ఆగమాగం!

31 May, 2020 03:41 IST|Sakshi
వరంగల్‌ రూరల్‌ జిల్లా  జోగంపల్లి కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం బస్తాలను తీసుకొస్తున్న రైతులు

ఉమ్మడి వరంగల్, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షం

కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం

లబోదిబోమంటున్న అన్నదాతలు

ఈదురుగాలుల బీభత్సంతో జనం బెంబేలు

పలుచోట్ల నేలకొరిగిన చెట్లు, విద్యుత్‌ స్తంభాలు

సాక్షి నెట్‌వర్క్‌: ఉమ్మడి వరంగల్, మంచిర్యాల జిల్లాల్లో శనివారం తెల్లవారుజామున కురిసిన వర్షం రైతులను ఆగం చేసింది. మహబూబాబాద్, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో భారీ వర్షం కురవగా.. జనగామ, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లితో పాటు వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోనూ వర్షం కురిసింది. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన వరి ధాన్యం, మొక్కజొన్నలు తడిసి ముద్దయ్యాయి. అంతా నిద్రలో ఉన్న సమయంలో వర్షం కురవగా రైతులు తేరుకుని కొనుగోలు కేంద్రాలకు వచ్చే సరికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాంటాలు కాని ధాన్యంతో పాటు కాంటాలు పూర్తయిన ధాన్యం కూడా తడిసిపోయింది. లారీల కొరత, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోలు పూర్తయిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించడం లేదు.

దీంతో తీరని నష్టం వాటిల్లింది. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వమే మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మంచిర్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించడంతో జనం బెంబేలెత్తిపోయారు. పలు చోట్ల ఇళ్లపైకప్పులు లేచిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. చెట్లు పడిపోయాయి. జిల్లావ్యాప్తంగా సగటున 41.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా భీమారంలో 110 మిల్లీమీటర్ల వర్షం పడింది. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. అర్ధరాత్రికావడం.. భారీ వర్షం రావడంతో ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతలు ఆగమాగం అయ్యారు. జిల్లావ్యాప్తంగా 155 విద్యుత్‌ స్తంభాలు విరిగిపడడంతో విద్యుత్‌ శాఖకు సుమారు రూ.15 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.మంచిర్యాల జిల్లా నస్పూర్‌లో కారుపై పడిన చెట్టు

మరిన్ని వార్తలు