ఇక వేగంగా భవన నిర్మాణాలు 

11 Feb, 2018 02:04 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో జయేశ్‌ రంజన్‌ తదితరులు

రాష్ట్రంలో బిల్డింగ్‌ మెటీరియల్‌ మ్యానుఫాక్చరింగ్‌ పార్కు

రూ.650 కోట్లతో ప్లాంట్‌ పెట్టనున్న యూఏఈ సంస్థ కెఫ్‌ ఇన్‌ఫ్రా

ప్లాంట్‌ ద్వారా 1,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి

విలేకరుల సమావేశంలో మంత్రి కేటీఆర్, కెఫ్‌ ఇన్‌ఫ్రా చైర్మన్‌ వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కన్‌స్ట్రక్షన్, బిల్డింగ్‌ మెటీరియల్‌ మ్యానుఫాక్చరింగ్‌ పార్కు ఏర్పాటు కానుంది. యూఏఈకి చెందిన కెఫ్‌ ఇన్‌ఫ్రా (కేఈఎఫ్‌ ఇన్‌ఫ్రా), రాష్ట్ర ప్రభుత్వం కలసి సంయుక్తంగా ఈ పారిశ్రామికవాడను నిర్మించనున్నాయి. కెఫ్‌ ఇన్‌ఫ్రా సంస్థ రూ.650 కోట్ల పెట్టుబడితో ఈ పార్కులో కన్‌స్ట్రక్షన్, బిల్డింగ్‌ మెటీరియల్‌ మ్యానుఫాక్చరింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్లాంట్‌ ద్వారా దాదాపు 1,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. పార్కులో ఏర్పాటు కానున్న 60–70 అనుబంధ పరిశ్రమలతో మొత్తం 10 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, దీనికి మూడింతల మందికి పరోక్ష ఉపాధి దొరకనుంది. రంగారెడ్డి లేదా మేడ్చల్‌ల్లో ఈ పార్కు ఏర్పాటుకు 4 స్థలాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు, కెఫ్‌ ఇన్‌ఫ్రా ఫౌండర్‌ చైర్మన్‌ ఫాజిల్‌ కొట్టికొల్లన్‌లు శనివారం హైదరాబాద్‌లో విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 

భవన విడిభాగాలను అమర్చుకోవడమే...
దేశంలో ఎక్కడా లేనివిధంగా కెఫ్‌ ఇన్‌ఫ్రా ఉపయోగించే పరిజ్ఞానంతో అత్యంత వేగంగా నిర్మాణాలు పూర్తి చేయవచ్చని కేటీఆర్‌ తెలిపా రు. ప్లాంట్‌లో నిర్మించే భవన విడిభాగాల (ప్రీ ఫ్యాబ్రికేటెడ్‌ స్ట్రక్చర్స్‌)ను సైట్‌కు తీసుకెళ్లి అమర్చడం ద్వారా తక్కువ సమయంలో నిర్మాణా లు జరపొచ్చన్నారు. కెఫ్‌ ఇన్‌ఫ్రా బెంగళూరులో 13 నెలల్లో ఐటీ పార్కును, కోయంబ త్తూరులో 12 నెలల్లో ఆస్పత్రిని నిర్మించిందన్నారు. తమిళనాడులోని క్రిష్ణగిరిలో ఇప్పటికే ఈతరహా పార్కును నిర్మించిందన్నారు. అందుబాటు వ్యయంతో గృహ నిర్మాణం, ప్రభుత్వం జరిపే నిర్మాణాలు, బ్రిడ్జీలు, మురుగు కాల్వ లు, మురుగు నీటి శుద్ధి ప్లాంట్లు (ఎస్టీజీ) వంటి రకాల నిర్మాణాలకు ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుందన్నారు. దీనితోనే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లనూ నిర్మించే అవకాశముందన్నారు.

స్థానిక ఉత్పత్తుల తయారీకి ప్రోత్సాహం రాష్ట్ర ప్రభుత్వం స్థానికంగా ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తోందని, ప్రభుత్వం జరిపే ప్రొక్యూర్‌మెంట్లలో సైతం వీటికే ప్రాధాన్యత ఇస్తామని కేటీఆర్‌ చెప్పారు. ఇటీవల విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు కెఫ్‌ ఇన్‌ఫ్రా చైర్మన్‌తో ఫోన్‌లో మాట్లాడి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించానని, రాష్ట్రానికి వచ్చిన ఆయన కేవలం ఒకే రోజు వ్యవధిలో ఈ మేరకు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షించదగిన పరిణామమన్నారు. జహీరాబాద్‌లో కన్‌స్ట్రక్చన్‌ మెటీరియల్‌ ఎక్విప్‌మెంట్‌ పార్కు ఏర్పాటు కోసం ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇప్పుడు బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్‌ మ్యానుఫాక్చరింగ్‌ ప్లాంట్‌ సైతం ఏర్పాటు కానుందన్నారు. ఈ పార్కులో తొలుత కెఫ్‌ ఇన్‌ఫ్రా పెట్టుబడి పెట్టనుందని, ఈ కంపెనీ భాగస్వాములు సైతం ఇదే పార్కులో పరిశ్రమలు స్థాపించేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌ తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. 

ప్రభుత్వ సహకారం వల్లే పెట్టుబడులు: కొట్టికొల్లన్‌ 
రాష్ట్రంలో భద్రత, ప్రభుత్వం అందిస్తున్న సహకా రం పరిశీలించాకే పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని కెఫ్‌ ఇన్‌ఫ్రా చైర్మన్‌ ఫాజిల్‌ కొట్టికొల్లన్‌ తెలిపారు. ఢిల్లీ, చండీగఢ్‌తోపాటు అన్ని రాష్ట్రాల నుంచి తమకు ఆహ్వానాలు అందినా తెలంగాణ వైపే మొగ్గు చూపామన్నారు. భౌగోళికంగా దేశం మధ్యలో తెలంగా ణ ఉండటం కూడా ఇందుకు కారణమన్నారు. తాము స్థాపించే ప్లాంట్‌లో వాడే టెక్నాలజీతో ఆస్పత్రులు, పాఠశాలలు, హోటళ్లు, ఐటీ భవనాల నిర్మాణాన్ని అత్యంత తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చని కొట్టికొల్లన్‌ వివరించారు. ప్లాంట్‌లో భవన సామగ్రిని తయారు చేసి నిర్మాణ ప్రాంతానికి తీసుకెళ్లి అమర్చుకోవడం (అసెంబుల్‌) ద్వారా తక్కువ సమయంలో నిర్మాణాలు పూర్తి చేయొచ్చన్నారు. బ్రిడ్జీలు, సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, తాగునీటి సదుపాయానికి సంబంధించిన పనులను 34 నెలలకు బదులు 6 నెలల్లోనే పూర్తి చేయగలమన్నారు.   

మరిన్ని వార్తలు