చేవెళ్ల పార్లమెంట్‌ సీటుపై హేమాహేమీల గురి

2 Mar, 2019 08:07 IST|Sakshi
మహేందర్‌రెడ్డి, కిషన్‌రెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి

చేవెళ్ల పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలోకి దిగే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరనేది దాదాపుగా ఖరారైంది. టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ తరఫున కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి పోటీ చేసేందుకు మార్గం సుగమమైంది. ఇక అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంపై అన్ని పార్టీలు గురిపెట్టాయి. ఈ స్థానం నుంచి పోటీచేసేందుకు అర్థబలం, అంగబలం ఉన్న అభ్యర్థుల ఎంపికను దాదాపుగా పూర్తిచేశాయి. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్, విపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో హేమాహేమీలు ఈసారి బరిలోకి దిగనుండడంతో పోటీ రసవత్తరంగా మారనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంత సమ్మిళితమైన ఈ గడ్డపై పాగా వేసేందుకు ఆయా పార్టీలు రంగం సిద్ధంచేసుకుంటున్నాయి. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను దాదాపుగా ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇక అధికార ప్రకటనే తరువాయి.

‘పట్నా’నికి లైన్‌ క్లియర్‌ 
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పట్నం మహేందర్‌రెడ్డికి లైన్‌ క్లియర్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ స్థానానికి శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ సైతం పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఆయనకు మల్కాజిగిరి టికెట్‌ ఇచ్చేందుకు పార్టీ సుముఖంగా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానం నుంచి పోటీ చేయాలని స్వామిగౌడ్‌కు ఇప్పటికే సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. చేవెళ్ల మీద ఆశలు పెట్టుకున్నప్పటికీ.. పార్టీ ఆదేశాల మేరకు ఎక్కడి నుంచైనా పోటీచేస్తానని స్వామిగౌడ్‌ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలకుతోడు టికెట్‌పై మహేందర్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ భరోసా ఇచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పట్నంకు టికెట్‌ దాదాపు ఖరారైందనడానికి బలం చేకూరుతోంది.

కాంగ్రెస్‌ నుంచి ‘కొండా’నే.. 
ఇక కాంగ్రెస్‌ నుంచి ప్రస్తుత ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరు ఫైనల్‌ అయింది. మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌ పార్టీలో ఉన్న ఈయన అప్పటి మంత్రి మహేందర్‌రెడ్డితో విభేదాలు తలెత్తడం, ఆధిపత్యం పోరు తదితర కారణాల వల్ల కాంగ్రెస్‌లో చేరారని ప్రచారం జరిగింది. అయితే కారణం ఏదైనా కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం చేవెళ్ల టికెట్‌ ఆయనకు ఖరారు చేసిన తర్వాతే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారని వినికిడి.

ఈ నేపథ్యంలో ఆయనకు కాకుండా మరొకరిని బరిలోకి దించే అవకాశం లేదు. పైగా జిల్లాలో విస్తృత క్యాడర్‌ ఉన్న మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డిని ఢీకొట్టాలంటే సమఉజ్జీ కావాలి. ఆర్థికంగా బలంగా ఉండటమేగాక పార్టీ శ్రేణుల్లోనూ కొండాకు మంచి పేరుంది. దీంతో విశ్వేశ్వర్‌ రెడ్డి వైపు కాంగ్రెస్‌ మొగ్గుచూపిందని సమాచారం. మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్‌ కూడా ఈ స్థానాన్ని ఆశిస్తున్నప్పటికీ కొండా పేరే ఖరారు కానుంది. ఇప్పటికే పీసీసీ కూడా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేరును కాంగ్రెస్‌ ఎన్నికల కమిటీకి సూచించినట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి 
బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డికి ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈయన సికింద్రాబాద్‌ టికెట్‌ను ఆశిస్తున్నా.. పార్టీ ఆదేశాల మేరకు చేవెళ్ల నుంచి బరిలో దిగుతారని తాజా పరిణామాలను పరిశీలిస్తే స్పష్టమవుతోంది. ఈయన ఆశలు పెట్టుకున్న సికింద్రాబాద్‌ స్థానంపై కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ వెనక్కి తగ్గడం లేదు.

ఈ స్థానం నుంచి వీరిద్దరిలో ఒకరికి ఫైనల్‌ అయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. ఈ క్రమంలో కిషన్‌రెడ్డికి ప్రత్యామ్నాయం చేవెళ్ల స్థానమే.  ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యేగా గెలవడం, రాష్ట్ర పార్టీ బాధ్యతలు నిర్వహించడం ఈయనకు కలిసివచ్చే అంశాలు. పైగా పార్టీ శ్రేణుల్లోనూ మాస్‌ లీడర్‌గా పేరు సంపాదించారు. దీనికితోడు కిషన్‌రెడ్డి సొంతూరు ఈ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోకే వస్తోంది. ఈ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి బెక్కరి జనార్దన్‌రెడ్డి కూడా టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే పలు సమీకరణనల నేపథ్యంలో కిషన్‌రెడ్డి వైపే పార్టీ మొగ్గుచూపుతోందని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు