జిల్లా ఓటర్లు  9,68,305

23 Feb, 2019 09:14 IST|Sakshi

ఉమ్మడి జిల్లాలోని ఓటర్ల లెక్క తేలింది. శుక్రవారం ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. ఈసీ జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే.. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా అతివలే అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 27,22,888 ఓటర్లుండగా.. మహిళలు 13,78,186, పురుషులు 13,44,634గా ఉన్నారు. మొత్తంగా చూస్తే పురుషుల కంటే మహిళా ఓటర్లు 33,552 అధికంగా నమోదయ్యారు. కరీంనగర్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలో మహిళలు అధికంగా ఉండగా.. పెద్దపల్లిలో మాత్రం పురుషులు ఎక్కువగా ఉన్నారు. ఇతరులు 68 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 13నియోజకవర్గాలుండగా.. కరీంనగర్, రామగుండం, పెద్దపల్లి మినహాయిస్తే అన్నింటిలో మహిళాఓటర్లే ఎక్కువగా ఉన్నారు. దీంతో రానున్న ఎన్నికల్లో నాయకులు మహిళల తీర్పుతోనే గద్దెనెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కరీంనగర్‌: కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా పురుష ఓటర్లు 4,81,271, మహిళలు 4,87,013, ఇతరులు 21తో కలిపి మొత్తం 9,68,305 మంది ఓటర్లు ఉన్నారు. కరీంనగర్‌ నియోజకవర్గంలో పురుష ఓటర్లు అధికంగా ఉన్నారు. జగిత్యాలలో పురుష ఓటర్లు 3,19,476, మహిళలు 3,39,479 ఓట్లుండగా.. ఐదుగురితో కలుపుకుని మొత్తం 6,58,960 ఓట్లున్నాయి. పెద్దపల్లి జిల్లాలో పురుషులు 3,34,536 ఉండగా మహిళల ఓట్లు 3,31,405 ఇతరులతో 39 ఓట్లు కలపి మొత్తం 6,65,980 ఓటర్లు ఉన్నారు. పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో పురుషులు అధికంగా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరిశీలించినట్లయితే పురుషులు 2,09,351 ఉండగా మహిళలు 2,20,289 ఇతరులు ముగ్గురుతో కలిపి మొత్తం 4,29,643 ఓటర్లున్నారు.

రానున్న ఎన్నికలు తుదిజాబితాతోనే..
రాబోయే పార్లమెంట్, స్థానిక సంస్థలు, పురపాలక సంఘాలకు జరిగే ఎన్నికల్లో తుది ఓటరు జాబితా ప్రకారమే ఓట్లు వేస్తారు. ఓటు హక్కు ప్రాధాన్యం పెరగడం, వరుస ఎన్నికలు వస్తుండడంతో ఓటు నమోదుపై ఆసక్తి చూపారు. దరఖాస్తులు కూడా ఊహించినదానికంటే ఎక్కువగానే వచ్చాయని సమాచారం. ఈనెల 14వరకు కొత్త ఓటరుగా దరఖాస్తుకు గడువు ఇచ్చి.. తుది జాబితాను శుక్రవారం ప్రకటించారు. ఈ జాబితా ప్రకారమే రానున్న పార్లమెంట్, పురపాలక, స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి.

జిల్లా ఎన్నికల కాంటాక్ట్‌ కేంద్రం ఓటరుగా దరఖాస్తు చేసుకున్నవారికి వెన్నుదన్నుగా నిలిచి చాలామంది సమస్యల పరిష్కారానికి కృషిచేసింది. ఫోన్‌ ద్వారా సమస్య తెలిపితే చాలు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈవోకు అనుసంధానించి కొత్త ఓట్ల నమోదులో కీలకపాత్ర పోషించింది. దేశ, రాష్ట్ర స్థాయిలో కాంటాక్ట్‌ కేంద్రం ద్వారా చాలామంది ఓటరు దరఖాస్తు చేసుకున్నవారికి వెన్నుదన్నుగా నిలిచింది.   

మరిన్ని వార్తలు