పదవులకు వన్నె తెచ్చేలా పనిచేయాలి

3 Mar, 2017 01:57 IST|Sakshi
పదవులకు వన్నె తెచ్చేలా పనిచేయాలి

లోకాయుక్త జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: అంకితభావంతో పనిచేసి చేపట్టిన పదవులకు వన్నెతెచ్చేలా పనిచేయాలని ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి పేర్కొన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా, తమిళనాడు, కేరళ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తిగా, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌గా, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్తగా ప్రజలకు సత్వర న్యాయం అందించే దిశగా శాయశక్తులా కృషి చేశానని, ఆయా పదవులకు న్యాయం చేసేలా...వన్నెతెచ్చేలా పనిచేశానని వివరించారు. జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి 74వ జన్మదినోత్సవం సందర్భంగా లోకాయుక్త సిబ్బంది కార్యాలయ ఆవరణలో గురువారం పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.

 ఈ సందర్భంగా జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి మాట్లాడుతూ...పాలనా యంత్రాంగం తప్పులను సరిదిద్ది, ప్రజలకు సుపరిపాలన అందేలా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. లోకాయుక్తగా నాలుగున్నరేళ్ల పనితీరు తనకు సంతృప్తిని కల్గించిందన్నారు. తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి పనిచేసినప్పుడు రికార్డు స్థాయిలో కేసులను పరిష్కరించారని తమిళనాడు పూర్వ న్యాయమూర్తులు జస్టిస్‌ గోవిందరాజన్, జస్టిస్‌ కన్నదాసన్‌ వివరించారు. కార్యక్రమంలో ఉపలోకాయుక్త గంగిరెడ్డి, పూర్వ ఉపలోకాయుక్త కృష్ణాజీరావు, రిజిస్ట్రార్‌ జగన్నాథరెడ్డి, డైరెక్టర్‌ (లీగల్‌) నవమోహన్‌రావు, దర్యాప్తు విభాగం డైరెక్టర్‌ నరసింహారెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్‌ శేఖర్‌రెడ్డి, అధికారులు మురళీకృష్ణ, తాజుద్దీన్, అమరేందర్‌రెడ్డి, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు