గ్రాండ్ మారథాన్..

25 Aug, 2014 05:24 IST|Sakshi
గ్రాండ్ మారథాన్..
  •       ఉత్సాహంగా సాగిన రన్
  •      యువతదే పైచేయి
  •      విజేతగా నిలిచిన హర్యానా రైతు బిడ్డ
  •      హాఫ్ మారథాన్‌లో నెగ్గిన బాబూరామ్
  •      5కే రన్ విన్నర్‌గా కార్మికుడి కొడుకు
  • సాక్షి, సిటిబ్యూరో: నగరంలో ఆదివారం నిర్వహించిన ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్ సక్సెస్ అయింది. అన్ని వర్గాల వారు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారు. పరుగులో పాల్గొనేందుకు భారీగా తరలిరావడంతో నిర్వాహకులు సైతం ఆనందంలో మునిగిపోయారు. ఏటా ఇలాంటి రన్ నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు.
     
    ఫుల్ మారథాన్ (42.195 కిలోమీటర్లు) సాగిందిలా...

    నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం ఐదు గంటలకు నగర పోలీసు కమిషనర్ మహేందర్‌రెడ్డి లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ రన్ సంజీవయ్య పార్కు, ఎన్టీఆర్ గార్డెన్, రాజ్‌భవన్ రోడ్డు, శ్రీనగర్ కాలనీ బస్‌స్టాప్, కేబీఆర్ పార్కు, దస్‌పల్లా హోటల్, హైటెక్ సిటీ, అస్కెండస్ సర్కిల్, క్వాలిటీ ఇన్ సర్కిల్, ఐఐఐటీ జంక్షన్, విప్రో సర్కిల్, పోలారిస్ బిల్డింగ్, గోపన్నపల్లి జంక్షన్, హెచ్‌సీయూ మీదుగా గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగిసింది.  
     
    హాఫ్ మారథాన్ (21.1 కిలోమీటర్లు)...

    నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వద్ద ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైంది. ఎన్టీఆర్ గార్డెన్, రాజ్‌భవన్, శ్రీనగర్ కాలనీ బస్‌స్టాప్, న్యూ దస్‌పల్లా హోటల్, హైటెక్ సిటీ, అస్కెండస్ సర్కిల్, క్వాలిటీ ఇన్ సర్కిల్, ఐఐఐటీ జంక్షన్, గచ్చిబౌలి స్టేడియం వద్ద ముగిసింది.
     
    5 కే రన్...

    గచ్చిబౌలి స్టేడియం నుంచి ట్రిపుల్ ఐటీ కూడలి, ఇన్ఫోసిస్, విప్రో సర్కిల్ మీదుగా క్యూసిటీ నుంచి తిరిగి గచ్చిబౌలి స్టేడియం వరకు కొనసాగింది. ఇందులో ఐటీ కంపెనీలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రన్‌ను ప్రారంభించిన తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, సినీ నటులు రానా, సునీల్, నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ మహంతి పరుగులు తీశారు.  
     
    సత్తాచాటిన యువత..

    ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్‌లో యువత సత్తా చాటింది. 42.195 కిలోమీటర్లు పురుషుల ఫుల్‌మారథాన్‌ను హర్యానాలోని మహేందర్‌గడ్‌కు చెందిన 25 ఏళ్ల కరన్ సింగ్ 2 గంటల 24 నిమిషాల 57 సెకన్లలో పరుగెత్తాడు. ఈ ఏడాది జనవరిలో ముంబై మారథాన్‌లో ఇండియన్ మెన్స్ ఫుల్ మారథాన్ విజేతగా నిలిచిన కరన్ అదే స్ఫూర్తితో హైదరాబాద్ మారథాన్‌లోనూ సత్తా చాటాడు. ఇంటర్ వరకు చదువుకున్న హర్యానాలోని విలేజ్ దానిమనియాలికి చెందిన ఈ యువకుడు ప్రస్తుతం పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ యూనిట్‌లో కోచింగ్ తీసుకుంటున్నాడు. ఇతని తండ్రి శ్రీవికారమ్ రైతు. తల్లి సంతోషిణి గృహిణి. అథ్లెట్ కావడమే తన లక్ష్యమని కరన్‌సింగ్ తెలిపారు. ఇదే ఫుల్‌మారథాన్‌లో 2 గంటల 26 నిమిషాల 26 సెకన్లతో పుణె ఆర్మీకి చెందిన వీఐ డంగ్ ఐ, 2 గంటల 28 నిమిషాల 23 సెకన్లతో మూడో స్థానంలో రాజేశ్‌పాల్ సింగ్ నిలిచారు.
     
