చిట్టీల పేరుతో కుచ్చుటోపీ

8 Sep, 2014 03:13 IST|Sakshi

- రూ. కోటితో వ్యాపారి పరార్
- ఆందోళనలో బాధితులు
- గతంలోనూ పలు సంఘటనలు
బోధన్ టౌన్ : కూలినాలి చేసుకొని డబ్బులు కూడబెట్టుకున్న పేదల డబ్బును దోచుకొని పారిపోతున్నారు చిట్టీల వ్యాపారులు. మోసపోయామని తెలుసుకొన్న తర్వాత బాధితులు లబోదిబోమంటున్నారు. ఇలా ఓ వ్యాపారి మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. బోధన్ మండలంలో చిట్టీల వ్యాపారం జోరుగా సాగుతోంది. సుమారు 200లకుపైగా చిట్టీలు నడుస్తున్నాయి. రూ. 50 వేల నుంచి రూ. 10 లక్షల వరకు చిట్టీలు నడుపుతున్నారు. నెలవారీగానే కాకుండా రోజువారీగానూ చిట్టీలున్నాయి. ఇలా ఓ వ్యాపారి పలుచిట్టీలు నిర్వహించాడు.

అతడు ఎల్‌ఐసీ ఏజెంట్ కూడా కావడంతో చాలా మంది చిట్టీలు కట్టారు. ఇలా కోటి రూపాయల వరకు వసూలు చేసిన సదరు వ్యాపారి ఇరవై రోజుల క్రితం పరారైనట్లు తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అత డి వద్ద చిట్టీలు కట్టినవారు లబోదిబోమంటున్నారు. నెల రోజుల క్రితం మండలంలోని సాలంపాడ్ గ్రామానికి చెందిన ఓ చిట్టీల వ్యాపారి అందరినీ నమ్మించి రూ. 40 లక్షలతో ఉడాయించాడు. ఇది పోలీసుల దృష్టికి సైతం వచ్చింది.

గతంలో మినార్‌పల్లి, ఊట్‌పల్లి, బోధన్ పట్టణానికి చెందిన వడ్ల వ్యాపారులు, ఓ ఫైనాన్స్ వ్యాపారి ప్రజలకు కుచ్చుటోపీ పెట్టి ఉడాయించిన సంఘటనలున్నాయి. బాధితులు పోలీసులను ఆశ్రయించినా ఫలితం ఉండడం లేదు. ప్రజలను మోసం చేస్తున్న చిట్టీలు, ఫైనాన్స్ వ్యాపారులు ఐపీలు పెట్టి దర్జాగా తిరుగుతూనే ఉన్నారు. పోలీసులు స్పందించి మోసగాళ్ల ఆగడాలకు అడ్డుకట్ట పడేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు