అందుకే సిటీలో ఓటింగ్‌ తగ్గింది

12 Apr, 2019 04:00 IST|Sakshi

భారీగా సొంత ఊళ్లకు తరలి వెళ్లిన హైదరాబాద్‌ వాసులు 

సుమారు 15 లక్షల మందికి పైగా ఉంటారని అంచనా 

నగర శివార్లలోని నియోజకవర్గాల్లో తీవ్ర ప్రభావం 

సాక్షి, హైదరాబాద్‌ : కేవలం నాలుగు నెలల్లో ఎంత తేడా.. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాత్రి పొద్దుపోయే వరకు కూడా పోలింగ్‌ స్టేషన్లు బారులు తీరిన ఓటర్లతో కళకళలాడాయి. గురువారం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్‌ నగరంలోని అనేక చోట్ల ఓటర్లు లేక వెలవెలబోయా యి. ఎన్నికల పట్ల నిరాసక్తత, చాలాచోట్ల ఓటర్లకు పోల్‌ చీటీలు అందకపోవడం వంటి కారణాలతో పాటు లక్షలాది మంది నగరవాసులు పెద్ద ఎత్తున సొంత ఊళ్లకు తరలి వెళ్లడంతో ఈ సారి ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గుముఖం పట్టింది. చాలా మంది నగరవాసులు సొంత ఊళ్లలోనే ఓటు హక్కును వినియోగించుకొనేందుకు ఆసక్తి చూపారు.

దీంతో నగరంలోని పలు నియోజకవర్గాల్లో పోలింగ్‌ బూత్‌ల వద్ద ఎలాంటి సందడి కనిపించలేదు. ఉప్పల్, మల్కాజ్‌గిరి, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌ తదితర ప్రాంతాల్లో నగరవాసుల సొంత ఊరి ప్రయాణం పెద్ద ఎత్తున ప్రభావం చూపింది. గత ఎన్నికల్లో 50 శాతం దాటిన నియోజకవర్గాల్లో ఈ సారి 42 శాతం వరకే నమోదైంది. సుమారు 15 లక్షల మందికి పైగా నగరవాసులు ఏపీలోని వివిధ ప్రాంతాలకు వెళ్లారు. దీంతో శివారు ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లోనే ఈ మార్పు ఎక్కువగా కనిపించింది. శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్,రాజేంద్రనగర్, పటాన్‌చెరు, మల్కాజ్‌గిరి తదితర ప్రాంతాల్లో ఏపీ ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.  

మూడ్రోజుల్లో 1,573 ప్రత్యేక బస్సులు.. 
హైదరాబాద్‌ నుంచి ప్రతీ రోజు 3,500 బస్సులు తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తాయి. ఇవి కాకుండా మరో 1,573 బస్సులను అదనంగా నడిపారు. ఈ నెల 8 నుంచి 11వ తేదీ ఉదయం వరకు ఈ బస్సులు మహాత్మాగాంధీ, జూబ్లీ, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్‌లు, ఉప్పల్, ఎల్‌బీనగర్‌ తదితర ప్రాంతా ల నుంచి వెళ్లాయి. ఈ 4 రోజుల్లో సుమారు 8 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో సొంత ఊళ్లకు వెళ్లారు. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక బస్సులను నడిపారు. మరో 1,000 ప్రైవేట్‌ బస్సులు కూడా ఏపీలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించాయి. ఈ బస్సుల్లో 5 లక్షల మంది ప్రయాణికులు సొంత ఊళ్లకు తరలి వెళ్లారు. నగరవాసులను తమ సొంత ఊళ్లకు రప్పించడంలో ప్రధాన పార్టీలు స్వయంగా రవాణా సదుపాయాలను ఏర్పాటు చేశాయి.  

సికింద్రాబాద్‌ నుంచి రికార్డు స్థాయిలో..  
ఎన్నికల కోసం సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రతి రోజు హైదరాబాద్‌ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే 151 రైళ్లతో పాటు అనూహ్యంగా పెరిగిన రద్దీకి అనుగుణంగా ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు 23 రైళ్లను అదనంగా నడిపింది. సికింద్రాబాద్, లింగంపల్లి, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. కాకినాడ, నర్సాపూర్, విజయవాడ, తిరుపతి, తదితర ప్రాంతాలకు ప్రయాణికులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సికింద్రాబా ద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి రికార్డు స్థాయిలో ప్రయాణికు లు సొంత ఊళ్లకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 10న ఒక్క రోజే 1.24 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్లారు.

మూడ్రోజులపాటు 3,38,538 మంది ప్రయాణికులు ఒక్క సికింద్రాబాద్‌ నుంచే సొంత ఊళ్లకు వెళ్లారు. అలాగే నాంపల్లి రైల్వేస్టేషన్‌ నుంచి 70,231 మంది, 85,382 మంది ప్రయాణికులు లింగంపల్లి స్టేషన్‌ నుంచి బయలుదేరి వెళ్లారు. మరో 64,377 మంది కాచిగూడ స్టేషన్‌ నుంచి వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఎన్నికల సందర్భంగా 5,58,548 మంది ప్రయాణికులు సొంత ఊళ్లకు వెళ్లారు. వీరిలో 4, 32,987 మంది జనరల్‌ బోగీల్లో తరలి వెళ్లిన వారే. ‘‘ఎన్నికల సందర్భంగా ఇలాంటి రద్దీ ఉంటుందని ఊహించలేకపోయాం. కొన్ని రైళ్లలో అప్పటికప్పుడు అదనపు బెర్తులు ఏర్పాటు చేశాం. ప్రయాణికులు కనీసం కూర్చొని వెళ్లేందుకు వీలుగా జనసాధారణ రైళ్లను నడిపాం. సంక్రాంతి రద్దీని తలపించింది’’అని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.   

మరిన్ని వార్తలు