థితి ఏంటి? పార్లమెంట్‌ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్న విషయమిది. ఈ నెల 11(గురువారం)న పోలింగ్‌ జరగనుంది. శుక్రవారం పని దినం, తరువాత 2 రోజులు.. అంటే రెండో శనివారం, ఆదివారం సెలవులు. చాలా మంది ఉద్యోగులకు శుక్రవారం కార్యాలయాలకు సెలవు పెడితే నాలుగు రోజులు సెలవు దినాలు కలిసి వస్తాయి. అసలే ఎండలు మండుతుండటంతో ఈ నాలుగు రోజుల సెలవుల్లో ఊటీకో, కొడైకెనాల్‌కో వేసవి ట్రిప్‌కు వెళ్తారనేది అభ్యర్థుల అందోళన.

డిసెంబర్‌లో ఇదే జరిగింది...  
శాసనసభ ఎన్నికలప్పుడు ఇదే జరిగింది. డిసెంబర్‌ 7న పోలింగ్‌  జరిగింది. ఆ రోజు శుక్రవారం. తదుపరి రెండు రోజులు రెండో శనివారం, ఆదివారం సెలవులు వచ్చాయి. దీంతో 3 రోజుల సెలవులను జాలీ డేస్‌గా వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 73.20 శాతం పోలింగ్‌ నమోదు కాగా, హైదరాబాద్‌లో 50 శాతం కూడా నమోదు కాలేదు. ఉద్యోగుల్లో చాలా మంది టూర్లకు వెళ్లడమే పోలింగ్‌ తక్కువగా నమోదు కావటానికి కారణమని రాజకీయ పార్టీలు గుర్తించాయి. నగరంలో 40 శాతానికి పైగా జనం వేరే ప్రాంతాలకు చెందినవారే. ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాల కోసం వీరు నగరంలో ఉంటున్నారు. వారి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు సొంత ప్రాంతాల్లో ఉంటున్నారు. వరుస సెలవులు వస్తే వీరు ఊళ్లకు వెళ్లడం సహజం. అసెంబ్లీ ఎన్నికలప్పుడు చాలా మంది సొంతూళ్లకు, కుటుంబాలతో విహారాలకు వెళ్లటం పోలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఈసారి అలా వరుస సెలవులు రాకున్నా, మధ్యలో ఒక్కటే పనిదినం ఉండటంతో చాలామంది ఆ రోజు సెలవు పెట్టి రెండో శనివారం, ఆదివారంతో కలిసి వచ్చేలా చూసుకుంటున్నారు. ఈసారి కూడా పోలింగ్‌పై ప్రభావం పడుతుందోమోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రచారంలో ఈ అంశాన్ని కూడా ఉటంకిస్తూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. 11న ఓటు హక్కును వినియోగించుకున్నాక ఊళ్లకు వెళ్లాలని, ఓటు వేయకుండా వెళ్లొద్దంటూ వేడుకుంటున్నారు.  

మీ సెలవు పాకిస్థాన్‌కు వరం...
ఇవి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలు కాదని, కేంద్ర ప్రభుత్వంపై ప్రభావం చూపే ఎన్నికలన్న విషయాన్ని జనం గుర్తుపెట్టుకోవాలంటూ బీజేపీ నేతలు ప్రచారంలో పేర్కొంటున్నారు. ‘నాలుగు రోజుల వరుస సెలవును ఎంజాయ్‌ చేసేందుకు మీరు టూర్లకు వెళ్తే పాకిస్థాన్‌కు వరంగా మారుతుంది. మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని కావాలంటే ప్రతి ఒక్కరూ బీజేపీకి ఓటేయాలి. లేకుండా పాకిస్థాన్‌కు బలం వచ్చినట్టే’అంటూ పేర్కొంటున్నారు. ఓటేయకుండా నిర్లక్ష్యం చేయొద్దంటూ పదే పదే పేర్కొంటుండటం విశేషం. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ మంది మనోభీష్టం నెరవేరిందని, ఎక్కువ మంది ఓటు ద్వారా అభిప్రాయం వెళ్లడించి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని, నాటి నిర్లక్ష్యం ఇప్పుడు వద్దంటూ రాహుల్‌ను ప్రధాని చేసేలా ముందుకు కదలాలంటూ పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు