మోసాల ‘కొలువు’

1 Jul, 2015 03:38 IST|Sakshi
మోసాల ‘కొలువు’

ఉద్యోగం... మూడక్షరాల ఈ పదం.. ఏటా వందలాది మంది నిరుద్యోగులను మోసపోయేలా చేస్తోంది. రూ.లక్షలు కోల్పోవడానికి కారణమవుతోంది. కొంతమందిని ఆత్మహత్యలకు పాల్పడేలా చేస్తోంది. ఉద్యోగాలు కావాలనే ఆశతో ఎంతోమంది నిరుద్యోగులు మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. భారీ వేతనాలు వస్తాయనే నమ్మకంతో చేతిలో ఉన్న డబ్బును వదిలించుకుంటున్నారు. వాస్తవాన్ని గుర్తించేసరికి నడిరోడ్డుపై నిలుస్తున్నారు. వీరిని మోసగిస్తున్నవారు మాత్రం రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు.
 
- దగా పడుతున్న నిరుద్యోగులు
- రూ.కోట్లు కొల్లగొడుతున్న నకిలీ సంస్థలు  
- 8 రోజుల్లో మూడు ఘటనలు  
- వెలుగు చూడనివి ఎన్నో...
సాక్షి, సిటీబ్యూరో:
మొన్న గ్రామీణ్ స్వరోజ్‌గార్ యోజనలో ప్రభుత్వ ఉద్యోగాలు... నిన్న విదేశాల్లో కొలువులు... నేడు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పి మోసం... ఇలా నిరుద్యోగులకు ఉద్యోగాల ఆశ చూపుతూ రూ.కోట్లకు కోట్లు దండుకుంటున్నాయి వివిధ నకిలీ సంస్థలు. రూ.వేలల్లో జీతాలిస్తామని మభ్యపెట్టి సులభ రీతిలో డబ్బులు లాగేస్తున్నాయి.   

ఈ తరహా ఘటనలు 8 రోజుల్లో మూడు వెలుగులోకి వచ్చాయి. వివిధ కారణాలతో బయట పడని సంఘటనలు ఎన్నో ఉన్నట్టు సమాచారం. ఉద్యోగం ఇప్పించకపోతారా? అన్న చిన్ని ఆశ నకిలీ సంస్థలను నమ్మేలా చేస్తోంది. ఇంట్లో పరిస్థితుల వల్ల ఉద్యోగం చేయాలనే ఒత్తిళ్లు... చదువయ్యాక ఖాళీగా కూర్చుండలేక మరికొందరు...ఇలా వివిధ కారణాలతో ఉద్యోగం కోసం భారీ మొత్తంలో డబ్బు సమర్పించుకుంటున్నారు. తీరా సంస్థ నకిలీదని తెలిశాక లబోదిబోమంటున్నారు.    
 
పక్కా ప్రణాళికతో...  
కొన్ని సంస్థలు తమపై ఎటువంటి అనుమానం రాకుండా పక్కా ప్రణాళికతో మోసాలకు తెర తీస్తున్నాయి. తియ్యనైన మాటలతో నిరుద్యోగులను నమ్మిస్తున్నాయి. ఈ కోవలోనే గ్రామీణ్ స్వరోజ్‌గార్ యోజనలో ఉద్యోగాలంటూ ఢిల్లీకి చెందిన రమేశ్‌సింగ్, రాకేశ్ సింగ్ ముఠా జ్ట్టిఞ://ఠీఠీఠీ. జటటడజీఛీజ్చీ.జీ వెబ్‌సైట్‌ను సృష్టించి స్థానికుల సహకారంతో పంచాయతీ సర్వేయర్, బ్లాక్ డెవలప్‌మెంట్ సర్వేయర్, డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ సర్వేయర్, స్టేట్ డెవలప్‌మెంట్ సర్వేయర్ ఉద్యోగాలంటూ జాబ్‌సైట్‌లలో, తెలుగు దినపత్రికల్లో భారీగా ప్రకటనలు ఇచ్చారు. వేలల్లో జీతాలంటూ ఎవరికీ అనుమానం రాకుండా పరీక్షలు నిర్వహించారు.

ఇంట ర్వ్యూల పేరిట ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి రెండు లక్షల వరకు వసూలు చేశారు. వీరి వలలో దాదాపు 500 మందికిపైగా పడ్డారని సమాచారం. కింది సిబ్బంది దొరికినా.. సూత్రదారులు ఇంకా పోలీసులకు చిక్కలేదు. మరో కేసులో విదేశీ కంపెనీల్లో ఉద్యోగాలంటూ మెహదీపట్నంలోని రేతిబౌలి ఈ-సేవ సమీపంలో ‘తలత్ మాన్ పవర్ కన్సల్టెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అండ్ టూర్ అండ్ ట్రావెల్స్’ పేరిట ఎమ్‌డీ షేక్ హాఫీజుద్దీన్ నిరుద్యోగులను మోసగించి పోలీసులకు దొరికిపోయాడు.

ఇంకో కేసులో శిక్షణతో పాటు ఉపాధి చూపుతానంటూ ఏడాది క్రితం అమీర్‌పేటలోని కేఆర్ ఏన్‌క్లేవ్‌లో ఏఎంసీ స్వైర్ సంస్థను ఏర్పాటు చేసి ఆన్‌లైన్ ద్వారా అభ్యర్థులను ఆకర్షించాడు భూపతిరాజు. ఒక్కొక్కరి నుంచి రూ.40 వేల వంతున ఫీజు వసూలుచేసి ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఇలా నకిలీ సంస్థల సూత్రధారులు పోలీసులకు చిక్కుతున్నా.. నిరుద్యోగులకు మాత్రం డబ్బులు తిరిగిరావడం లేదు. దీంతో వారంతా తాము చెల్లించిన డబ్బుల కోసం పోలీసు స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.   
 
విద్యావంతులే బురిడీ కొట్టిస్తున్నారు
ఉన్నత చదువులు చదివిన వారే.. సులభ పద్ధతిలో డబ్బు సంపాదించేందుకు ఈ పద్ధతిని ఎన్నుకుంటున్నారు. మరికొందరు కొన్ని సంస్థల్లో ఉద్యోగం చేసి... ఆ జీతం సరిపోక మోసపూరిత మార్గాన్ని ఎంచుకుంటున్నారు. నగరంలో జరిగిన ఈ సంఘటనల్లో ఢిల్లీవాసులు, హైదరాబాద్‌కు చెందినవారే ఉంటున్నారు. ఇలాంటి  వారివిషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో పాటు నిరుద్యోగుల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మోసాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.    
 
పోలీసుల అదుపులో నిందితుడు
సాక్షి, సిటీబ్యూరో:
హైకోర్టు, సిటీ సివిల్ కోర్టులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాల్లో క్లరికల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులను నమ్మించి మోసగించిన మహమ్మద్ గజని (ఎంకే సమీర్ రెడ్డి)ని హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌కు చెందిన మార్కెటింగ్ ఇంటెలిజెన్స్ టీమ్ మంగళవారం అదుపులోకి తీసుకుంది. సంతోష్‌నగర్‌కు చెందిన సమీర్ రెడ్డి సులభంగా డబ్బు సంపాదించాలని ఆశ పడ్డాడు. హైకోర్టు అడ్వొకేట్‌నని నమ్మించి.. ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక్కొక్కరి వద్ద రూ.లక్ష నుంచి లక్షా యాభై వేల వరకు వసూలు చేశాడు.

ఒరిజినల్ సర్టిఫికెట్లు కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత వీరి ఫోన్‌కాల్స్ డైవర్ట్ చేయడంతో పాటు ఉంటున్న ఇల్లు కూడా మారిపోయాడు. తాము మోసపోయామని గ్రహించిన నలుగురు యువకులు పోలీసులను సంప్రదించారు. ఈమేరకు పోలీసులు నిందితుని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి స్వాధీనం చేసుకున్న ఒరిజినల్ సర్టిఫికెట్ల ఆధారంగా ఇతర బాధితుల వివరాలు తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. ఇదిలా ఉండగా... విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని కూకట్‌పల్లిలోని వివేక్‌నగర్‌లో జాబ్ కన్సల్టెన్సీ కార్యాలయం నడుపుతున్న రాజేశ్ కుమార్‌పై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.
 
ఈ జాగ్రత్తలు అవసరం
- ఆన్‌లైన్ ప్రకటనలను అంత సులువుగా నమ్మకూడదు.  
- సంస్థల పూర్వాపరాలు తెలుసుకోవాలి  
- బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు అడుగరు. పేరున్న ఇలాంటి సంస్థల్లో బ్యాక్‌డోర్ ఉద్యోగాలు ఉండవు. అందుకని డబ్బు డిమాండ్ చేసే ఏ సంస్థనూ నమ్మకూడదు.  
- ఉద్యోగావకాశాల కోసం సంస్థల అధికారిక వెబ్‌సైట్‌లలో తప్పనిసరిగా సరిచూసుకోవాలి.   
- హైదరాబాద్‌లో దాదాపు అన్ని ప్రముఖ సంస్థల కార్యాలయాలు ఉన్నందున అవసరమైతే అక్కడికి వెళ్లి క్రాస్‌చెక్ చేసుకోవాలి.   
- విదేశీ కంపెనీల్లో భారత వర్కర్లను నియమించేందుకు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ప్రొటెక్టర్ జనరల్ ఆఫ్ ఇమిగ్రేషన్ నుంచి లెసైన్స్ ఉందో లేదో సరిచూసుకోవాలి. అన్నీ బాగుంటేనే ముందుకెళ్లాలి.

మరిన్ని వార్తలు