నో ఎంట్రీ పేరుతో దోచుకుంటున్నారు

13 Jul, 2017 00:52 IST|Sakshi

పోలీసుల చర్యలపై డీజీపీకి లారీ యజమానుల ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో సివిల్, ట్రాఫిక్‌ పోలీసుల వేధింపులు ఎక్కువయ్యాయని, అనుమతులున్నా తనిఖీల పేరుతో ఇష్టారా జ్యంగా వారు వ్యవహరిస్తున్నారని రాష్ట్ర లారీ యజమానుల సంఘం ఆరోపించింది. ఈమేరకు ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ ఆధ్వర్యంలో బుధవారం డీజీపీ అనురాగ్‌ శర్మను కలసి ఆ సంఘ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. రోడ్డు ప్రమాదాల కేసుల్లో సీజ్‌ చేసిన లారీలను కోర్టుకు కాకుండా స్టేషన్‌ నుంచి విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని అసోసియేషన్‌ కోరింది.

ప్రమాదాల కేసుల్లో లారీల తప్పున్నా.. లేకున్నా.. పెద్ద వాహనం కాబట్టి కేసులు నమోదు చేస్తున్నారని, తప్పెవరిదో విచారణ జరిపి కేసులు నమోదు చేయాలని కోరారు. రోడ్డు ప్రమాదాల కేసుల్లో సెక్షన్‌ 337, 338, 304ఏలో లారీ డ్రైవర్లకు స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాలని డీజీపీ దృష్టికి తీసుకొచ్చారు. తనిఖీల సమయంలో అన్ని ధ్రువీకరణ పత్రాలు చూపించినా ట్రాఫిక్‌ పోలీసులు లంచాలు డిమాండ్‌ చేస్తున్నారని, ఇవ్వకపోతే డ్రైవర్లను ఇబ్బందులకు గురిచే స్తున్నారని ఆరోపించారు. జంటనగరాల్లో పగటి సమయాల్లో నో ఎంట్రీ ఉందని, అయితే ఔటర్‌ రింగ్‌ రోడ్డు, ఇతర సర్వీస్‌ రోడ్డులో నో ఎంట్రీ పేరుతో ఇష్టారాజ్యంగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని డీజీపీకి ఫిర్యాదు చేశారు.

>
మరిన్ని వార్తలు