నష్టాలు తగ్గుముఖం పట్టాయి

31 Oct, 2015 20:13 IST|Sakshi

తెలంగాణ ఆర్టీసీ నష్టాలు తగ్గు ముఖం పట్టాయని రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి చెప్పారు. గతేడాది రూ.10 కోట్ల నష్టంతో ఉన్న ఆర్టీసీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టిన చర్యలతో రూ.9 కోట్లకు దిగి వచ్చిందని అన్నారు.  మంత్రి శనివారం ఆదిలాబాద్ జిల్లాకు వెళ్తూ నిజామాబాద్ జిల్లాలోని డిచ్‌పల్లి టీఎస్‌ఎస్‌పీ ఏడో బెటాలియన్‌లో ఆగారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

రాష్ట్ర వ్యాప్తంగా 95 బస్‌డిపోలు ఉండగా 22 డిపోలు లాభాలను సాధించేలా కృషి చేశామన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆర్‌అండ్‌బీ రోడ్ల నిర్మాణ పనులకు రూ.10వేల కోట్లు, పంచాయతీరాజ్ రోడ్ల కు రూ.5వేల కోట్లు మంజూరు చేశారని తెలిపారు. రోడ్డు లేని గ్రామాలకు స్థానిక ఎమ్మెల్యేలు నిధులు మంజూరు చేస్తే బస్సులు నడుపుతామన్నారు. సీఎం కేసీఆర్ కొత్త బస్సుల కొనుగోలుకు రూ.150 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఈ నిధులతో 400 పల్లె వెలుగు బస్సులు, 100 ఏసీ బస్సులు కొనుగోలు చేస్తామన్నారు.

 

మరిన్ని వార్తలు