    మెన్ హాఫ్ మారథాన్‌లో..

     
    మెన్ హాఫ్ మారథాన్‌లో హైదరాబాద్‌లోని ‘ఆర్మీ ఆర్టిలరీ సెంటర్’లో సోల్జర్‌గా పనిచేస్తున్న బాబూరామ్ గంటా 9 నిమిషాల 50 సెకన్లలో 21.1 కిలోమీటర్లను ఛేదించి విజేతగా నిలిచారు. జమ్మూకాశ్మీర్‌కు చెందిన ఈయన హైదరాబాద్‌లోని ఆర్మీ ఆర్టిలరీ సెంటర్‌లో సోల్జర్‌గా పనిచేస్తున్నారు. చిన్నప్పటి నుంచే రన్నింగ్ అంటే ఇష్టమని చెబుతున్నారు. మూడేళ్లుగా నగరంలోని ఆర్మీ ఆర్టిలరీ సెంటర్‌లోనే రన్నింగ్ ప్రాక్టీసు చేస్తున్నారు. గతేడాది హైదరాబాద్ మారథాన్‌లో పాల్గొన్నారు. మంగళూరు నిఫ్ట్ హాఫ్ మారథాన్‌లో రన్ చేసి ప్రథమ స్థానంలో నిలిచారు. ఇదే స్ఫూర్తితో ఈసారి జరిగిన హైదరాబాద్ మారథాన్‌లో విజేతగా నిలబడ్డారు. దీనికి తమ స్నేహితుల సహకారం కూడా ఉందని చెబుతున్నారు. కాగా గంటా 13 నిమిషాల 52 సెకన్లలో నంజుడప్ప, గంటా 18 నిమిషాల 19 సెకన్లలో సతీశ్ కుమార్ రన్ చేసి మూడో స్థానంలో నిలిచారు.
     
    5కే రన్‌లో..
     
    5 కే రన్‌లో కేరళకు చెందిన సందీప్ విజేతగా నిలిచారు. కేరళకు చెందిన ఈయన డిగ్రీ వరకు చదువుకున్నారు. 1,500 మీటర్ల మిడిల్ డిస్టెన్స్ రన్నింగ్‌లో పాల్గొన్నారు. మారథాన్‌లో పాల్గొనడం ఇదే మొదటిసారి. తొలి ఈవెంట్‌లోనే విజేతగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని సందీప్ చెబుతున్నారు.
     
    మహిళ విజేతలు వీరే...
     
    మహిళల ఫుల్‌మారథాన్‌లో షామిలీ సింగ్, రశ్మి, ఎం.సుధ వరుసగా మూడు స్థానాల్లో నిలిచారు. ఉమెన్ హాఫ్ మారథాన్‌ను జ్యోతి గెలిచింది. సీమ, కేఎం రంజన రెండు, మూడు స్థానాల్లో నిలిచారు.
     
    కార్పొరేట్ ట్రోఫీ యూహెచ్‌జీ కైవసం...
     
    ఈ ఈవెంట్‌లో యూనెటైడ్ హెల్త్ గ్రూపు కంపెనీకి చెందిన 800 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. మారథాన్‌లో ఎక్కువ మంది ఉద్యోగులు పాల్గొన్నందుకు కార్పొరేట్ ట్రోఫీని యూహెచ్‌జీ కైవసం చేసుకుంది.

     ‘కేర్’ వైద్య సేవలు

    హ్యాపెనింగ్ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిర్వహించిన ఎయిర్‌టెల్ హైదరాబాద్ మారథాన్‌కు కేర్ ఆస్పత్రుల ఆధ్వర్యంలో వైద్య సేవలు అందించినట్టు ఆ ఆస్పత్రి మీడియా మేనేజర్ ఎం.శివశంకర్ తెలిపారు. వైద్య సేవల్లో భాగంగా రన్ ప్రారంభమైన నెక్లెస్ రోడ్ నుంచి రన్ ముగిసిన గచ్చిబౌలి స్టేడియం వరకు ప్రతి రెండు కిలోమీటర్లకు ఒక పాయింట్ చొప్పున ఏర్పాటు చేసి రన్‌లో పాల్గొన్న వారికి పెయిన్ రిలీఫ్ స్ప్రేలతోపాటు వారికి కావాల్సిన గ్లూకోస్‌లను అందించినట్టు చెప్పారు. మొబైల్ సర్వీసులను కూడా అందించినట్టు తెలిపారు.
     

మరిన్ని వార్తలు