పత్తికి వాన దెబ్బ!

22 Jun, 2015 03:29 IST|Sakshi
పత్తికి వాన దెబ్బ!

సాక్షి, హైదరాబాద్: రుతుపవనాలు, అల్పపీడనం కారణంగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలతో పత్తిరైతుకు కొత్త కష్టం వచ్చింది. కొద్దిరోజుల కింద వేసిన పత్తి విత్తనాలు వారంగా కురుస్తున్న వానల కారణంగా కుళ్లిపోతాయేమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. దానివల్ల మళ్లీ విత్తనాలు వేయాల్సి వస్తుందని.. అది ఆర్థికంగా ఎంతో భారమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజులు ఇలాగే వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ ప్రకటించిన నేపథ్యంలో..

ఇప్పటికే వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తక కుళ్లిపోయే అవకాశముందని వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా పత్తిని నల్లరేగడి నేలల్లో వేస్తారని, వాటిలో మొలకెత్తని విత్తనాలు పాడైపోతాయని చెబుతున్నారు.
 
7.3 లక్షల ఎకరాల్లో సాగు
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా ప్రారంభమైంది. రెండు మూడేళ్లతో పోలిస్తే ఈసారి కాలం కలిసివచ్చింది. సీజన్ ప్రారంభమైన జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు సాధారణం కంటే ఎక్కువగా 134 శాతం వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లాలోనైతే ఏకంగా 319 శాతం అదనంగా కురిసింది. రుతుపవనాల ప్రారంభానికి ముందే వర్షాలు రావడంతో రైతులు మొదట పత్తి విత్తనాలే వేశారు. వ్యవసాయశాఖ వేసిన లెక్కల ప్రకారం 7.31 లక్షల ఎకరాల్లో పత్తి సాగు ప్రారంభమైంది. అయితే విత్తనాలు వేశాక వర్షాలు ఊపందుకున్నాయి. అనేకచోట్ల కుంభవృష్టి కురుస్తోంది కూడా.

దీంతో పొలాల్లో నీరు నిలుస్తుండడంతో ఇంకా మొలకెత్తని పత్తి విత్తనాలు భూమిలోనే కుళ్లిపోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు తాత్కాలికంగా నిలిచిపోతే.. పత్తి విత్తనాలు మొలకెత్తుతాయని, ఆ తర్వాత వర్షాలు వచ్చినా నష్టం లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో వాతావరణశాఖ మాత్రం మరో రెండుమూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
 
రూ.100 కోట్ల నష్టం!
రాష్ట్రంలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో 7.31 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనాలు వేయగా.. అందులో ఈ ఆరు జిల్లాల్లోనే 6.35 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. దీంతో ఈ జిల్లాల్లోని 5.5 లక్షల ఎకరాల్లో పత్తి విత్తనం కుళ్లిపోయే ప్రమాదం ఉందని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఒక్కో ఎకరంలో రెండు ప్యాకెట్ల పత్తి విత్తనాలు వేస్తారు. ఒక్కో ప్యాకెట్ ధర రూ.930.. ఈ లెక్కన రైతులు దాదాపు రూ.100 కోట్లకుపైగా నష్టపోయే అవకాశముందని అంటున్నారు.

మరిన్ని వార్తలు